Skip to content
తెలంగాణ వార్తలు

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఓటర్ల జాబితా ప్రక్షాళన.. జూన్ 25 నుండి సర్-2026 ప్రారంభం!

Prajapaksham 20 Jun 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఓటర్ల జాబితా ప్రక్షాళన.. జూన్ 25 నుండి సర్-2026 ప్రారంభం!

Telangana Begins Voter List Purification Drive, Door-to-Door Survey from June 25

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితాను పారదర్శకంగా మార్చేందుకు భారత ఎన్నికల సంఘం ఒక ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకుంది. సుమారు 25 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో తొలిసారిగా ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) – 2026’ పేరుతో ఓటర్ల జాబితా సమగ్ర ప్రక్షాళన కార్యక్రమాన్ని జూన్ 25 నుంచి ప్రారంభించనున్నారు. ఈ భారీ సర్వే కార్యక్రమ సన్నద్ధతపై రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి (సీఈఓ) సి. సుదర్శన్ రెడ్డి గురువారం అధికారులతో ఒక ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సమీక్షలో భాగంగా జీహెచ్ఎంసీ కమిషనర్, జిల్లా ఎన్నికల అధికారులు (డీఈఓలు), ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు (ఈఆర్ఓలు) ,అదనపు సీఈఓ డాక్టర్ వాసం వెంకటేశ్వర్ రెడ్డిలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. భారత ఎన్నికల సంఘం (ECI) జారీ చేసిన కఠిన మార్గదర్శకాలకు అనుగుణంగా, ఈ ప్రక్షాళన ప్రక్రియను అత్యంత పారదర్శకంగా ,కచ్చితత్వంతో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించే బూత్ లెవల్ అధికారులు (బీఎల్ఓలు), రాజకీయ పార్టీల ఏజెంట్లతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ, ఈ ప్రత్యేక డ్రైవ్‌పై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని ఆయన సూచించారు.

ఈ ప్రత్యేక కార్యక్రమ ప్రక్రియలో భాగంగా జూన్ 25 నుంచి జూలై 24 వరకు నెల రోజుల పాటు బీఎల్ఓలు స్వయంగా ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్ల వివరాలను సేకరించి, వాటిని క్షుణ్ణంగా ధృవీకరిస్తారు. జాబితాలో పేరుకుపోయిన నకిలీ ఓటర్లు, మరణించిన వారు ,శాశ్వతంగా చిరునామా మారిన వారి వివరాలను గుర్తించి తొలగించనున్నారు. అదే సమయంలో అర్హత ఉండి ఓటు హక్కు లేని ప్రతి ఒక్కరికీ కొత్తగా ఓటు కల్పించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 35,000 మందికి పైగా బీఎల్ఓలు, దాదాపు 26,000 మంది బూత్ లెవల్ ఏజెంట్లు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటారు. ఈ సర్వేలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 3.39 కోట్ల మంది ఓటర్ల వివరాలను సమగ్రంగా పరిశీలిస్తారు. 2026 అక్టోబర్ 1వ తేదీని అర్హత తేదీగా (Qualifying Date) ప్రామాణికంగా తీసుకుని తుది ఓటరు జాబితాను ప్రచురించనున్నారు. ప్రజాస్వామ్యంలో కీలకమైన ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకొని తమ ఓటు వివరాలను సరిచూసుకోవాలని ఎన్నికల అధికారులు విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *