543 నుండి 824కు పెరగనున్న లోక్‌సభ స్థానాలు.. తెలుగు రాష్ట్రాల్లో చీలే కీలక నియోజకవర్గాలు ఇవే..
Lok Sabha Seats Likely to Increase in Telangana After Delimitation
దేశంలో లోక్‌సభ నియోజకవర్గాల సంఖ్యను ప్రస్తుతమున్న 543 నుండి 824కు పెంచాలని ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలి కేంద్ర ప్రభుత్వానికి కీలక సిఫార్సు చేసింది. ఓటింగ్ శాతాన్ని పెంచడం ,పరిపాలనా సౌలభ్యం లక్ష్యంగా రూపొందించిన తాజా అధ్యయన పత్రంలో ఈ వివరాలను వెల్లడించింది. ఈ ప్రతిపాదన ప్రకారం, ప్రస్తుతమున్న స్థానాల్లో 373 నియోజకవర్గాలను యథాతథంగా ఉంచాలని, మిగిలిన వాటిలో 59 స్థానాలను రెండేసి చొప్పున, 111 స్థానాలను మూడేసి చొప్పున మొత్తం 170 నియోజకవర్గాలను విభజించాలని సూచించింది.
ఈ పునర్విభజన ప్రక్రియలో పట్టణ, ఎస్సీ, ఎస్టీ, మహిళల జనాభాతో పాటు భాషా సమీకరణాలు, భాషా వైవిధ్యం ,గత లోక్‌సభ ఎన్నికల్లో నమోదైన పోలింగ్ శాతాలను ప్రధాన ప్రాతిపదికగా తీసుకోవాలని ప్రతిపాదించింది. కేంద్ర ప్రభుత్వం గతంలో డీలిమిటేషన్ బిల్లు సందర్భంగా మొత్తం స్థానాలను 815కు పెంచే అవకాశముందని పేర్కొనగా, ఆర్థిక సలహా మండలి అంతకంటే ఎక్కువగా 824 స్థానాలను సిఫార్సు చేయడం గమనార్హం.
ఈ నివేదిక ప్రకారం తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోని పలు కీలక నియోజకవర్గాల విభజనకు మండలి మొగ్గు చూపింది. తెలంగాణలో హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి ,మెదక్‌లను మూడేసి నియోజకవర్గాలుగా, అలాగే చేవెళ్లను రెండు నియోజకవర్గాలుగా విభజించాలని సూచించింది. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే రాజంపేట, కడప, నంద్యాల, కర్నూలు, అనంతపురం ,విశాఖపట్నంలను మూడుగా, అలాగే మచిలీపట్నం నియోజకవర్గాన్ని రెండుగా మార్చాలని ప్రతిపాదించింది.
ముఖ్యంగా హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలోని భాషా సమీకరణాలను ప్రస్తావిస్తూ… ఇక్కడ 10.66 లక్షల మంది (మొత్తం ఓటర్లలో 64%) ఉర్దూ మాట్లాడేవారు ఉన్నారని, అలాగే తెలుగు మాట్లాడేవారు 28%, హిందీ మాట్లాడేవారు 5.15% ఉన్నారని నివేదికలో పేర్కొంటూ ఈ స్థానాన్ని 3గా విభజించాలని స్పష్టం చేసింది.
ఈ సిఫార్సులకు గల ప్రధాన కారణాలను విశ్లేషిస్తూ… గత 2024 ఎన్నికల నాటికి దేశంలో ప్రతి లోక్‌సభ నియోజకవర్గంలో సగటున 18.2 లక్షల మంది ఓటర్లు ఉన్నారని మండలి తెలిపింది. గత 2009, 2014, 2019, 2024 ఎన్నికల సరళిని పరిశీలిస్తే, భౌగోళికంగా పెద్ద నియోజకవర్గాల్లో ఓటింగ్ శాతం తక్కువగా నమోదవుతోందని, చిన్న నియోజకవర్గాల్లోనే ప్రజలు ఎక్కువగా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారని వెల్లడించింది.
నియోజకవర్గాల పరిమాణాన్ని తగ్గించి పునర్విభజన చేయడం వల్ల జాతీయ స్థాయిలో ఓటింగ్ శాతం 2.32% పెరుగుతుందని, తద్వారా దేశవ్యాప్తంగా అదనంగా మరో 2.23 కోట్ల మంది ఓటర్లు ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములు అవుతారని అంచనా వేసింది. ఈ నూతన విధానం అమల్లోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌లో 3.52% ,తెలంగాణలో అత్యధికంగా 6.55% ఓటింగ్ పెరిగే అవకాశం ఉంటుందని ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలి తన నివేదికలో స్పష్టం చేసింది.