Skip to content
భారతదేశం వార్తలు

బెంగాల్ రాజకీయాల్లో ప్రకంపనలు.. 20 మంది TMC ఎంపీలు ఎన్డీయేకి మద్ధతు.. ఇంకో ఎదురుదెబ్బ ఏంటంటే..

Prajapaksham 08 Jun 2026 1 నిమిషాల పఠనం భారతదేశం
బెంగాల్ రాజకీయాల్లో ప్రకంపనలు.. 20 మంది TMC ఎంపీలు ఎన్డీయేకి మద్ధతు.. ఇంకో ఎదురుదెబ్బ ఏంటంటే..

TMC MP Kakoli Ghosh Dastidar Says 20 TMC MPs Wrote to Om Birla to Join NDA

తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీలో గత కొద్ది రోజులుగా సాగుతున్న అంతర్గత విభేదాలు సోమవారం నాటికి తీవ్ర రాజకీయ సంక్షోభానికి దారితీశాయి. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో మొదలైన తిరుగుబాటు ఇప్పుడు పార్లమెంటరీ స్థాయికి పాకింది. దాదాపు 20 మంది లోక్‌సభ ఎంపీలు ఎన్డీఏకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు సీనియర్ ఎంపీ కాకోలి ఘోష్ దస్తిదార్ ప్రకటించడం రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనం సృష్టించింది.

ప్రస్తుతం లోక్‌సభలో టీఎంసీకి 28 మంది ఎంపీలు ఉండగా, వారిలో 20 మంది ఎంపీలు తాము ఎన్డీఏకు మద్దతు ఇస్తున్నట్లు స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. తాను ఇప్పటికీ లోక్‌సభలో పార్టీ అధికారిక చీఫ్ విప్‌గా కొనసాగుతున్నానని, తోటి సభ్యుల సంప్రదింపుల తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నానని కాకోలి ఘోష్ దస్తిదార్ స్పష్టం చేశారు. పార్టీ అధిష్ఠానం ఆమెను తొలగించి కళ్యాణ్ బెనర్జీని నియమించినప్పటికీ, ఆ విషయాన్ని లోక్‌సభ సచివాలయానికి అధికారికంగా తెలియజేయకపోవడాన్ని అసమ్మతి వర్గం తమకు అనుకూలంగా మార్చుకుంది. ఫిరాయింపుల నిరోధక చట్టం నుండి రక్షణ పొందేందుకు అవసరమైన మూడింట రెండు వంతుల మెజారిటీ ఈ 20 మంది ఎంపీలతో లభిస్తుంది కాబట్టి, వీరు తక్షణమే రాజీనామా చేయకుండా ఒక ప్రత్యేక పార్లమెంటరీ కూటమిగా ఏర్పడి ఎన్డీఏకు మద్దతు ఇవ్వాలని వ్యూహాత్మకంగా భావిస్తున్నారు.

ఈ పరిణామాల మధ్యే టీఎంసీకి చెందిన అత్యంత సీనియర్, వాగ్ధాటి కలిగిన నాయకుడు సుఖేందు శేఖర్‌ రాయ్‌ తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడం పార్టీకి మరింత కోలుకోలేని దెబ్బగా మారింది. పార్టీని వీడుతున్నట్లు ఆయన మమతా బెనర్జీకి లేఖ రాశారు. అందులో పార్టీలో విచ్చలవిడిగా పెరిగిపోయిన అవినీతిని, మహిళలపై తీవ్ర అణచివేతను, వివిధ రంగాలలో నెలకొన్న తీవ్ర అరాచకాన్ని ప్రజలు తిరస్కరించారని స్పష్టం చేశారు. అదే సమయంలో బెంగాల్ చరిత్రలో తొలిసారిగా ఓటర్లు బీజేపీకి భారీ విజయాన్ని అందించారంటూ ఆ పార్టీపై ఆయన ప్రశంసలు కురిపించారు.

ఇప్పటికే పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో కూడా టీఎంసీ నాయకత్వానికి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. సోవన్‌దేబ్ చటోపాధ్యాయను ప్రతిపక్ష నాయకుడిగా నియమించాలన్న పార్టీ హైకమాండ్ నిర్ణయాన్ని ఆ పార్టీకి చెందిన 80 మంది ఎమ్మెల్యేలలో 58 మంది ధిక్కరించి, బహిష్కృత ఎమ్మెల్యే రీతాబ్రత బెనర్జీని ఆ పదవికి ఎన్నుకున్నారు. దీనితో స్పీకర్ ఆయన్నే ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించారు.

ఢిల్లీలో ‘ఇండియా కూటమి’ సదస్సుకు హాజరై బీజేపీకి వ్యతిరేకంగా మమతా బెనర్జీ వ్యూహాలు రచిస్తున్న తరుణంలోనే, సొంత పార్టీ ఎంపీలు ఈ స్థాయిలో తిరుగుబాటు చేయడం ఆమెకు పెద్ద షాక్ ఇచ్చింది. మరో ఎంపీ కోయల్‌ మల్లిక్‌ కూడా తన రాజ్యసభ స్థానానికి రాజీనామా చేయనున్నట్లు వార్తలు వస్తుండటం, మరో 14 మంది టీఎంసీ ఎంపీలు బీజేపీ నేత సువేందు అధికారిని కలవడం చూస్తుంటే ఈ సంక్షోభం మరింత ముదిరేలా కనిపిస్తోంది. ప్రజల తీర్పును అంగీకరిస్తూ తమ భవిష్యత్ రాజకీయ పయనం ఎన్డీఏకు అనుగుణంగానే ఉంటుందని అసమ్మతి నేతలు స్పష్టం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *