మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ తప్పు: ఈసీని కలిసిన కాంగ్రెస్ అగ్రనేతలు
Congress Approaches Election Commission Over Rejection of Meenakshi Natarajan's Rajya Sabha Nomination
మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ ఎన్నికల బరిలో నిలిచిన కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, ఏఐసీసీ తెలంగాణ ఇన్‌ఛార్జ్ మీనాక్షీ నటరాజన్ నామినేషన్ తిరస్కరణ వ్యవహారం దేశ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. రిటర్నింగ్ అధికారి ఆనంద్ శర్మ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, అభ్యర్థి మీనాక్షీ నటరాజన్‌లతో కూడిన ఒక ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం బుధవారం కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతో అత్యవసరంగా భేటీ అయింది.
ఈ బృందంలో ప్రముఖ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ, జైరాం రమేశ్, భూపేశ్ బఘేల్, దీపా దాస్‌మున్షీ, రణ్‌దీప్ సింగ్ సుర్జేవాలాలు ఉన్నారు. రిటర్నింగ్ అధికారి నిర్ణయం అత్యంత పేలవంగా, ఏకపక్షంగా ఉందని అభిషేక్ సింఘ్వీ విమర్శించారు. హైదరాబాద్ కోర్టు కేవలం ఒక ప్రైవేటు ఫిర్యాదు ఆధారంగా మీనాక్షీ నటరాజన్‌కు నోటీసు మాత్రమే జారీ చేసిందని, దీనిపై కోర్టు ఇంకా ఎలాంటి విచారణ చేపట్టలేదని ఆయన స్పష్టం చేశారు. ఆమెపై ఎలాంటి క్రిమినల్ కేసు పెండింగ్‌లో లేనందున, రిటర్నింగ్ అధికారి తన నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు.
తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌గా ఉన్న మీనాక్షీ నటరాజన్‌ను ఇక్కడి నేతలు, ప్రజలు నికార్సైన గాంధేయవాదిగానే చూశారు. అయితే తెరవెనుక జరిగిన పరిణామాల ప్రకారం, హైదరాబాద్‌లోని తార్నాక ప్రాంతానికి చెందిన ఓ మహిళా కాంగ్రెస్ నాయకురాలు 2025 ఆగస్టులో నాంపల్లి కోర్టులో ఒక ప్రైవేట్ పిటిషన్ దాఖలు చేశారు. ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకుడి నుండి తనకు ఉన్న వేధింపుల విషయాన్ని పార్టీ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న మీనాక్షీ నటరాజన్ దృష్టికి తీసుకెళ్లినా చర్యలు తీసుకోలేదని, పైగా కేసు వెనక్కి తీసుకోవాలని ఒత్తిడి తెచ్చారని ఆ పిటిషన్‌లో పేర్కొంటూ ఆమెను 4వ రెస్పాండెంట్‌గా చేర్చారు. ఈ పిటిషన్ ఆధారంగా కోర్టు మీనాక్షీ నటరాజన్‌కు హాజరై కౌంటర్ దాఖలు చేయాలంటూ ఒక నోటీసు జారీ చేసింది.
ఈ కేసు వ్యవహారం కాంగ్రెస్ అంతర్గత నేతలకు కూడా సరిగ్గా తెలియకపోయినా, మధ్యప్రదేశ్‌లో మూడో రాజ్యసభ స్థానానికి అభ్యర్థిని నిలిపిన బీజేపీ దీనిని వ్యూహాత్మకంగా వాడుకుంది. తెలంగాణలోని కొందరు కాంగ్రెస్ అసంతృప్త నేతల ద్వారా ఈ ప్రైవేట్ ఫిర్యాదు కాపీలను సేకరించిన మధ్యప్రదేశ్ బీజేపీ నేతలు, నామినేషన్ల గడువు ముగిసేవరకు వేచి చూశారు. నామినేషన్ల పరిశీలన సమయంలో బీజేపీ అభ్యర్థి మహేష్ కేవట్ తరఫు న్యాయవాదులు.. మీనాక్షి తన అఫిడవిట్‌లో తెలంగాణ కోర్టు నోటీసుల వివరాలను పొందుపరచకుండా వాస్తవాలను దాచారని రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును అంగీకరించిన రిటర్నింగ్ అధికారి ఆమె నామినేషన్‌ను తిరస్కరించారు. ప్రస్తుతం ఈ అంశం కేంద్ర ఎన్నికల సంఘం వద్ద ఉండడంతో పాటు, రాబోయే మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల సమీకరణాలను పూర్తిగా మార్చేసింది. కోర్టు నోటీసును క్రిమినల్ కేసుగా పరిగణించవచ్చా లేదా అన్న అంశంపై ఇప్పుడు దేశవ్యాప్తంగా చట్టపరమైన చర్చ నడుస్తోంది.