Strait of Hormuz Shipwreck: హార్ముజ్ జలసంధిలో నౌక మునక.. దాడి జరిగిందా, మైన్ను ఢీకొట్టిందా? సముద్రంలో తేలుతున్న ఐఫోన్లు వీడియో ఇదిగో..
Strait of Hormuz Shipwreck
Strait of Hormuz Shipwreck: ప్రపంచ వ్యాప్తంగా అత్యంత కీలకమైన వాణిజ్య మార్గమైన హర్మూజ్ జలసంధిలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల నడుమ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. దుబాయ్ నుంచి బయలుదేరిన సింగపూర్ పతాకం కలిగిన ‘జీఎఫ్ఎస్ ప్రైడ్’ (GFS Pride) భారీ కంటైనర్ నౌక సముద్రంలో మునిగిపోయింది. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
నౌక మునిగిపోవడంతో అందులోని కంటైనర్లు దెబ్బతిని, వేలాదిగా ఐఫోన్లు, లగ్జరీ పెర్ఫ్యూమ్ బాటిళ్లు , ఖరీదైన విలాసవంతమైన వస్తువులు సముద్ర ఉపరితలంపై తేలియాడుతున్న దృశ్యాలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఈ ఖరీదైన వస్తువులను సొంతం చేసుకునేందుకు స్థానికులు చిన్న పడవల్లో సముద్రంలోకి వెళ్లి పోటీపడి మరీ ఏరుకుంటున్న వీడియోలు అంతర్జాతయంగా సంచలనం సృష్టిస్తున్నాయి.
అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. దుబాయ్ నుంచి బయలుదేరిన ఈ నౌకలో సుమారు 2,500 కంటైనర్ల నిండా విలువైన ఎలక్ట్రానిక్స్, ఐఫోన్లు, కాస్మెటిక్స్ ఉన్నట్లు సమాచారం. అయితే ప్రయాణ సమయంలో ఏదో గుర్తుతెలియని వస్తువు ఢీకొనడంతో నౌకలో ఒక్కసారిగా భారీ మంటలు చెలరేగి, క్రమంగా నీట మునిగినట్లు మారిటైమ్ వర్గాలు ప్రాథమికంగా వెల్లడించాయి. అదృష్టవశాత్తూ నౌకలో విధులు నిర్వర్తిస్తున్న 21 మంది సిబ్బందిని కోస్ట్ గార్డ్ సిబ్బంది సకాలంలో రక్షించడంతో ఎవరికీ ఎలాంటి ప్రాణాపాయం జరగలేదని సింగపూర్ మారిటైమ్ అండ్ పోర్ట్ అథారిటీ అధికారికంగా ప్రకటించింది.
ఈ ప్రమాదం వెనుక భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. నౌక అనధికార మార్గంలో ప్రయాణిస్తూ సముద్రగర్భంలో అమర్చిన మైన్ను ఢీకొట్టడం వల్లే పేలుడు సంభవించి మునిగిపోయిందని ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) పేర్కొంది. మరోవైపు, నౌకపై గుర్తుతెలియని ప్రొజెక్టైల్ లేదా క్షిపణి దాడి జరిగి ఉండొచ్చని భద్రతా నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చమురు , సహజవాయువు రవాణాకు జీవనాడి లాంటి హర్మూజ్ జలసంధిలో ఇటీవల కాలంలో వాణిజ్య నౌకలపై దాడులు, డ్రోన్ ఘటనలు విపరీతంగా పెరుగుతుండటం అంతర్జాతీయ సముద్ర వాణిజ్యానికి తీవ్ర ముప్పుగా పరిణమించింది. గడచిన 48 గంటల్లోనే ఈ ప్రాంతంలో వరుసగా ఐదు దాడులు నమోదైనట్లు యూకే మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ ఏజెన్సీ (UKMTO) హెచ్చరించడంతో, ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి.