Coal Block Case: మన్మోహన్ సింగ్‌కు సుప్రీంకోర్టులో ఊరట.. బొగ్గు బ్లాక్ కేటాయింపు కేసులో దివంగత మాజీ ప్రధానికి క్లీన్ చిట్
Manmohan Singh
Coal Block Case: బొగ్గు గనుల కేటాయింపు వ్యవహారంలో దివంగత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌పై నమోదైన క్రిమినల్ కేసును సుప్రీంకోర్టు ఈరోజు పూర్తిగా రద్దు చేసింది. ఆనాడు ప్రత్యేక కోర్టు ఆయనకు జారీ చేసిన సమన్ల ఉత్తర్వులను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేస్తూ.. ఈ కేసును అధికారికంగా క్లోజ్ చేసింది. విచారణ సంస్థలు అందించిన ఆధారాలను తగిన రీతిలో పరిగణనలోకి తీసుకోకుండా స్పెషల్ కోర్టు సమన్లు ఇవ్వడాన్ని తప్పుబడుతూ ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మల్య బాగ్చీ, జస్టిస్ వి. మోహనలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు సంస్థ సీబీఐ దాఖలు చేసిన రెండు విభిన్న క్లోజర్ రిపోర్టుల్లోనూ మన్మోహన్ సింగ్‌కు ఇప్పటికే క్లీన్ చిట్ ఇచ్చినట్లు ధర్మాసనం గుర్తుచేసింది. సీబీఐ నివేదికను పక్కనబెట్టి, నాటి ట్రయల్ కోర్టు సమన్లు జారీ చేయడానికి ఎలాంటి బలమైన లేదా తగిన ఆధారాలు కనిపించడం లేదని న్యాయస్థానం వ్యాఖ్యానించింది.
2005లో ఒడిశాలోని తలబిరా-II బొగ్గు బ్లాక్ కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణలతో 2015లో నాటి ప్రత్యేక కోర్టు తీవ్ర నిర్ణయం తీసుకుంది. అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్, ప్రముఖ పారిశ్రామికవేత్త కుమార మంగళం బిర్లా, మాజీ బొగ్గు శాఖ కార్యదర్శి పి.సి. పరాఖ్‌లకు సమన్లు జారీ చేసింది. అయితే ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ మన్మోహన్ సింగ్ ఆనాడే సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. అత్యున్నత న్యాయస్థానం సమన్ల అమలుపై స్టే విధించింది.
ప్రధానిగా తన విధుల్లో భాగంగానే సదరు నిర్ణయం తీసుకున్నానని.. ఇందులో ఎలాంటి నేరపూరిత ఉద్దేశం లేదా స్వార్థం లేదని మన్మోహన్ సింగ్ స్పష్టం చేస్తూ వచ్చారు. సుదీర్ఘ విచారణ అనంతరం, సీబీఐ అందించిన క్లోజర్ రిపోర్టును ఆమోదిస్తూ సుప్రీంకోర్టు తుది తీర్పునివ్వడంతో మాజీ ప్రధానిపై ఉన్న ప్రధాన ఆరోపణలన్నీ పూర్తిగా తొలగిపోయాయి.