Supreme Court: అనుమతి లేకుండా కోర్టు వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే కఠిన చర్యలు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇవిగో..
Supreme Court
Supreme Court: కోర్టులోని న్యాయస్థానాల విచారణలకు సంబంధించిన ఆడియో, వీడియో రికార్డింగ్‌లను అనుమతి లేకుండా ఎడిట్ చేసి సోషల్ మీడియా వేదికల్లో ప్రచారం చేయడం, వాటి ద్వారా ఆర్థిక లాభాలు పొందడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. కోర్టు కార్యకలాపాల రికార్డింగ్‌లను సంబంధిత సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ లేదా ఆయా హైకోర్టుల రిజిస్ట్రార్ జనరల్ ముందస్తు అనుమతి లేకుండా అప్లోడ్ చేయడం, షేర్ చేయడం, రీ-పోస్ట్ చేయడం లేదా వాణిజ్య ప్రయోజనాల కోసం వినియోగించడాన్ని తాత్కాలికంగా నిషేధిస్తూ కీలక మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆదేశాలను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం, జస్టిస్ జయమల్య బాగ్చి, జస్టిస్ వి. మోహన్ సభ్యులుగా ఉన్న బెంచ్ ప్రకటించింది.
అయితే కోర్టు విచారణలపై పత్రికలు, టెలివిజన్ ఛానెల్‌లు, డిజిటల్ మీడియా సంస్థలు చేసే నిష్పాక్షిక వార్తా కథనాలకు ఈ ఆదేశాలు ఎలాంటి ఆటంకం కలిగించవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రజలకు సమాచారం అందించే బాధ్యతను మీడియా కొనసాగించవచ్చని.. అయితే కోర్టు రికార్డింగ్‌లను వక్రీకరించి ప్రచారం చేయడం మాత్రం సహించబోమని పేర్కొంది.
జర్నలిస్ట్ హర్షిత గ్రోవర్ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యం (PIL) విచారణ సందర్భంగా ఈ ఆదేశాలను అత్యున్నత ధర్మాసనం వెలువరించింది. కోర్టు విచారణల్లోని కొన్ని భాగాలను మాత్రమే కత్తిరించి.. అసలు సందర్భాన్ని మార్చి సంచలనాత్మక శీర్షికలతో యూట్యూబ్, ఫేస్బుక్, ఎక్స్ తదితర సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తూ ఆదాయం పొందుతున్నారని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ ధోరణి న్యాయవ్యవస్థ విశ్వసనీయతను దెబ్బతీయడంతో పాటు న్యాయమూర్తులు, న్యాయవాదులు సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు గురయ్యే పరిస్థితి ఏర్పడుతోందని పిటిషనర్ వాదించారు.
పిటిషనర్ తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్, కోర్టు విచారణల ప్రత్యక్ష ప్రసారాలపై తమకు అభ్యంతరం లేదని.. కానీ ఎడిట్ చేసిన క్లిప్‌లను వైరల్ చేయడం వల్ల ప్రజల్లో తప్పుదారి పట్టించే అభిప్రాయాలు ఏర్పడుతున్నాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
విచారణలో పాల్గొన్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కూడా పిటిషన్‌కు మద్దతు తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), డీప్‌ఫేక్ వంటి సాంకేతికతలతో కోర్టు వీడియోలను మార్చి నకిలీ సంభాషణలు సృష్టించే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. దీనివల్ల న్యాయవ్యవస్థ ప్రతిష్ఠ దెబ్బతినే ప్రమాదం ఉందని వివరించారు.
ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ కూడా మీడియా కొన్నిసార్లు తాము చెప్పని మాటలను తమకు ఆపాదిస్తూ తప్పుగా ప్రచారం చేసిన సందర్భాలను ప్రస్తావించారు. మరోవైపు జస్టిస్ జయమల్య బాగ్చి మాట్లాడుతూ.. డిజిటల్ యుగంలో కోర్టు రికార్డింగ్‌ల నియంత్రణ పెద్ద సవాలుగా మారిందని, న్యాయస్థానాలు వినోద వేదికలుగా మారకుండా తగిన నియంత్రణలు అవసరమని అభిప్రాయపడ్డారు.
ఈ కేసులో కేంద్ర ప్రభుత్వానికి, మెటా, ఎక్స్ వంటి సోషల్ మీడియా సంస్థలకు, దేశంలోని అన్ని హైకోర్టులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. కోర్టు లైవ్‌స్ట్రీమింగ్ అమలుపై నివేదికలు సమర్పించాలని హైకోర్టులను ఆదేశించడంతో పాటు, ఈ నిబంధనల అమలును పర్యవేక్షించే నోడల్ మంత్రిత్వ శాఖలను గుర్తించాలని కేంద్రానికి సూచించింది. న్యాయవ్యవస్థలో పారదర్శకతను కొనసాగిస్తూనే, డిజిటల్ దుర్వినియోగాన్ని అరికట్టడమే ఈ చర్యల ప్రధాన ఉద్దేశమని ధర్మాసనం స్పష్టం చేసింది.