Children’s Social Media Safety: పిల్లల సోషల్ మీడియా భద్రతపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్రానికి నోటీసులు
Supreme Court Directs Meenakshi Natarajan to Seek Relief from Election Commission
Children’s Social Media Safety: సామాజిక మాధ్యమాల (Social Media) దుష్ప్రభావాలు, వ్యసనాల బారిన పడుతున్న చిన్నారులను , విద్యార్థులను రక్షించేందుకు మరింత సమగ్రమైన, పటిష్ఠమైన చట్టబద్ధ నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన పిటిషన్పై దేశ అత్యున్నత న్యాయస్థానం స్పందించింది. ఈ కీలక అంశంపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు, కేంద్ర ప్రభుత్వానికి శుక్రవారం అధికారికంగా నోటీసులు జారీ చేసింది. భారత ప్రధానమంత్రి (CJI) జస్టిస్ సూర్యకాంత్ , జస్టిస్ జాయ్ మాల్యా బాగ్చీలతో కూడిన ప్రత్యేక ధర్మాసనం ఈ పిటిషన్పై విచారణ చేపట్టి తదుపరి చర్యలను ప్రారంభించింది.
ప్రముఖ విద్యాసంస్థ ‘ది ఎమరాల్డ్ హైట్స్ ఇంటర్నేషనల్ స్కూల్’తో పాటు దాని డైరెక్టర్ సిద్ధార్థ్ సింగ్ గిర్నార్ సంయుక్తంగా ఈ పిటిషన్ను సుప్రీంకోర్టులో దాఖలు చేశారు. దేశవ్యాప్తంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను వాడేందుకు కనీస వయసు నిబంధనలను కఠినతరం చేయాలని, ఆన్లైన్ వేధింపుల నుంచి విద్యార్థులకు రక్షణ కల్పించేలా కచ్చితమైన మార్గదర్శకాలను రూపొందించాలని వారు తమ పిటిషన్లో గట్టిగా కోరారు. ఈ కేసులో కేంద్ర ప్రభుత్వం, కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ, కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖతో పాటు జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ను (NCPCR) ప్రతివాదులుగా చేర్చారు. ఇప్పటికే ఇదే అంశానికి సంబంధించి సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న మరో కీలక కేసుతో ప్రస్తుత పిటిషన్ను ధర్మాసనం జతచేస్తూ, తదుపరి విచారణను వచ్చే డిసెంబర్ 3వ తేదీకి వాయిదా వేసింది.
ప్రస్తుతం చాలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు కేవలం సెల్ఫ్-డిక్లరేషన్ (స్వీయ-ధృవీకరణ) పద్ధతి ద్వారా 13 ఏళ్ల వయసు నిబంధనను అమలు చేస్తున్నాయని, ఇది భారతీయ చట్టాల ప్రకారం చిన్నారులకు లభించాల్సిన రక్షణకు ఏమాత్రం సరిపోదని పిటిషనర్లు తమ వాదనలో పేర్కొన్నారు. 2023 నాటి డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ (DPDP Act) ప్రకారం 18 ఏళ్లలోపు ప్రతి ఒక్కరినీ ‘పిల్లలు’గానే పరిగణిస్తారని, కాబట్టి డిజిటల్ రంగంలో వారికి ప్రత్యేకమైన, అదనపు రక్షణలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని గుర్తుచేశారు. సోషల్ మీడియా ఖాతాల సృష్టికి తల్లిదండ్రుల ధృవీకరణతో కూడిన అనుమతి ఉండాలని, పిల్లల ఆన్లైన్ ప్రవర్తనను ట్రాక్ చేయకుండా నిరోధించడం, టార్గెటెడ్ ప్రకటనలపై కఠిన ఆంక్షలు విధించడం వంటి నిబంధనలు రావాలని ఆకాంక్షించారు.
సామాజిక మాధ్యమాల అతివాడకం వల్ల పిల్లలు సైబర్బుల్లీయింగ్ (Cyberbullying), ఆన్లైన్ వేధింపులు, హానికరమైన అశ్లీల కంటెంట్, అపరిచితుల నుంచి ఎదురయ్యే ప్రమాదకర పరిచయాల బారిన పడుతున్నారని పిటిషనర్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అధిక స్క్రీన్ టైమ్ కారణంగా చిన్నారుల్లో నిద్రలేమి, ఏకాగ్రత తగ్గడం, తీవ్రమైన ఆందోళన (Anxiety), ఆత్మన్యూనత భావం పెరగడంతో పాటు చదువులపై శ్రద్ధ పూర్తిగా కొరవడుతోందని వివరించారు. ఈ నేపథ్యంలో మైనర్ల ఖాతాలకు తప్పనిసరి ప్రైవసీ సెట్టింగ్లు, వయసుకు తగిన యాక్సెస్ కల్పించేలా , సోషల్ మీడియా సంస్థల బాధ్యతను నిర్దేశించేలా అత్యున్నత మార్గదర్శకాలను జారీ చేయాలని వారు సుప్రీంకోర్టును అభ్యర్థించారు.