Skip to content
ప్రపంచం వార్తలు

అమెరికా-ఇరాన్ మధ్య చారిత్రాత్మక శాంతి ఒప్పందం..పశ్చిమాసియా యుద్ధానికి ముగింపు..

Prajapaksham 18 Jun 2026 1 నిమిషాల పఠనం ప్రపంచం
అమెరికా-ఇరాన్ మధ్య చారిత్రాత్మక శాంతి ఒప్పందం..పశ్చిమాసియా యుద్ధానికి ముగింపు..

US, Iran Presidents Sign Deal to Extend Ceasefire Reopen Strait of Hormuz (Photo-AI Generated Image)

పశ్చిమాసియాలో సుదీర్ఘకాలంగా సాగుతున్న ఉద్రిక్తతలకు ముగింపు పలుకుతూ అమెరికా, ఇరాన్ దేశాల మధ్య చారిత్రాత్మక శాంతి ఒప్పందం కుదిరింది. డీల్‌కు సంబంధించిన అవగాహన ఒప్పందం (MoU) పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ లాంఛనంగా సంతకాలు చేశారు. 14 ప్రధాన అంశాలతో కూడిన ఈ ఒప్పందానికి ‘ఇస్లామాబాద్‌ మెమోరాండం ఆఫ్‌ అండర్‌స్టాండింగ్‌ బిట్వీన్‌ ద యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ అమెరికా అండ్‌ ద ఇస్లామిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ ఇరాన్‌’ అని పేరు పెట్టారు. కొద్ది రోజుల క్రితమే అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాగేర్ ఘాలిబఫ్ కూడా ఈ ఎంఓయూపై సంతకాలు చేయగా.. తాజాగా ఇరుదేశాల అధ్యక్షుల ఆమోదంతో ఈ చారిత్రాత్మక డీల్ తక్షణమే అమలులోకి వచ్చింది.

జీ7 శిఖరాగ్ర సమావేశం ముగిసిన అనంతరం ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ ‘వెర్సైల్స్ ప్యాలెస్‌’లో ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. ఈ వేదికపైనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ శాంతి ఒప్పందంపై సంతకం చేశారు. దీనికి సంబంధించిన వీడియోను వైట్‌హౌస్ అధికారికంగా విడుదల చేసింది. “ట్రంప్ వెర్సైల్స్‌లో ఇరాన్‌తో కుదిరిన ఒప్పందంపై సంతకం చేశారు. ఇది శాశ్వత శాంతికి మార్గం సుగుమం చేస్తుంది. హర్మూజ్ జలసంధి తిరిగి తెరుచుకోనుండటంతో త్వరలోనే ఇంధన ధరలు తగ్గుతాయి” అని ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ సామాజిక మాధ్యమాల్లో ఆనందం వ్యక్తం చేశారు.

వాస్తవానికి ఈ సంతకాల కార్యక్రమం రేపు స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో జరగాల్సి ఉండగా, అంతకంటే ముందే ఫ్రాన్స్ వేదికగా పూర్తి కావడం గమనార్హం. అయితే, షెడ్యూల్ ప్రకారం స్విట్జర్లాండ్‌లో ఇరుదేశాల ప్రతినిధుల అధికారిక సమావేశం యథావిధిగా కొనసాగుతుందని ఇరాన్ అధికారులు స్పష్టం చేశారు.

తాము కూడా ఈ అవగాహన ఒప్పందంపై సంతకం చేశామని ఇరాన్ విదేశాంగ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ ధ్రువీకరించారు. అయితే, 60 రోజుల పాటు అమలులో ఉండే ఈ తాత్కాలిక అవగాహన ఒప్పందాన్ని బలహీనపరిచే ఎలాంటి చర్యలకూ అమెరికా పూనుకోకూడదని ఆయన స్పష్టం చేశారు. ఈ కాలంలో ఇరాన్‌పై కొత్త ఆంక్షలు విధించడం కానీ, పశ్చిమాసియా ప్రాంతంలో అమెరికా సైనిక మోహరింపులను పెంచడం కానీ చేయకూడదని తేల్చి చెప్పారు. అలాగే, తమ వద్ద ఉన్న శుద్ధి చేసిన యురేనియంను దేశంలోనే ఉంచుతామని, దానిని ఎట్టి పరిస్థితుల్లోనూ విదేశాలకు తరలించే ప్రసక్తే లేదని ఇరాన్ స్పష్టం చేసింది.

అమెరికా-ఇరాన్ దేశాల మధ్య చర్చలకు మధ్యవర్తిత్వం వహించిన పాకిస్థాన్ కూడా ఈ సంతకాల ప్రక్రియను ధ్రువీకరించింది. ఈ డీల్‌ను ‘ఇస్లామాబాద్ అవగాహన ఒప్పందం’గా పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అధికారికంగా ప్రకటించారు. ఈ చారిత్రాత్మక ఒప్పందం తక్షణమే అమలులోకి వస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇందులో భాగంగా తొలి అడుగుగా ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హర్మూజ్ జలసంధిని ఇరాన్ పూర్తిగా తెరుస్తుందని, అదే సమయంలో ఇరాన్‌పై ఉన్న నావికా దిగ్బంధాన్ని అమెరికా తక్షణమే ఎత్తివేస్తుందని షెహబాజ్ షరీఫ్ వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *