భారత్‌తో పాటు 54 దేశాలకు US బిగ్ షాక్..బలవంతపు కార్మిక ఉల్లంఘనల ఆరోపణలు..12.5 శాతం అదనపు పన్నుకు ప్రతిపాదన
USTR Proposes 12.5% Additional Duties on India, 53 Nations Over Forced Labour Import Violations
భారత్, అమెరికా (India, US) దేశాల మధ్య ప్రతిపాదిత ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై న్యూఢిల్లీలో కీలకమైన ఉన్నత స్థాయి చర్చలు జరుగుతున్న తరుణంలోనే ఒక ఊహించని పరిణామం చోటుచేసుకుంది. భారతదేశంలో అన్యాయమైన వాణిజ్య పద్ధతులు (Unfair trade practices) కొనసాగుతున్నాయనే తీవ్ర ఆరోపణలతో ‘యూఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ (USTR)’ కార్యాలయం భారత్‌ను దోషుల జాబితాలో చేర్చుతూ సంచలన నిర్ణయం తీసుకుంది. దీనికి తోడు భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే వివిధ రకాల వస్తువులపై 10 శాతం నుంచి 12.5 శాతం వరకు అదనపు సుంకాలను (Additional Tariffs) విధించాలని కూడా అమెరికా ప్రతిపాదించింది.
అమెరికా ట్రేడ్ యాక్ట్ 1974 లోని ‘సెక్షన్ 301’ కింద సుదీర్ఘంగా నిర్వహించిన 60 దర్యాప్తుల నివేదికను యూఎస్‌టీఆర్ అధికారికంగా విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 54 ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో ‘బలవంతపు శ్రమ (Forced Labour)’ ద్వారా తయారయ్యే వస్తువుల దిగుమతులను అడ్డుకోవడానికి లేదా పూర్తిగా నిషేధించడానికి తగినంత కఠినమైన చట్టాలు, చర్యలు లేవని అమెరికా తన దర్యాప్తులో తేల్చిచెప్పింది. అంతర్జాతీయంగా ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్న ఈ 54 దేశాల ప్రతికూల జాబితాలోనే భారతదేశాన్ని కూడా చేర్చడం ఇప్పుడు ప్రపంచ వాణిజ్య వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది.
ఈ వివాదాస్పద నిర్ణయంపై అమెరికా ట్రేడ్ రిప్రజెంటేటివ్ అంబాసిడర్ జామీసన్ గ్రీర్ తీవ్రంగా స్పందించారు. తమకు ఎంతో అత్యంత ముఖ్యమైన వాణిజ్య భాగస్వాములుగా ఉన్న దేశాలు సైతం, బలవంతపు శ్రమతో తయారైన వస్తువుల దిగుమతుల సమస్యను నిర్మూలించడంలో విఫలం కావడం ఎంతమాత్రం అంగీకరించలేని విషయమని ఆయన స్పష్టం చేశారు. ఇలాంటి అక్రమ పద్ధతుల వల్ల అమెరికాకు చెందిన స్వదేశీ కార్మికులు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర అసమానమైన, అన్యాయమైన వాతావరణంలో పోటీ పడాల్సి వస్తోందని ఆయన ఆందోళనతో కూడిన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రెండు దేశాల మధ్య వాణిజ్య బంధాన్ని బలోపేతం చేసుకునేందుకు ద్వైపాక్షిక చర్చలు నడుస్తున్న తరుణంలోనే అమెరికా ఈ రకమైన వ్యూహాత్మక షాక్ ఇవ్వడం గమనార్హం.