Skip to content
ఎడిట్ పేజి వార్తలు

ప్రధాని నేరుగా స్పందించరా?

Prajapaksham 24 Jul 2026 1 నిమిషాల పఠనం ఎడిట్ పేజి
ప్రధాని నేరుగా స్పందించరా?

ప్రధాని నేరుగా స్పందించరా?

నెల రోజులపైబడి పార్లమెంటు ముంగిట జరుగుతున్న విద్యార్థుల ఆందోళనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేటి వరకు ప్రత్యక్షంగా స్పందించకపోవడం విచిత్రం. మన యువత సంక్షేమం, భవిష్యత్తు కంటే ముఖ్యమైనది మరొకటి లేదంటూ ఆయన గురువారం తన ‘ఎక్స్‌’ ఖాతా ద్వారానే ప్రకటన చేశారే తప్ప కనీసం వీడియో సందేశమివ్వలేదు. ఆ ప్రకటనలో ‘సంసద్‌మార్చ్‌’ సందర్భంగా లాఠీల కరాళ నృత్యంలో గాయపడిన యువత పట్ల కనీస సానుభూతి వ్యక్తం చేసినా బాగుండేది. అప్పుడైనా ప్రధాని తమ గురించి ఆలోచిస్తున్నారనే సంకేతం యువతకు వెళ్ళేది. కానీ, పుండుమీద కారం పోసినట్లుగా ప్రశ్నపత్రాల లేకేజీకి పాల్పడిన వారికి త్వరితగతిన కఠిన శిక్షలు పడేలా చూసేందుకు ‘ఫాస్ట్‌ట్రాక్‌కోర్టు’లను ఏర్పాటు చేయాలని నిర్ణయించామని పసలేని వ్యాఖ్యలు ప్రధాని ప్రకటనలో ఉన్నాయి. మరి ఇంత కాలమేమి చేశారు? తాము ఉద్యమిస్తే తప్ప కఠిన నిర్ణయాలు తీసుకోరా? అని యువత ప్రశ్నిస్తోంది. నిజానికి ఆ దశ దాటిపోయింది. యువత కోరుకుంటున్నది 21 మంది విద్యార్థుల ఆత్మహత్యలకు దారి తీసిన నీట్‌పేపర్‌లీకేజీకి జవాబుదారీతనం వహించి కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌రాజీనామాకు ఒక్క అంగుళం కూడా తక్కువ కాదు.
అంతకుముందు కూడా ఒకసారి నీట్‌పేపర్‌లీకేజీ గురించి ప్రధాని స్పందించారు. ‘సంసద్‌మార్చ్‌’ మరుసటి రోజు ‘మంగళ్‌మిలన్‌’ పేరిట జరిగిన ఎన్‌డిఏ ఎంపిల సమావేశంలో మోదీ ప్రసంగించినప్పుడు ఈ అంశాన్ని ప్రస్తావించినట్లు కేంద్ర పార్లమెంటరీ శాఖ మంత్రి కిరణ్‌రిజిజు మీడియాకు చెప్పారు. నీట్‌పేపర్‌లీకేజీలను అడ్డుకోవడం ‘జాతీయ బాధ్యత’ అంటూ కేంద్రం బాధ్యతను అవలీలగా రాష్ట్రాలపై కూడా నెట్టేశారు ప్రధాని. సమాఖ్య స్ఫూర్తికి తూట్లు పొడుస్తూ, రాష్ట్రాల నుంచి లాగేసుకున్న అనేక అంశాలు, అధికారాల్లో ‘నీట్‌’ కూడా ఒకటి. గతంలో ఆయా రాష్ట్రాలలోని వైద్య విద్య ప్రవేశాలకు సంబంధించిన పరీక్షలు ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసే కామన్‌ఎంట్రెన్స్‌టెస్ట్‌కన్వీనర్‌ఆధ్వర్యంలోనే జరిగేవి. కానీ, ‘ఒక దేశం పరీక్ష’, ప్రతిభకే పట్టం అంటూ 2012లో జాతీయ స్థాయి ఉమ్మడి ప్రవేశపరీక్ష ప్రతిపాదన వచ్చి, 2016 నుంచి వైద్య విద్య ప్రవేశానికి నీట్‌ను నిర్వహించటం ప్రారంభమైంది. నాటి నుంచి కోచింగ్‌సెంటర్‌ల మాఫియా తన రెక్కలను
విస్తరించి, లీకేజీలకు పాల్పడడం కళ్ళకు కనపడుతూనే ఉంది. నేషనల్‌టెస్టింగ్‌ఏజెన్సీ ఆధ్వర్యంలో జరిగే నీట్‌పరీక్షకు బాధ్యత వహించాల్సింది సహజంగా దానిని నియమించిన కేంద్ర ప్రభుత్వమే కదా.
పేపర్‌లీకేజీలపై ప్రధాని స్పందించిన రెండు సందర్భాలు కూడా ప్రత్యక్షంగా కాకుండా పరోక్ష ప్రస్తావనలే. జూన్‌6 నుంచి సిజెపి పిలుపుపై జంతర్‌మంతర్‌లో విద్యార్థుల నిరసన, పాతిక రోజులకుపైగా సామాజిక ఉద్యమకారుడు సోనమ్‌వాంగ్‌చుక్‌నిరశన సాగుతున్నది. పార్లమెంటు సమావేశాలు ప్రారంభమై నాలుగు రోజులవుతోంది. చలో పార్లమెంటుకు పదుల వేల సంఖ్యలో దేశ నలుమూలల నుంచి యువత పెద్ద ఎత్తున ఢిల్లీకి చేరుకున్నారు. ప్రతిపక్షాలు మొదటి నుంచే ప్రభుత్వ స్పందనను కోరుతున్నాయి. ఇంతకంటే గంభీరమైన సమస్య దేశం ముందు ఇప్పుడేమున్నది? అయినప్పటికీ ప్రధాని అటు లోక్‌సభ, ఇటు రాజ్యసభకు హాజరు కాకపోయినా పార్లమెంటులో మాట్లాడినట్లుగా ప్రజలకు భ్రమ కలిగిస్తున్నారు. అదెలాగంటే, ప్రతీసారి పార్లమెంటు తొలిరోజున సభ ప్రారంభమయ్యేముందు, ప్రవేశద్వారం వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదిక నుంచి ప్రధాని నాలుగైదు నిమిషాలు వర్తమాన అంశాలపై మీడియా ఎదుట ప్రస్తావించి, లోపలికి వెళ్ళిపోతారు. అదే విషయాన్ని ప్రధాని పార్లమెంటు భవన ప్రాంగణంలో మాట్లాడారని మీడియా ప్రసారం చేయడం ద్వారా సభలోపల మాట్లాడినట్లుగా ప్రజలు భావిస్తారు. ఆ తరువాత ఒకరోజు పార్లమెంటు భవన ప్రాంగణంలోని హాల్‌లోనే ఎన్‌డిఏ ఎంపిలతో ప్రత్యేక సమావేశంలో ప్రధాని మాట్లాడడం ఆనవాయితీ. దానికి మీడియాను అనుమతించరు. ఆ విషయాలను ఎవరో ఒక కేంద్ర మంత్రి మీడియాకు వెల్లడిస్తారు. అది కూడా ప్రజలు తెలియక పార్లమెంటులోనే మాట్లాడతారని భావించడం కద్దు.
మొత్తం సమావేశాల్లో ఒకటో, రెండో సందర్భాలలోనే ప్రధాని పార్లమెంటు ఎగువ, దిగువ సభలకు వెళ్ళి చర్చకు సమాధానమిస్తారు. ఈసారి కూడా తొలిరోజున యువత ఆందోళనను పక్కనబెట్టి, ప్రధాని నరేంద్ర మోదీ ఒకవైపు, పార్లమెంటు సభ్యులు గౌరవప్రదంగా చర్చల్లో పాల్గొంటూ నిర్మాణాత్మక చర్చలకు సహకరించాలని కోరుతూనే, మరో వైపు, 56 ఏళ్ళ యువకుడి గురించి తాను మాట్లాడడం లేదని పరోక్షంగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీని ఉద్దేశించి ప్రధాని ఎద్దేవా చేశారు. ఈ చర్య ప్రతిపక్షాలను రెచ్చగొట్టడటమే అవుతుందని ఇట్టే అర్థమవుతోంది. అయినప్పటికీ, ప్రతిపక్షాలు సంయమనంతో పార్లమెంటులో తొలిరోజు విద్యార్థులపై దమనకాండ మీద చర్చకు డిమాండ్‌చేశాయి. ఏ నిబంధన కిందైనా, ఎన్ని గంటలైనా చర్చకు సిద్ధమేనని సభలో సన్నాయి నొక్కులు నొక్కిన కేంద్ర మంత్రులు.. సభా కార్యక్రమాలన్నీ రద్దు చేసి, తామిచ్చిన వాయిదా తీర్మానాన్ని ఆమోదించి తక్షణమే చర్చించాలన్న ప్రతిపక్షం డిమాండ్‌ను మాత్రం త్రోసిపుచ్చారు. మార్గాంతరం లేక ప్రధాన ప్రతిపక్ష నేతలైన ఖర్గే, రాహుల్‌గాంధీ తదితరులు మంత్రి ప్రధాన్‌రాజీనామా డిమాండ్‌చేస్తూ ప్రధాని ఇంటి వద్ద మెరుపు ధర్నాచేసి విద్యార్థుల ఆందోళనను, ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని బలంగా దేశ ప్రజల దృష్టికి తెచ్చారు. దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ప్రధానమంత్రులు జవహర్‌లాల్‌నె హ్రూ, ఇందిరాగాంధీల తరువాత తనకు అంతటి బ్రాండ్‌ను సృష్టించుకున్న ప్రధాని మోదీ, నెహ్రూకన్నా ఎక్కువకాలం తాను పదవిలో ఉన్నట్లు ఒక అపోహను సృష్టించుకుని సంబరపడుతున్న మోదీ, నిత్యం నెహ్రూను దూషించే మోదీ ఆయన నుంచి ప్రజాస్వామ్య స్ఫూర్తిని పొంది ఉంటే దేశానికి మేలు జరిగేది. ఆయన ఇప్పటికైనా భేషజం వీడి ప్రత్యక్షంగా పార్లమెంటులోనూ, అలాగే ఉద్యమిస్తోన్న యువత ప్రతినిధులతోనూ మాట్లాడడం ప్రజాస్వామ్యానికి శోభనిస్తోంది.
సిజెపి నాయకులు ప్రభుత్వంతో చర్చలకు సుముఖంగా ఉన్నారు. అయితే తమ ఆందోళన శిబిరం వద్దకు రావటం మంత్రులకు ఇబ్బందిగా ఉంటే తటస్థ ప్రదేశంలో చర్చలకు సంసిద్ధత తెలియజేశారు. కేంద్రమంత్రి జెపి నడ్డా కార్యాలయంలోనో, ఇంటివద్దనో చర్చలను ప్రభుత్వం ప్రతిపాదించటం అహం తప్ప మరేమీ లేదు. మెట్టు దిగటానికి మొహమాటమెందుకు?

ట్యాగ్‌లు: CJP CJP protest Modi PM Modi