Skip to content
తెలంగాణ › వార్తలు

పట్టభద్రులారా మేల్కోండి.. ఓటుహక్కు పొందండి!

Prajapaksham 17 Oct 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
పట్టభద్రులారా మేల్కోండి.. ఓటుహక్కు పొందండి!

vote

కల్లూరు ధర్మేంద్ర, ఏఐవైఎఫ్ జాతీయ కార్యవర్గ సభ్యులు

విద్య మనిషికి జ్ఞానాన్ని ఇస్తుంది. ఆ జ్ఞానం సమాజంలోని సమస్యలను అర్థం చేసుకునే చైతన్యాన్ని కల్పించాలి. ఆ చైతన్యం ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణకు దారితీయాలి. డిగ్రీలు, పీజీలు సాధించిన పట్టభద్రులు తమ వ్యక్తిగత భవిష్యత్తు గురించే కాకుండా, నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న సమస్యలు, విద్యారంగంలో నెలకొన్న సవాళ్లు, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, ప్రైవేటు రంగంలో ఉద్యోగ భద్రత, నాణ్యమైన విద్య, సామాజిక న్యాయం వంటి అంశాలపై కూడా బాధ్యతతో స్పందించాలి. ప్రజాస్వామ్యంలో మన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడానికి, ప్రజాప్రతినిధులను ప్రశ్నించడానికి, పాలనలో జవాబుదారీతనాన్ని కోరడానికి ఓటు ఒక ముఖ్యమైన సాధనం. అందుకే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదును సాధారణ ప్రక్రియగా కాకుండా, విద్యావంతుల ప్రజాస్వామ్య బాధ్యతగా ప్రతి ఒక్కరూ గుర్తించాలి.
పట్టా చేతిలో ఉంది.. మరి ఓటరు జాబితాలో
మీ పేరు ఉందా?
తెలంగాణలో వేలాది మంది యువత ఉన్నత విద్యను పూర్తి చేసుకుని ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు. కొందరు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. మరికొందరు ప్రైవేటు ఉద్యోగాల్లో తక్కువ వేతనాలు, ఉద్యోగ భద్రత లేకపోవడం, పెరుగుతున్న జీవన వ్యయం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వలసలు, స్థానికంగా ఉపాధి అవకాశాల కొరత, ప్రభుత్వ విద్యాసంస్థల్లో వసతుల అవసరం వంటి సమస్యలు కూడా యువత భవిష్యత్తును ప్రభావితం చేస్తున్నాయి. ఈ సమస్యలు పరిష్కారం కావాలంటే ప్రభుత్వ విధానాలపై చర్చ జరగాలి. ప్రజాప్రతినిధులు యువత సమస్యలను శాసనమండలిలో ప్రస్తావించాలి. సంబంధిత శాఖల పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తాలి. విద్యావంతుల ఆకాంక్షలకు ప్రతినిధిత్వం లభించాలి. ఇందుకు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఒక ప్రజాస్వామ్య వేదికగా ఉపయోగపడతాయి. అయితే ఎన్నికల సమయంలో మన అభిప్రాయాన్ని వ్యక్తం చేయాలంటే ముందుగా ఓటరు జాబితాలో మన పేరు ఉండాలి. అర్హత ఉన్న ప్రతి పట్టభద్రుడు ఈ విషయాన్ని గుర్తించి, తన ఓటరు నమోదును పూర్తి చేసుకోవాలి.
రెండు పట్టభద్రుల నియోజకవర్గాలు..
అనేక ప్రజా సమస్యలు
మహబూబ్‌నగర్‌ వరంగల్‌ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గాల్లోని విద్యావంతులు తమ ప్రాంతాల అవసరాలపై చైతన్యంతో వ్యవహరించాలి. హైదరాబాద్‌, రంగారెడ్డి ప్రాంతాల్లో ఉద్యోగ పోటీ, జీవన వ్యయం, నైపుణ్యాలకు తగిన ఉపాధి వంటి అంశాలు ప్రధానమైనవి. మహబూబ్‌నగర్‌ ప్రాంతంలో స్థానిక ఉపాధి అవకాశాల విస్తరణ, గ్రామీణ యువతకు విద్యా, ఉద్యోగ అవకాశాలు ప్రాధాన్యం కలిగిన అంశాలు.
వరంగల్‌ ప్రాంతంలో ఉన్నత విద్య, విశ్వవిద్యాలయాల బలోపేతం, పరిశోధన, ఉద్యోగ నియామకాలపై దృష్టి అవసరం. ఖమ్మం ప్రాంతం లో స్థానిక పరిశ్రమలు, వ్యవసాయ ఆధారిత జీవనోపాధి, యువతకు ఉపాధి అవకాశాల విస్తరణ ముఖ్యమైనవి. నల్గొండతో పాటు పరిసర ప్రాంతాల్లో నాణ్యమైన విద్య, పోటీ పరీక్షలకు శిక్షణ, స్థానికంగా ఉద్యోగావకాశాల కల్పన వంటి అంశాలపై చర్చ జరగాలి.
నమోదు చేసుకోవడంతోనే ఆగిపోవద్దు..
మీ పేరు జాబితాలో ఉందో లేదో చూడండి
ఫారం-18 సమర్పించిన తర్వాత మీ దరఖాస్తు స్థితిని పరిశీలించండి. ముసాయిదా ఓటరు జాబితా ప్రచురితమైనప్పుడు మీ పేరు, వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో నిర్ధారించుకోండి. పేరు లేకపోతే లేదా వివరాల్లో తప్పులు ఉంటే, ప్రకటించిన గడువులో సంబంధిత ఎన్నికల అధికారులను సంప్రదించి తగిన చర్యలు తీసుకోండి. మీకు తెలిసిన అర్హులైన పట్టభద్రులకు కూడా ఈ విషయాన్ని తెలియజేయండి. ఓటరు నమోదు అనేది కేవలం వ్యక్తిగత పని కాదు. అర్హులైన ప్రతి పట్టభద్రుడికి సరైన సమాచారం చేరేలా చూడటం కూడా సామాజిక బాధ్యతలో భాగమే.
ఓటరు నమోదు తేదీలు గడువును మిస్‌ కావద్దు
తెలంగాణలో రాష్ట్రంలో మహబూబ్‌నగర్‌ వరంగల్‌ పట్టభద్రుల నియోజకవర్గాల ఓటరు జాబితాలను కొత్తగా రూపొందిస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్‌లోని ముఖ్యమైన తేదీలు ఇవి:
28సెప్టెంబర్‌ 2026: ఓటరు నమోదు ప్రక్రియ ప్రారంభం.
15 అక్టోబర్‌ 2026: నమోదు ప్రకటన తొలి పునఃప్రచురణ.
25 అక్టోబర్‌ 2026: నమోదు ప్రకటన రెండో పునఃప్రచురణ.
6 నవంబర్‌ 2026: ఫారం-18 దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ.
25 నవంబర్‌ 2026: ముసాయిదా ఓటరు జాబితా ప్రచురణ.
25 నవంబర్‌ డిసెంబర్‌ 2026: క్లెయిమ్‌లు, అభ్యంతరాల స్వీకరణ.
30 డిసెంబర్‌ 2026: తుది ఓటరు జాబితా ప్రచురణ.
ఎవరు అర్హులు? సంబంధిత నియోజకవర్గంలో సాధారణ నివాసిగా ఉండి, గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ లేదా సమాన విద్యార్హతను 31 అక్టోబర్‌ 2023 నాటికి లేదా అంతకుముందు పూర్తి చేసిన అర్హులైన పట్టభద్రులు దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్హత, నివాసానికి సంబంధించిన ఇతర నిబంధనలను అధికారిక మార్గదర్శకాల ప్రకారం నిర్ధారించుకోవాలి.
ఎలా నమోదు చేసుకోవాలి? నిర్దేశిత ఫారం -18 ద్వారా ఆన్‌లైన్‌లో లేదా సంబంధిత ఎన్నికల అధికారుల వద్ద దరఖాస్తు చేయాలి. విద్యార్హత ధ్రువపత్రాలు, అవసరమైన ఇతర పత్రాలను సిద్ధం చేసుకోవాలి. ఇప్పటికే సాధారణ ఓటరు గుర్తింపు కార్డు ఉన్నా, గతంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేసుకున్నా, ఈసారి కొత్తగా దరఖాస్తు చేయాలి. ఎపిక్‌ నంబర్‌ లేకపోయిందనే కారణంతో మాత్రమే దరఖాస్తును తిరస్కరించకూడదని తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి స్పష్టం చేశారు. అయినప్పటికీ అవసరమైన ఇతర పత్రాలు, అర్హత నిర్ధారణ తప్పనిసరి.
అఖిల భారత యువజన సమాఖ్య (ఎఐవైఎఫ్‌) పట్టభద్రులకు విజ్ఞప్తి చేస్తోంది. ఓటరు నమోదు విషయంలో నిర్లక్ష్యం చేయవద్దు. అర్హత ఉన్న ప్రతి పట్టభద్రుడు గడువులోగా దరఖాస్తు చేసుకోవాలి. మీ స్నేహితులు, సహచరులు, కళాశాల మిత్రులు, ఉద్యోగులు, నిరుద్యోగ యువతలో అర్హులైన వారికి ఈ సమాచారాన్ని చేరవేయాలి. అవసరమైన చోట నమోదు ప్రక్రియపై అవగాహన కల్పించాలి. దరఖాస్తు చేసిన తర్వాత ముసాయిదా ఓటరు జాబితాలో పేరు ఉందో లేదో తనిఖీ చేసుకోవాలని అఖిల భారత యువజన సమాఖ్య విజ్ఞప్తి చేస్తోంది.
అర్హత ఉన్న పట్టభద్రులందరూ 6 నవంబర్‌ 2026లోపు ఫారం-18 ద్వారా నమోదు చేసుకోండి. మీ హక్కును కాపాడుకోండి… ప్రజాస్వామ్య బాధ్యతను నిర్వర్తించండి.