Skip to content
తెలంగాణ › వార్తలు

Medical Cadre Dispute: తెలంగాణ–ఏపీ వైద్య ఉద్యోగుల కేడర్ వివాదం.. ఇద్దరు వైద్యులకు హైకోర్టులో షాక్‌.. సుప్రీంకోర్టులో పరిష్కరించుకోవాలని సూచన..

jagan 17 Oct 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
Medical Cadre Dispute: తెలంగాణ–ఏపీ వైద్య ఉద్యోగుల కేడర్ వివాదం.. ఇద్దరు వైద్యులకు హైకోర్టులో షాక్‌.. సుప్రీంకోర్టులో పరిష్కరించుకోవాలని సూచన..

TS High court

Medical Cadre Dispute: ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాల విభజన తదనంతరం.. ఉభయ రాష్ట్రాల మధ్య వైద్య ఉద్యోగుల కేడర్ కేటాయింపు ప్రక్రియపై తలెత్తిన వివాదంలో తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. వైద్య విద్యాశాఖ ప్రొఫెసర్లు డాక్టర్ ఐ. శ్రీలక్ష్మి, డాక్టర్ రత్నం ఆండాళ్ దాఖలు చేసిన పిటిషన్లపై గతంలో ఇచ్చిన ‘స్టేటస్ కో’ (యథాతథ స్థితి) మధ్యంతర ఉత్తర్వులను పొడిగించేందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది.

కేడర్ కేటాయింపులకు సంబంధించిన ప్రధాన వివాదం ఇప్పటికే భారత సుప్రీంకోర్టులో విచారణలో ఉన్నందున, పిటిషనర్లు తమకు ఏవైనా అభ్యంతరాలు ఉంటే అత్యున్నత న్యాయస్థానంలోనే పరిష్కరించుకోవాలని స్పష్టం చేసింది. జస్టిస్ కె. లక్ష్మణ్, జస్టిస్ సుజన కళాసికంతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

రాష్ట్ర విభజన క్రమంలో వైద్య విద్యాశాఖ ఉద్యోగుల కేటాయింపుపై కేంద్ర ప్రభుత్వం 2016 జనవరి 25న జారీ చేసిన తాత్కాలిక ఉత్తర్వులను సవాల్ చేస్తూ పలువురు అధికారులు హైకోర్టును ఆశ్రయించారు. నాటి పిటిషన్లపై తొలుత మధ్యంతర స్టే లభించినప్పటికీ, 2022లో హైకోర్టు ఆ రిట్ పిటిషన్లను కొట్టివేయడంతో బాధిత ఉద్యోగులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ ప్రధాన కేసు సుప్రీంకోర్టు పరిధిలో ఉండగానే, సికింద్రాబాద్ గాంధీ మెడికల్ కాలేజీలో డిప్యుటేషన్‌పై ఉన్న ప్రొఫెసర్ రత్నం ఆండాళ్ , మహేశ్వరం ప్రభుత్వ వైద్య కళాశాల పాథాలజీ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీలక్ష్మిలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయిస్తూ గతనెల తెలంగాణ ప్రభుత్వం రిలీవ్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రిలీవ్ ఆదేశాలను సవాల్ చేస్తూ వారు వెంటనే హైకోర్టును ఆశ్రయించగా.. తొలుత విచారించిన ధర్మాసనం యథాతథ స్థితిని పాటించాలని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.

శుక్రవారం విచారణ సందర్భంగా రాష్ట్ర అధికారుల తీరుపై ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలు, కేంద్ర ప్రభుత్వ వైఖరిని పరిగణనలోకి తీసుకోకుండా ఉద్యోగులను ఏకపక్షంగా ఇతర రాష్ట్రానికి వెళ్లాలని ఎలా ఆదేశిస్తారని ప్రశ్నించింది. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం పిటిషనర్లు సమర్పించిన వినతులపై ప్రభుత్వం ఎప్పుడు నిర్ణయం తీసుకుందో, ఆ వివరాలను సుప్రీంకోర్టుకు ఎప్పుడు తెలియజేశారో స్పష్టమైన సమాచారాన్ని మధ్యాహ్నం నాటికి సమర్పించాలని స్పష్టం చేసింది. ఒకవేళ పూర్తి సమాచారం లభించకపోతే వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి, అవసరమైతే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేరుగా కోర్టుకు హాజరుకావాల్సి ఉంటుందని హెచ్చరించింది.

అనంతరం మధ్యాహ్నం ఇరుపక్షాల న్యాయవాదుల సుదీర్ఘ వాదనలు విన్న ధర్మాసనం, కేడర్ విభజన ప్రధాన కేసు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్నందున తాము ఈ రిట్ పిటిషన్లలో ‘స్టేటస్ కో’ పొడిగించలేమని తేల్చిచెప్పింది. పిటిషనర్లు తమ వాదనలను, అభ్యంతరాలను అత్యున్నత న్యాయస్థానంలోనే లేవనెత్తాలని సూచించింది. కాగా, ఈ పిటిషన్‌లోని ప్రతివాదులందరూ ఈ నెల 29వ తేదీలోగా కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయాలని, ఒకవేళ నిర్ణీత గడువులోగా కౌంటర్లు సమర్పించకపోతే రోజుకు రూ. 25 వేల చొప్పున భారీ జరిమానా విధిస్తామని ధర్మాసనం తీవ్రంగా హెచ్చరిస్తూ తదుపరి విచారణను అక్టోబర్ 29కి వాయిదా వేసింది.