Skip to content
తెలంగాణ › వార్తలు

No Dancing in Uniform: పోలీసులు యూనిఫామ్‌లో డ్యాన్సులు చేస్తే కఠిన చర్యలు.. తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ సీరియస్ వార్నింగ్

jagan 17 Oct 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
No Dancing in Uniform: పోలీసులు యూనిఫామ్‌లో డ్యాన్సులు చేస్తే కఠిన చర్యలు.. తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ సీరియస్ వార్నింగ్

CV Anand

No Dancing in Uniform: తెలంగాణ రాష్ట్రంలో విధి నిర్వహణలో ఉండే పోలీస్ సిబ్బంది , అధికారులు యూనిఫామ్‌ ధరించి రీల్స్ చేయడం, వినోద కార్యక్రమాల్లో డ్యాన్సులు చేయడంపై రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP) సీవీ ఆనంద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై పోలీసు శాఖ గౌరవానికి భంగం కలిగించేలా యూనిఫామ్‌ ధరించి ఎలాంటి డ్యాన్సులు చేసినా, వినోద కార్యక్రమాల్లో భాగస్వాములైనా వారిపై అత్యంత కఠినమైన క్రమశిక్షణా చర్యలు (Disciplinary Actions) తప్పవని ఆయన శుక్రవారం సంచలన హెచ్చరికలు జారీ చేశారు. ఈ విధివిధానాల అమలుపై రాష్ట్రంలోని అన్ని పోలీస్ కమిషనరేట్లు, జిల్లా ఎస్పీలు , పోలీస్ యూనిట్ అధిపతులకు ఆయన కీలక మౌఖిక ఆదేశాలు పంపించారు.

ఇటీవల కాలంలో రాష్ట్రంలో జరిగిన వివిధ పండుగలు, బదిలీల సందర్భంగా ఏర్పాటు చేసిన వీడ్కోలు సమావేశాలు , ప్రైవేట్ వేడుకల్లో పలువురు కానిస్టేబుళ్ల నుంచి అధికారుల వరకు యూనిఫామ్‌లోనే పాటలకు డ్యాన్సులు చేస్తున్న వీడియోలు సోషల్ మీడియా వేదికల్లో విపరీతంగా వైరల్ అయ్యాయి. ముఖ్యంగా గణేశ్ నిమజ్జన వేడుకలు, మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర , పోలీస్ స్టేషన్లలో జరిగిన వేడుకల సందర్భంగా తీసిన వీడియోలు నెట్టింట వైరల్ కావడం, పోలీసు శాఖ క్రమశిక్షణ , పనితీరుపై తీవ్రస్థాయిలో ప్రజా విమర్శలకు దారితీసింది. శాంతిభద్రతలను కాపాడాల్సిన రక్షకభటులు విధి నిర్వహణ సమయంలో ఇలా ప్రవర్తించడం పట్ల సర్వత్రా అసంతృప్తి వ్యక్తమైంది. ఈ వరుస పరిణామాలను తీవ్రంగా పరిగణించిన డీజీపీ సీవీ ఆనంద్ ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.

పోలీస్ యూనిఫామ్ అనేది కేవలం ఒక దుస్తులు మాత్రమే కాదని, అది ప్రజల రక్షణ, బాధ్యత, అధికారం , అత్యున్నత క్రమశిక్షణకు ప్రతిరూపమని డీజీపీ ఉద్ఘాటించారు. అలాంటి పవిత్రమైన యూనిఫామ్‌ను ధరించినప్పుడు దాని గౌరవాన్ని, ఉన్నత ప్రతిష్టను కాపాడాల్సిన ప్రాథమిక బాధ్యత ప్రతీ పోలీస్ అధికారిపై ఉందని గుర్తుచేశారు. సర్వీస్ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తూ, యూనిఫామ్‌లో ఉన్నప్పుడు డ్యాన్సులు చేయడం నిబంధనల ఉల్లంఘన కిందకే వస్తుందని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతమైతే సంబంధిత సిబ్బందిపై సస్పెన్షన్ సహా తీవ్ర పరిణామాలు ఉంటాయని డీజీపీ ఈ సందర్భంగా హెచ్చరించారు.