Skip to content
ప్రపంచం › వార్తలు

US Trade Policy: రష్యా నుంచి చమురు కొనుగోలు చేసుకోండి.. 100 శాతం సుంకాలను ఎత్తివేసిన ట్రంప్..

jagan 17 Oct 2026 1 నిమిషాల పఠనం ప్రపంచం
US Trade Policy: రష్యా నుంచి చమురు కొనుగోలు చేసుకోండి.. 100 శాతం సుంకాలను ఎత్తివేసిన ట్రంప్..

US-Venezuela oil deal: వెనుజులా ఆయిల్ వ్యాపారంలోకి అమెరికా...మీకు మూరెడు...మాకు బారెడు : చమురు వ్యాపారంలో పెంటగాన్‌కు 35% వాటా..?

US Trade Policy: అంతర్జాతీయ వాణిజ్య, రాజకీయ రంగాన్ని తీవ్ర ఉత్కంఠకు గురిచేసిన రష్యా ఆంక్షల వ్యవహారంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అత్యంత సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు. రష్యాతో ముడిపడిన కఠిన ఆంక్షలు, విధించాలనుకున్న అదనపు టారిఫ్‌లను ఎత్తివేస్తూ ఆయన శుక్రవారం రాత్రి అధికారికంగా ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వులు జారీ చేశారు. రష్యా నుంచి అత్యధికంగా క్రూడ్ ఆయిల్ , సహజ వాయువును కొనుగోలు చేస్తున్న భారత్, చైనా వంటి ఆసియా దేశాలకు ట్రంప్ నిర్ణయంతో ఊహించని భారీ ఉపశమనం లభించింది. తమ దేశ జాతీయ ప్రయోజనాలను దృష్ట్యా ఈ ఆంక్షలను సస్పెండ్ చేస్తున్నట్లు ట్రంప్ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొనడమే కాకుండా, దీనికి సంబంధించిన ధృవీకరణ పత్రాన్ని (Certification) అమెరికా కాంగ్రెస్‌కు సమర్పించినట్లు వెల్లడించారు.

గత నెల సెప్టెంబర్ 16న అమెరికా కాంగ్రెస్ ప్రతినిధుల సభలో అత్యంత ప్రాధాన్యత కలిగిన ‘లిండ్సే ఓ. గ్రహమ్ సాంక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ యాక్ట్ 2026’ (Graham Act) బిల్లు ఆమోదం పొందింది. సెప్టెంబర్ 18న అధ్యక్షుడు ట్రంప్ సదరు బిల్లుపై సంతకం చేయడంతో అది అధికారిక చట్టంగా మారింది. ఈ చట్టంలోని ప్రధాన నిబంధనల ప్రకారం.. రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ విరివిగా కొనుగోలు చేస్తున్న మొదటి ఐదు ప్రధాన దేశాలపై అమెరికాకు జరిగే ఎగుమతులపై ఏకంగా 100 శాతం వరకు ద్వితీయ శ్రేణి టారిఫ్‌లు (Secondary Tariffs) విధించే అధికారం వైట్‌హౌస్‌కు లభించింది. చట్టం అమల్లోకి రావడానికి 30 రోజుల గడువును నిర్దేశించగా, ఆ గడువు అక్టోబర్ 18తో పూర్తి కావాల్సి ఉంది. చట్టం ప్రకారం పన్నుల భారం పడితే అమెరికాకు అతిపెద్ద ఎగుమతిదారుగా ఉన్న భారత్‌ తీవ్ర ఆర్థిక నష్టాన్ని చవిచూడాల్సి వచ్చేది.

అయితే, 30 రోజుల గడువు ముగియడానికి కేవలం ఒకరోజు ముందే అధ్యక్షుడు ట్రంప్ అనూహ్య రీతిలో స్పందిస్తూ గ్రహమ్ చట్టం కింద విధించాల్సిన 100 శాతం టారిఫ్‌లు, ఆంక్షల అమలును నిలిపివేస్తూ (Waiver) ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చారు. ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతున్న ఇంధన ధరలు, అమెరికాలో ద్రవ్యోల్బణం సృష్టిస్తున్న ఒత్తిడి , అంతర్జాతీయ చమురు మార్కెట్‌లో లభ్యత తగ్గకుండా చూడటానికే ఈ మినహాయింపు ఇచ్చినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. రష్యా ఇంధనంపై ఆధారపడిన భారత్‌, చైనాలతో తలెత్తే తీవ్ర దౌత్యపరమైన, వాణిజ్యపరమైన విభేదాలను నివారించేందుకు ఈ నిర్ణయం దోహదపడింది. అమెరికా నిర్ణయంతో ముడిచమురు దిగుమతులపై ఎటువంటి ఆర్థిక సవాళ్లు లేకుండా రష్యా నుంచి సునాయాసంగా ఇంధనాన్ని దిగుమతి చేసుకోవడానికి భారత్‌కు మార్గం సుగమమైంది.