మ్యూజిక్ డైరక్టర్ అనిరుధ్ – కావ్య మారన్ కళ్యాణం… తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి సన్ గ్రూప్ ఛైర్మన్ ఆహ్వానం…
ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈవో కావ్యా మారన్ పెళ్లికి సంబంధించిన వార్తలు మరోసారి సోషల్ మీడియాలో, ఫిల్మ్ వర్గాల్లో జోరుగా చక్కర్లు కొడుతున్నాయి. వీరిద్దరి వివాహ వేడుకకు సంబంధించిన కీలక పరిణామం ఒకటి వెలుగులోకి రావడంతో ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరింది.
సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక ఆహ్వానం
సన్ గ్రూప్ ఛైర్మన్ కళానిధి మారన్, ఆయన సతీమణి శుక్రవారం నాడు హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లారు. సీఎం దంపతులను కలిసి తమ కుమార్తె కావ్యా మారన్ వివాహ రిసెప్షన్‌కు సంబంధించిన ఆహ్వాన పత్రికను అందజేసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. చెన్నై వేదికగా నవంబర్ 21వ తేదీన ఈ గ్రాండ్ రిసెప్షన్ జరగనున్నట్లు ప్రచారం సాగుతోంది.
పెళ్లి డెస్టినేషన్ ఎక్కడ ?
సామాజిక మాధ్యమాల్లో వస్తున్న కథనాల ప్రకారం.. నవంబర్ 11న గ్రీస్‌లో అత్యంత సన్నిహితుల మధ్య వీరి వివాహం జరగనుందని, ఆ తర్వాత నవంబర్ 14న చెన్నైలో వైభవంగా పెళ్లి తంతు పూర్తి కానుందని తెలుస్తోంది. నవంబర్ 21న సినీ, రాజకీయ ప్రముఖుల కోసం భారీ రిసెప్షన్ ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. ఈ వేడుకకు వివిధ రంగాల ప్రముఖులతో పాటు రాజకీయ దిగ్గజాలు, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, సినీ నటుడు, తమిళగ వెట్రి కళగం అధినేత జోసెఫ్ విజయ్ కూడా హాజరయ్యే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.
అభిమానుల్లో ఆసక్తి.. కానీ అధికారిక ప్రకటన బాకీ !
గత కొన్ని నెలలుగా అనిరుధ్, కావ్య మారన్ పెళ్లిపై పలు కథనాలు వస్తున్నప్పటికీ, ఇరు కుటుంబాలు మాత్రం దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అనిరుధ్ బంధువు, సీనియర్ నటుడు వై.జి. మహేంద్రన్ గతంలో ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలతో మొదలైన ఈ ప్రచారం.. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డిని కళానిధి మారన్ కలవడంతో మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది.
ఒకవైపు ఐపీఎల్ వేలంలో, ఎస్ఆర్హెచ్ మ్యాచుల్లో తన ఎక్స్‌ప్రెషన్స్‌తో కుర్రకారును ఆకట్టుకునే కావ్య మారన్.. మరోవైపు వరుస చార్ట్‌బస్టర్ పాటలతో సౌత్ అండ్ నార్త్ ఇండియాను ఊపేస్తున్న అనిరుధ్ రవిచందర్ జంటగా మారబోతున్నారనే వార్త వినగానే ఇటు క్రికెట్, అటు సినిమా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ వార్తలపై క్లారిటీ రావాలంటే సన్ గ్రూప్ లేదా అనిరుధ్ టీమ్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే!