ఇరాన్‌తో ఒప్పందం పూర్తయిందన్న ట్రంప్.. ఇకపై హార్ముజ్ జలసంధి టోల్ ఫ్రీ అంటూ కీలక ప్రకటన..
Donald Trump Says Iran Deal Is Finalised, Hormuz to Reopen Toll-Free
అమెరికా, ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న అంతర్జాతీయ ఉద్రిక్తతలకు ఎట్టకేలకు తెరపడింది. ప్రపంచ దేశాలు ఎంతగానో ఎదురుచూస్తున్న ఒక తీపి కబురును అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారికంగా ప్రకటించారు. ఇరాన్‌తో శాంతి ఒప్పందం కుదిరిందని, దీనివల్ల అంతర్జాతీయంగా అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధి గుండా నౌకల రాకపోకలు ఎలాంటి ఆటంకాలు లేకుండా యథావిధిగా సాగుతాయని ఆయన వెల్లడించారు.
ఈ నిర్ణయం ప్రపంచ దేశాలకు ఎంతో ఊరటనిచ్చే అంశమని, ముఖ్యంగా అంతర్జాతీయ జల రవాణాకు ఉద్దేశించిన మార్గంలో గల అడ్డంకులన్నీ పూర్తిగా తొలగిపోయాయని ఆయన స్పష్టం చేశారు. ఒకవైపు ఈ శాంతి ఒప్పందం గురించి సంతోషకరమైన వార్తను పంచుకుంటూనే, మరోవైపు ఇరాన్ దేశానికి ట్రంప్ గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఒకవేళ ఇరాన్ గనుక భవిష్యత్తులో అణు ఒప్పందం చేసుకోవడంలో విఫలమైతే, తాము ఊరుకోబోమని, తిరిగి ఆ దేశంపై దాడులను కొనసాగిస్తామని అమెరికా అధినేత చాలా స్పష్టంగా హెచ్చరించారు.
పశ్చిమాసియా ప్రాంతంలో గత కొంతకాలంగా సాగుతున్న ఉద్రిక్త వాతావరణం ముగిసిందని, అక్కడ శాంతి నెలకొందని తొలుత పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సోషల్ మీడియా ద్వారా ప్రపంచానికి తెలియజేశారు. ఇరాన్, అమెరికా దేశాలు అత్యంత వేగంగా ఒక శాశ్వత ఒప్పందానికి వచ్చాయని ఆయన పేర్కొన్నారు. ఈ ఒప్పందంలో భాగంగా లెబనాన్‌పై జరుగుతున్న దాడులతో పాటు అన్ని రకాల సైనిక చర్యలను తక్షణమే నిలిపివేసేందుకు ఇరు దేశాలు అంగీకరించాయని తన ఎక్స్ (గతంలో ట్విట్టర్) ఖాతాలో షరీఫ్ పోస్ట్ చేశారు. పాక్ ప్రధాని ఈ విషయాన్ని ప్రకటించిన కొద్దిసేపటికే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా దీనిని ధ్రువీకరిస్తూ అధికారిక ప్రకటన విడుదల చేశారు. గత కొన్ని నెలలుగా ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న తీవ్రమైన ప్రతిష్టంభనకు దౌత్యపరమైన చర్చల ద్వారా ఎండ్ కార్డ్ పడిందని, ఈ చర్చలు పూర్తిగా సఫలీకృతమయ్యాయని ట్రంప్ సంతోషం వ్యక్తం చేశారు.
ఈ చారిత్రాత్మక పరిణామంపై డొనాల్డ్ ట్రంప్ తన ‘ట్రూత్ సోషల్’ వేదికగా స్పందిస్తూ, ఇరాన్‌తో ఒప్పందం కుదిరినందుకు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పటి నుంచి హర్మూజ్ జలసంధిలో ఎలాంటి రుసుములు లేదా పైసా కూడా చెల్లించాల్సిన అవసరం లేకుండా ఉచితంగా రవాణా జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. అంతేకాకుండా, హర్మూజ్ జలసంధి పరివాహక ప్రాంతం నుండి అమెరికాకు చెందిన నౌకలను తక్షణమే వేరే చోటుకు తరలిస్తున్నామని, కాబట్టి ప్రపంచ దేశాలన్నీ తమతమ వ్యాపార, రవాణా నౌకలను సిద్ధం చేసుకోవచ్చని ఆయన పిలుపునిచ్చారు. ఈ ఒప్పందం వల్ల అంతర్జాతీయ మార్కెట్లోకి ముడి చమురు సరఫరా ఇకపై వరదలా సాగుతుందని, దీనివల్ల ఇంధన సంక్షోభం తప్పుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ శాంతి ప్రక్రియను అధికారికంగా ఖరారు చేసేందుకు ఇరు దేశాలు సిద్ధమవుతున్నాయి. ఇరాన్, అమెరికా దేశాల ఉన్నతాధికారులు, ప్రతినిధుల మధ్య జూన్ 19వ తేదీన స్విట్జర్లాండ్‌లో ఒక ప్రత్యేక సమావేశం జరగనుంది. ఆ దేశంలో ఇరుపక్షాలు ఈ చారిత్రాత్మక శాంతి ఒప్పందంపై అధికారికంగా సంతకాలు చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తోంది. ఈ ఒప్పందం పశ్చిమాసియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక, రాజకీయ స్థిరత్వానికి దారితీస్తుందని నిపుణులు భావిస్తున్నారు.