మౌనమవ్వని స్వరం – గద్దర్
Gaddar
డా.జి.వి.వెన్నెల గద్దర్
ఛైర్పర్సన్, తెలంగాణ సాంస్కృతిక సారథి
గుమ్మడి విట్టల్‌రావు అనే పేరుతో జన్మించిన గద్దర్ భౌతికం గా మన మధ్య లేక మూడు సంవత్సరాలు పూర్తయినా, ఆయన స్వరం మాత్రం మౌనమవ్వలేదు. ఆయన పాటలు, భావజాలం, ప్రజలతో మమేకమైన జీవితం ఇప్పటికీ ఉద్యమాలకు స్ఫూర్తినిస్తున్నాయి. ప్రజల బాధను పాటగా, పాటను పోరాటంగా, పోరాటాన్ని చరిత్రగా మలిచిన అరుదైన ప్రజా వాగ్గేయకారుడు గద్దర్.దాదాపు ఆరు దశాబ్దాల పాటు ప్రజలతో మమేక మై, నక్సల్బరీ ఉద్య మం, తెలంగాణ ఉద్యమం, దళిత-బహుజన ఉద్యమం, ప్రజాస్వామ్య హక్కుల ఉద్యమాలు, సాంస్కృతిక ఉద్యమాలకు తన గాత్రంతో ఊపిరి పోశారు. ఆయన పాట కేవలం వినోదం కోసం కాదు; అవి సామాజిక చైతన్యానికి ఆయుధాలు. ప్రభుత్వాలను ప్రశ్నించాయి, అణగారిన వర్గాలకు ఆత్మవిశ్వాసాన్ని నింపాయి.‘బండెనక బండి కట్టి…’, ‘భద్రం కొడుకో…’, ‘మదనసుందరి…’, ‘భారతదేశం భాగ్యసీమరా…’, ‘దళిత పులులమ్మా…’, ‘జ్ఞానం ఒక్కరి సొత్తు కాదు…’, ‘అడవి తల్లికి వంద నం…’ మల్లె చెట్టుకు పందిరివోలె’ వంటి వందలాది పాటలు ప్రజా ఉద్యమాల చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన ఆలపించిన ‘పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న గాన మా… పోరు తెలంగాణమా…’ గీతం ఉద్యమానికి అపూర్వమైన సాంస్కృతిక శక్తిని అందించింది. ఆ పాట అనంతరం తెలంగాణ ఉద్యమం మరింత వేగం పుంజుకుందని చెప్పడం అతిశయోక్తి కాదు. హైదరాబాద్‌లలో విద్యాభ్యాసం చేసిన గద్దర్, కొంతకాలం కెనరా బ్యాంకులో ఉద్యోగం చేసినప్పటికీ, ప్రజా ఉద్యమాలే తన జీవిత లక్ష్యమని నిర్ణయించుకున్నారు. 1971లో దర్శకుడు బి.నరసింగరావు ప్రోత్సాహంతో రచించిన ‘ఆపర రిక్షా’ ఆయన తొలి పాట. అనంతరం విడుదలైన తొలి ఆల్బమ్ ‘గద్దర్’ ఆయనకు శాశ్వత నామధేయంగా మారింది.
హత్యాయత్నం మరింత బలపడిన స్వరం
1997 ఏప్రిల్ 6న గద్దర్‌పై జరిగిన హత్యాయత్నం భారత ప్రజాస్వామ్య చరిత్రలో సంచలనాత్మక ఘటన. ఆయనపై కాల్పులు జరిపి హత్య చేయాలని ప్రయత్నించినప్పటికీ, మరణం అంచుల వరకు వెళ్లి ప్రాణాలతో బయటపడ్డా శరీరంలో బుల్లెట్‌తోనే జీవితాంతం జీవించినా, ఆయన స్వరం మాత్రం మరింత శక్తివంతమైంది. ఈ ఘటన ఆయనను భయపెట్టలేదు; ప్రజలతో ఆయన అనుబంధాన్ని మరింత బలపరిచింది. అనంతరం గద్దర్ కేవలం గాయకుడిగానే కాకుండా ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షకుడిగా, సామాజిక న్యాయ పోరాట యోధుడిగా దేశవ్యాప్తంగా మరింత గుర్తింపు పొందారు. అమరవీరుల కుటుంబాలకు అండగా నిలిచారు. నకిలీ ఎన్‌కౌంటర్లను తీవ్రంగా వ్యతిరేకించారు. దళితులపై జరుగుతున్న హింసను నిరంతరం ప్రశ్నించారు. ఆయన పాటలు వేలాది మంది యువతను సామాజిక ఉద్యమాల వైపు మళ్లించాయి.
తెలంగాణ ఉద్యమానికి సాంస్కృతిక శక్తి
తెలంగాణ రాష్ట్ర సాధన రాజకీయ నాయకత్వం ఒక్కటితో సాధ్యపడలేదు. ప్రజల్లో ఆత్మగౌరవాన్ని, భావోద్వేగాన్ని నింపిన సాంస్కృతిక ఉద్యమం కూ డా అంతే కీలకం. ఆ ఉద్యమానికి గద్దర్ కేంద్రబిందువుగా నిలిచారు. నుంచి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం వరకు వేలాది సభల్లో ఆయన పాటలతో ప్రజలను చైతన్యపరిచారు. గ్రామాల నుంచి నగరాల వరకు ‘శబ్దం’ వంటి సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా తెలంగాణ ఆకాంక్షను ప్రజ నాటారు. జిల్లాల వారీగా సాంస్కృతిక బృందాలను ఏర్పాటు చేసి, పాట నాటికలు, సభల ద్వారా ఉద్యమాన్ని సామాన్య ప్రజల జీవితంలో భాగం చేశారు. పంపిణీలో అన్యాయం, ప్రాంతీయ అసమానతలు, రైతుల ఆత్మహత్యలు, నిరుద్యోగం, కుల వివక్ష, వనరుల దోపిడీ, సాంస్కృతిక అణచివేత వంటి సమస్యలను ఆయన పాటలు ప్రజల ముందుకు తీసుకొచ్చాయి. కుల, మత, వర్గ, ప్రాంత భేదాలకు అతీతంగా తెలంగాణ గుర్తింపును బలోపేతం చేశాయి.
పోరాటమే జీవితం
గద్దర్ జీవితమంతా పోరాటమే. విప్లవ ఉద్యమాల్లో పాల్గొనడంతో పాటు 2004లో ప్రభుత్వం వార్ మధ్య జరిగిన శాంతి చర్చల్లో మధ్యవర్తిగా కీలక పాత్ర పోషించారు. మారుతున్న రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా తన ఆలోచనలను విస్తరించుకుంటూ, రాజ్యాంగ పరిరక్షణ, సామాజిక న్యాయం, కుల నిర్మూలన, ప్రజాస్వామ్య హక్కుల కోసం తన గళాన్ని నిరంతరం వినిపించారు.జీవితాంతంలో సామాజిక సమగ్రత, రాజ్యాంగ వి లువలు, అణగారిన వర్గాల సాధికారతపై ఎక్కువగా దృష్టి సారించారు. భార త్ జోడో యాత్రలో పాల్గొని ప్రజాస్వామ్య పరిరక్షణ అవసరాన్ని ప్రజల్లో చా టిచెప్పారు. మణిపూర్ హింస, మహిళలపై దాడులు, క్రీడాకారిణులపై లైంగిక వేధింపులు, బిల్కిస్ బానో కేసు వంటి మానవ హక్కుల అంశాలపై కూడా తన ఆవేదనను బహిరంగంగా వ్యక్తం చేశారు.
గద్దర్ యుగం
గద్దర్ కేవలం ఒక గాయకుడు కాదు; ఒక ఉద్యమం, ఒక సిద్ధాం ఒక సాంస్కృతిక విప్లవం. ఆ యన కళ పాట, నృత్యం, నాటకం, శారీరక అభిన భావోద్వేగ వ్యక్తీకరణల సమ్మేళనం. డా.బి.ఆర్. అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు ఫూలే, కబీర్ వంటి మహనీయుల ఆలోచనలు ఆయన భావజాలాన్ని ప్రభావితం చేశాయి.తెలంగాణ రాష్ట్రాన్ని రాజకీయాలు సాధించి ఉండవచ్చు; కానీ తెలంగాణ ఆత్మగౌరవాన్ని కోట్లాది ప్రజల హృదయాల్లో నాటిం గద్దర్ పాట. ప్రజల బాధను స్వరంగా, స్వరాన్ని ఉద్యమంగా, ఉద్యమాన్ని చరిత్రగా మలిచిన మహోన్నత ప్రజా కళాకారుడు ఆయన.భౌతికంగా గద్దర్ మన మధ్య లేకపోయినా, ఆయన గళం ఇంకా ప్రజల గొంతుల్లో వినిపిస్తూనే ఉంది. ఆయన పాటలు ఇంకా ఉద్యమాల్లో మారుమోగుతూనే ఉన్నాయి. అందుకే గద్దర్ ఒక వ్యక్తి కాదు యుగం. ఒక సిద్ధాంతం. ఒక శాశ్వత స్ఫూర్తి. మౌనమవ్వని స్వరం.