Skip to content
తెలంగాణ › వార్తలు

Singareni Privatization Row: సింగరేణి ప్రైవేటీకరణ చేసే ప్రసక్తే లేదు: కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు ఘాటు కౌంటర్..

jagan 15 Oct 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
Singareni Privatization Row: సింగరేణి ప్రైవేటీకరణ చేసే ప్రసక్తే లేదు: కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు ఘాటు కౌంటర్..

Sridhar Babu and KTR

Singareni Privatization Row: తెలంగాణ జీవనాడి అయిన సింగరేణి కాలరీస్ సంస్థను (SCCL) ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రైవేటీకరణ చేసే ప్రసక్తే లేదని రాష్ట్ర పరిశ్రమల , ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తేల్చిచెప్పారు. సింగరేణి వ్యవహారాలపై అసత్య ఆరోపణలు చేస్తున్న బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గురువారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన మంత్రి, పదేళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకోని కేటీఆర్‌కు సుదీర్ఘమైన 12 ఏళ్ల విరామం తర్వాత ఇప్పుడు సడన్‌గా సింగరేణి గుర్తుకు వచ్చిందా అని ఎద్దేవా చేశారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం సింగరేణిని తమ సొంత లబ్ధి కోసం ఒక ‘ఏటీఎం’లా వాడుకుందని సంచలన ఆరోపణ చేశారు.

సింగరేణి ప్రతిష్ఠను దెబ్బతీసేలా కేటీఆర్ బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని మంత్రి శ్రీధర్ బాబు మండిపడ్డారు. తమ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరేణిలో టెండర్ల ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తుండటంతో ఓర్వలేని కొన్ని రాజకీయ శక్తులు ఉద్దేశపూర్వకంగానే అసత్య ప్రచారాలు చేస్తున్నాయని మండిపడ్డారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం సింగరేణి సంస్థకు ఏకంగా వేల కోట్ల రూపాయల బకాయిలను చెల్లించకుండా పెండింగ్‌లో పెట్టిందని గుర్తుచేశారు. గత పదేళ్ల పాటు సింగరేణి పాలనను నడిపింది కేటీఆర్ కుటుంబ సభ్యులు కాదా అని నిలదీస్తూ, క్షేత్రస్థాయి సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు కేటీఆర్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని హితవు పలికారు.

గత ప్రభుత్వ అవకతవక విధానాల వల్లే సింగరేణిలో ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోయిందని మంత్రి విమర్శించారు. గత పదేళ్లలో సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీలలో ఎన్ని నెరవేర్చారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సింగరేణిని నిజంగా ప్రైవేటీకరించాలని చూసింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, నాటి హయాంలోనే తాడిచర్ల కోల్ బ్లాక్‌ను ప్రైవేటు సంస్థలకు అప్పగించారని ఆధారాలతో స్పష్టం చేశారు. సింగరేణిని ప్రైవేటుపరం చేయడానికి ఎవరు ప్రయత్నించినా చూస్తూ ఊరుకోమని గట్టి హెచ్చరిక జారీ చేశారు. బొగ్గు నాణ్యతకు అనుగుణంగా గత ప్రభుత్వం సకాలంలో వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోలేకపోయిందని ఆక్షేపించారు.

సింగరేణి సంస్థ ప్రస్తుతం ‘జి-9’ (G-9) గ్రేడ్ బొగ్గును ఎంతో సమర్థవంతంగా సరఫరా చేస్తోందని, కేటీఆర్ వాస్తవాలను క్షుణ్ణంగా తెలుసుకుని మాట్లాడాలని సూచించారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌కు ప్రతి ఏటా 14 మిలియన్ టన్నుల బొగ్గు అవసరం కాగా, దానికి అనుగుణంగా బొగ్గు ఉత్పత్తిని పెంచడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. కొత్త గనుల కేటాయింపుపై నాటి ప్రభుత్వం దృష్టి సారించకపోవడమే నేడు యాదాద్రి ప్లాంట్‌కు ఎదురవుతున్న బొగ్గు కొరతకు ప్రధాన కారణమని వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఒడిశాలోని నైనీ కోల్ బ్లాక్ నుంచి యాదాద్రి ప్లాంట్‌కు విరివిగా బొగ్గు సరఫరాను పునరుద్ధరించామని తెలిపారు. ప్రస్తుతం బొగ్గు తవ్వకం నుంచి సరఫరా వరకు ప్రతీ దశలో అత్యాధునిక సాంకేతిక పర్యవేక్షణ కొనసాగుతోందని స్పష్టం చేశారు.

బొగ్గు మాయమైపోయిందంటూ బీఆర్ఎస్ నేతలు చేస్తున్నది కేవలం చవకబారు రాజకీయ ఆరోపణ మాత్రమేనని మంత్రి తేల్చిచెప్పారు. గతంలో బీఆర్ఎస్ హయాంలో ఏదైతే టెండర్ల విధానాన్ని అమలు చేశారో, ప్రస్తుతం తమ ప్రభుత్వం కూడా అదే విధానాన్ని అనుసరిస్తోందని, నాడు తప్పు కానిది నేడు ఏ విధంగా తప్పవుతుందని ప్రశ్నించారు. గత పదేళ్లలో సింగరేణి కాంట్రాక్టులన్నింటినీ బీఆర్ఎస్ ముఖ్య నేతల అనుచరులకే కట్టబెట్టారని, కళ్లున్నా చూడలేని కబోధిలా కేటీఆర్ వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో అసలు కాంట్రాక్టు ఉద్యోగులే లేరని కెసిఆర్ ప్రకటించిన విషయాన్ని గుర్తుచేసిన మంత్రి, తమ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ కాంట్రాక్ట్ ఉద్యోగులకు సైతం దసరా బోనస్‌ను పంపిణీ చేస్తున్నామని గర్వంగా వెల్లడించారు.