Skip to content
తెలంగాణ వార్తలు

ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు గుడ్‌బై.. గ్రేహౌండ్స్‌ విభాగాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్

Prajapaksham 10 Jun 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు గుడ్‌బై.. గ్రేహౌండ్స్‌ విభాగాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్

CV Anand Announces End of Friendly Policing and Greyhounds Deployment in Hyderabad

తెలంగాణ రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ పలు కీలక నిర్ణయాలను, మార్పులను ప్రకటించారు. ఇకపై రాష్ట్రంలో ‘నో ఫ్రెండ్లీ పోలీసింగ్’ విధానాన్ని అమలు చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. అయితే, ఈ విధానం సాధారణ ప్రజల కోసం కాదని, వారికి ఎల్లప్పుడూ గౌరవం ఉంటుందని తెలిపారు. రౌడీలు, గుండాలు, అసాంఘిక శక్తులపై మాత్రం ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు.

రాష్ట్రంలో మావోయిజం పూర్తిగా అంతమొందిందని ప్రకటించిన డీజీపీ, ఇందుకోసం ప్రత్యేకంగా ఏర్పాటైన ప్రతిష్టాత్మక ‘గ్రేహౌండ్స్’ విభాగాన్ని రద్దు చేస్తున్నట్లు ఒక సంచలన నిర్ణయాన్ని వెల్లడించారు. ఈ విభాగంలో విధులు నిర్వహిస్తున్న 1,700 మంది సుశిక్షితులైన సిబ్బందిని ప్రస్తుతం అత్యంత ఆవశ్యకమైన సైబర్ క్రైమ్, నార్కోటిక్ (మాదకద్రవ్యాల నిరోధక) శాఖలకు బదిలీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం పోలీసు శాఖకు సైబర్ నేరాలు ఒక పెద్ద సవాల్‌గా మారాయని, అందుకే ఆ విభాగంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. సైబర్ కేటుగాళ్ల ఆట కట్టించేందుకు పోలీసు సిబ్బందికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన శిక్షణ ఇస్తున్నామని, దీని ద్వారా సైబర్ విభాగాన్ని మరింత బలోపేతం చేయనున్నట్లు వివరించారు.

మరోవైపు యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న గంజాయి, డ్రగ్స్ మహమ్మారిపై తాము యుద్ధం ప్రకటిస్తున్నట్లు డీజీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. మాదకద్రవ్యాల సరఫరా, విక్రయాలను పూర్తిగా అరికట్టేందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశామని చెప్పారు. సమాజానికి ముప్పుగా మారిన డ్రగ్స్ నెట్‌వర్క్‌లను త్వరలోనే పూర్తిగా ధ్వంసం చేస్తామని ఆయన ఈ సందర్భంగా గట్టి భరోసా ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *