Skip to content
జాతీయం వార్తలు

మోదీకి నిద్ర పట్టలేదా? నిద్ర పోలేదా?

Prajapaksham 30 Jul 2026 1 నిమిషాల పఠనం జాతీయం
మోదీకి నిద్ర పట్టలేదా? నిద్ర పోలేదా?

Modi

ఆయిరబోయిన బిక్షపతి (అగల్‌ జోయా)

మోదీకి నిద్ర పట్టలేదా? నిద్ర పోలేదా? అధికారానికి రెండు రకాల రాత్రులు ఉంటాయి. ఒకటి విజయాల తర్వాత వచ్చే నిశ్చింత రాత్రి. మరొకటి ప్రజల మనసులో ఏదో మారుతుంది అనే సంకేతం మొదటిసారి వినిపించిన తర్వాత వచ్చే రాత్రి. మొదటి రాత్రిలో శరీరం విశ్రాంతి తీసుకుంటుంది. రెండో రాత్రిలో కళ్ళు మూసుకున్నా ఆలోచనలు మేల్కొని ఉంటాయి. ఎందుకంటే అధికారాన్ని నిజంగా మేల్కొలిపేది ప్రతిపక్షం కాదు. ఎన్నికలు కాదు. మీడియా కాదు. ప్రజలు నిశ్శబ్దంగా తమ అభిప్రాయాన్ని మార్చుకోవడం ప్రారంభించిన క్షణమే. సింహం గర్జించడం ఆపిన రోజు అడవి మారదు. జింక భయపడడం మానేసిన రోజు అడవి మారుతుంది. రాజకీయా ల్లో కూడా అంతే. అధికారాన్ని కదిలించేది ప్రతిపక్షం కాదు. ప్రజల మనసులో మారిపోయిన లెక్క. చరిత్రలో ఎన్నో ప్రభుత్వాలు ఎన్నికల్లో ఓడిపోయిన రోజున బలహీ న పడలేదు. తమ గురించి రాసుకున్న కథను మార్చడం ప్రారంభించిన రోజే వాటి అసలు పరీక్ష మొదలైంది. అందుకే ప్రజల నిశ్శబ్దాన్ని చిన్నచూపు చూసిన ప్రతి అధికారం ఒకరోజు తన సొంత నిశ్శబ్దానికి సమాధానం చెప్పాల్సి వస్తుంది. జర్మనీకి చెందిన పాస్టర్‌మార్టిన్‌నీల్‌మోర్‌ఒక గొప్ప హెచ్చరికను ప్రపంచానికిఇచ్చాడు.
‘First they came for communi sts, next for the trade unionists, later for the Jews, I remained silent until they finally came for me what can I do’. ఈ చిన్న వాక్యంలో ఒక పెద్ద సత్యం తాగి ఉంది. అన్యాయం ఒక్కరోజులో సమాజాన్ని చుట్టుముట్టదు. అది ఒక్కో సమస్యగా, ఒక్కో వర్గాన్ని తాకుతూ ముందుకు సాగుతుంది. ప్రతిసారి అది నా సమస్య కాదు అని సమాజం మౌనంగా ఉన్న కొద్దీ అన్యాయం మరింత ధైర్యం తెచ్చుకుంటుంది. చివరికి విడివిడిగా కనిపించిన అసంతృప్తులన్నీ ఒక ప్రవాహంగా కలుస్తాయి.
ఢిల్లీలో చెలరేగిన విద్యార్థుల ఉద్యమాన్ని కూడా కేవలం ప్రశ్నపత్రాల లీకేజ్‌గా మాత్రమే అర్థం చేసుకోవడం సరైనది కాదు. దానికి ముందే నిరుద్యోగంపై పెరిగిన ఆందోళన, విద్యా వ్యవస్థపై దెబ్బతిన్న నమ్మకం, ప్రభుత్వ విధానాలపై పేరుకుపోయిన అసంతృప్తి, మూడు పర్యాయాల పాలనలో ఒక్కొక్కటిగా కూడబెట్టుకున్న ప్రశ్నలు, ఇవన్నీ నెమ్మదిగా ఒకచోట చేరాయి. పరీక్షల వివాదం వాటికి నిప్పంటించింది. అందుకే అది కొందరి విద్యార్థుల ఆందోళనగా ఆగిపోలేదు. ఒక తరం తన అసంతృప్తిని దేశం ముందుంచిన రాజకీయ ఘట్టంగా మారింది. అందుకే కాక్రోచ్‌జనతా పార్టీ అనే పేరు కొద్ది రోజుల్లోనే ఒక ప్రతీకం గా మారింది. అది రాజకీయ పార్టీ పేరు కాదు. అవమానాన్ని నిరసనగా మార్చుకున్న యువత ఆత్మగౌరవానికి పెట్టుకున్న పేరు. ఒక ఇన్‌స్టాగ్రామ్‌పోస్ట్‌తో మొదలైన పిలుపు దేశవ్యాప్తంగా వేలాదిమంది విద్యార్థులను ఒకే వేదికపై తీసుకువచ్చి ‘మమ్మల్ని చిన్నచూపు చూస్తే మేము మౌనంగా ఉండం’ అనే ఒక తరం ప్రకటనగా మారింది. లాఠీ చార్జీలు ఉద్యమాన్ని ఆపలేదు, గాయాలు దాని స్వభావాన్ని తగ్గించలేదు. ప్రముఖుల సంఘీభావం దానికి మరింత నైతిక బలం ఇచ్చిం ది. చివరికి ప్రభుత్వం స్పందించి అర్ధరాత్రి మోదీ నుండి ఒక ప్రకటన వెలువడింది. అయితే అది పరిపాలన నిర్ణయం మాత్రమే కాదు అధికారానికి నిద్రలేని రాత్రుల ప్రారంభాన్ని ప్రకటించిన రాజకీయ మలుపు. ఒక మంత్రి రాజీనామా చేయడం పరిపాలన పరిణామం కావచ్చు కానీ దాని వెనుక వినిపించింది యువత గొంతే. ఈ ఉద్యమాన్ని మరింత అర్థం చేసుకోవాలంటే తరాల మనస్తత్వాన్ని కూడా అర్థం చేసుకోవాలి.
జెన్‌X వ్యవస్థను మార్చడానికి ఓపికను నమ్మింది. జెన్‌Y అవకాశాలను నమ్మింది. అభివృద్ధి, ఉద్యోగం, ఆర్థిక పురోగతి, దాని రాజకీయ ఆలోచనలను ప్రభావితం చేశాయి. కానీ జెన్‌Z పూర్తిగా భిన్నం. ఈ తరం నాయకుడిని చూసి చప్పట్లు కొట్టదు. నిర్ణయాన్ని చూసి ప్రశ్నిస్తుంది. ప్రచారాన్ని కాదు పారదర్శకతను కోరుతుంది. హామీలను కాదు, జవాబుదారీతనాన్ని డిమాండ్‌చేస్తుంది. సోషల్‌మీడియా దీని ఆయుధం మాత్రమే కాదు; సమాచారాన్ని తనిఖీ చేసే సాధనం కూడా. అందుకే ఈ తరాన్ని పాత రాజకీయ సూత్రాలతో కొలవడం సాధ్యం కాదు.
గత 10 ఏళ్లలో నరేంద్ర మోదీ చుట్టూ ఒక శక్తివంతమైన రాజకీయ ప్రతిమ నిర్మితమైంది. వరుస ఎన్నికల విజయాలు, కరిష్మా, కేంద్రీకృత నాయకత్వం, అపారమైన ప్రచార యంత్రాంగం ఇవన్నీ కలిపి ఆయనను అపరాజయ (విశ్వగురు) నాయకుడిగా నిలబెట్టాయి. క్రమంగా ఆ ప్రతిమ చుట్టూ ఒక రాజకీ య ‘ఆరా’ ఏర్పడింది. ప్రత్యర్థులు కూడా ఆయనను ఓడించడం అసాధ్యం అనే భావనలోకి వెళ్లిపోయిన సందర్భాలు ఉన్నాయి. కానీ ప్రజాస్వామ్యంలో ఏ ‘ఆరా’ అయినా ప్రజల అంగీకారంతోనే నిలుస్తుంది. అదే అంగీకారం ప్రశ్నగా మారడం ప్రారంభించినప్పుడు ముందుగా కదిలేది అధికారం కాదు. ఆ అధికారం చుట్టూ నిర్మించుకున్న అపరాజేయత భావన. ఆ భావన బీటలు వారినప్పుడు కనిపించేది ఒక వ్యక్తి నిర్ణయం కాదు. అధికార స్వభావములో వచ్చిన మార్పు.
అయితే ఇక్కడ ప్రశ్న ఒక మంత్రి రాజీనామా చేశాడా లేదా అన్నది కాదు. దిగిపోయింది అధికారమా? అహంకారమా? ఎందుకంటే ఈసారి అధికారాన్ని ఎదుర్కొన్నది ప్రతిపక్ష రాజకీయాలు కాదు. నైతిక మనస్సాక్షి.(Moral conscience) అందుకే ప్రభుత్వం ఒక ఉద్యమాన్ని మాత్రమే ఎదుర్కోలేదు. ప్రజల విశ్వాసాన్ని తిరిగి సంపాదించాల్సిన సవాలను ఎదుర్కొంది. ప్రజల విశ్వాసాన్ని కోల్పోవడం ఏ ప్రభుత్వానికైనా అతిపెద్ద రాజకీయ సవాలు. ఎందుకంటే ఎన్నికలు అధికారాన్ని ఇస్తాయి. కానీ ప్రజల విశ్వాసమే ఆ అధికారానికి స్థిరత్వాన్ని ఇస్తుంది
చరిత్రలో ప్రభుత్వాలు ఒక్కరోజులో బలహీన పడలేదు. ప్రజలు వాటిని చూసే దృష్టి మారినప్పుడు బలహీనపడ్డాయి. అధికారానికి అత్యంత ప్రమాదకరమైనది ప్రతిపక్షం కాదు. ప్రభుత్వాన్ని ప్రశ్నించ డం ప్రారంభించిన సమాజం. ఎందుకంటే ఆ ప్రశ్నలను ఎంతకాలం విస్మరించిన అవి చివరికి రాజకీయ తీర్పుగానే తిరిగి వస్తాయి. ఇలాంటి సందర్భాల్లో రాజకీయాల్లో మొదట మారేది ప్రభుత్వాలు కాదు. ప్రజల రాజకీయ దృష్టి. నిన్నటివరకు వ్యక్తుల చుట్టూ తిరిగిన చర్చ నెమ్మదిగా వ్యవస్థవైపు మళ్లుతుంది. రాజకీయాల్లో ప్రశ్నల స్వభావం మారినప్పుడు సమాధానాల స్వభావం కూడా మారక తప్పదు. అదే ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైన మలుపు. ఎందుకంటే ఆ తర్వాత ప్రజలు నాయకులను కాదు. వారి పరిపాలనను కొలవడం ప్రారంభిస్తారు. ఈ ఉద్యమం రేపు ఎటువైపు వెళుతుందో కాలమే చెబుతుంది. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. భారత రాజకీయాల్లో కొత్త ఓటర్‌తన ఉనికిని గట్టిగా తెలియజేస్తున్నాడు. అతడు కులంతో మాత్రమే ఓటు వేయడం లేదు. మతంతో మాత్రమే స్పందించడం లేదు. ఉద్యోగం, విద్య అవకాశాలు, పారదర్శకత, జవాబుదారీతనం వంటి అంశాలు ఇప్పుడు అతని రాజకీయ నిర్ణయాల్లో కీలకంగా మారుతున్నాయి. ఈ మార్పును గుర్తించిన వారే రేపటి రాజకీయాలను అర్థం చేసుకోగలరు. గుర్తించలేని వారు గత విజయాల జ్ఞాపకాలతోనే మిగిలిపోతారు.
రాజకీయాల్లో ప్రతి సంఘటనకు ఒక తక్షణ ప్రభావం ఉంటుంది. కానీ కొన్ని సంఘటనలు అసలు అర్థ కాలం గడిచిన తర్వాతే బయటపడుతుంది. అందుకే ఆ అర్ధరాత్రి వెలవడిన ప్రకటనను ఒక పరిపాలన నిర్ణయంగా మాత్రమే చూడడం సరిపోదు. అది ఒక సమస్యకు ఇచ్చిన సమాధానమా? లేక మారుతున్న రాజకీయ వాస్తవానికి ఇచ్చిన తొలి అంగీకారమా? అన్నది రాబోయే పరిణామాలే చెబుతాయి. అయితే ఒక విషయం మాత్రం స్పష్టం. ప్రజాస్వామ్యంలో ప్రతి నిర్ణయం అధికారంతో ప్రకటించబడుతుంది. కానీ కొన్ని నిర్ణయాలను రాయించేది ప్రజలే.

ట్యాగ్‌లు: CJP Modi Narendra Modi