Skip to content
ఎడిట్ పేజి వార్తలు

తాత్కాలిక అవగాహన ఆరంభం మాత్రమే

Prajapaksham 20 Jun 2026 0 నిమిషాల పఠనం ఎడిట్ పేజి
తాత్కాలిక అవగాహన ఆరంభం మాత్రమే

U.S.–Iran Deal Seen as Temporary Framework, Not Final Peace Settlement (photo-AI generated Image)

పశ్చిమాసియాలో 107రోజుల యుద్ధం ముగిస్తూ అమెరికా ఒక తాత్కాలిక అవగాహనతో కూడిన శాంతి ఒప్పందంపై బుధవారం సంతకాలు చేయటం ఆ రీజియన్‌లో అనేక దశాబ్దాల్లో అత్యంత ప్రాముఖ్యతగల దౌత్య పరిణామాల్లో ఒకటి. వివాదాంశాల్లో కొన్నిటికి తక్షణ ఉపశమనం కలుగజేస్తూ, తుది పరిష్కారాలను అంతిమ ఒప్పందంకోసం 60రోజుల చర్చలకు అప్పగించిన ఈ అవగాహన పత్రం తమకంటే తమకు విజయంగా ఇరుపక్షాలు ప్రకటించటంలో ఆశ్చర్యంలేదు.

ఇరుపక్షాలు తమ వ్యూహాత్మక లక్ష్యాలను సమర్థించుకోవటం సహజం. ఇది ఎవరికి విజయం అనే మీమాంసకన్నా, పశ్చిమాసియా పరిస్థితుల్లో గుణాత్మక మార్పు తేగలిగిన తుది ఒప్పందం దాకా ప్రయాణం సాగుతుందా అనేది మిలియన్‌ డాలర్‌ ప్రశ్న. చర్చలు ఫలప్రదమై నిరాటంకంగా ఆయిలు సరఫరాలతో ప్రపంచ ఆర్థికవ్యవస్థల్లో స్థిరత్వానికి దోహదం కావాలన్నది ప్రపంచ దేశాల ఆశ.

అయితే లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ దాడులు సహా అన్ని వైపులనుంచీ దాడులు తక్షణం నిలిచిపోవాలని అవగాహన పత్రం స్పష్టంగా పేర్కొన్నప్పటికీ, ప్రధాని బెంజిమన్‌ నెతన్యాహుకు అధ్యక్షుడు ట్రంప్‌ హెచ్చరికలు జారీ చేసినప్పటికీ, పోరాట విరమణ అవగాహన పత్రంపై ట్రంప్‌, ఇరాన్‌ అధ్యక్షుడు మసూద్‌ పెజిష్కియాన్‌ సంతకాల సిరా ఆరకముందే ఇజ్రాయెల్‌ దక్షిణ లెబనాన్‌పై బాంబులు కురిపించింది, ఆస్తుల విధ్వంసంతోపాటు పలువురు హతులైనారు. అమెరికా ఇరాన్‌ ఒప్పందంతో తమకు సంబంధంలేదన్న మొండివాదనతో శాంతిని భగ్నం చేసే చర్యలను ఇజ్రాయెల్‌ కొనసాగిస్తే అందుకు అధ్యక్షుడు ట్రంప్‌ పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇజ్రాయెల్‌ తాజా దాడుల పర్యవసానంగా అమెరికా మధ్య జెనీవాలో 60రోజుల చర్చలు ఆరంభం కాకుండానే వాయిదా పడ్డాయి.
ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా యుద్ధ విమానాల దాడులతో మొదలైన ప్రస్తుత యుద్ధానికి ముగింపు పలికిన అవగాహన పత్రంపై సంతకాల ప్రక్రియ ముందుగా ప్రచారం జరిగినట్లు జెనీవాలో శుక్రవారందాకా ఆగలేదు. ముందుగా ఎలక్ట్రానికల్‌గా, ఆ తదుపరి జి సమావేశానికై ఫ్రాన్స్‌లోని వర్సైల్స్‌లో ఉన్న అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యూల్‌ మాక్రాన్‌ ఇచ్చిన విందులో స్వయంగా చిక్కని నల్లసిరా పెన్నుతో సంతకం చేశారు. మొదటి ప్రపంచ యుద్ధాన్ని ముగించిన ఒప్పందం కూడా వర్సైల్స్‌లో జరిగిన చారిత్రక సారూప్యత ఉంది.

కాగా ఇరాన్‌ అధ్యక్షుడు మసూద్‌ పెజిష్కియాన్‌ టెహరాన్‌లో సంతకం చేశారు. “ఒక చారిత్రక పత్రం” గా అభివర్ణించిన ఆ పత్రాన్ని సోషల్‌ మీడియాలో పెట్టారు. ప్రపంచంలో క్రూడ్‌ ఆయిల్‌ రవాణాలో 20శాతం జరిగే హార్మోజ్‌ జలసంధిని ఇరాన్‌ మూసివేయటంతో ఆర్థిక సంక్షోభం అంచుకువెళ్లిన ప్రపంచ దేశాలు, ఈ ఒప్పందంతోపాటు హార్మోజ్‌ పాక్షికంగా తెరుచుకోవటం, ఇరాన్‌ ఓడలపై విధించిన దిగ్బంధనాన్ని అమెరికా ఎత్తివేయటంతో ఒక్క ఇజ్రాయెల్‌ తప్ప ఊపిరి పీల్చుకున్నాయి.

ఈ తాత్కాలిక అవగాహనను ‘ఇస్లామాబాద్‌ మౌ’ అని పిలుస్తున్నారు. అమెరికా, ఇరాన్‌ల మధ్య కటార్‌తోపాటు మధ్యవర్తిత్వం వహించి తాత్కాలిక అవగాహనను సాధించి యుద్ధ విరమణకు దోహదం చేసినందుకు పాకిస్థాన్‌కు ఆ ప్రతిష్ట దక్కింది. జెనీవా ఇప్పుడు, అవగాహన పత్రంలోని 14అంశాలను మరింత క్లిష్టమైన తుది ఒప్పందంగా మార్చే సాంకేతిక చర్చలకు వేదిక కానుంది. తుది ఒప్పందంపై సంతకాలు మహోత్సవం జెనీవాలో జరిగితే అది జెనీవా (స్విట్జర్లాండ్‌) చరిత్రలో అంతర్జాతీయ ఒడంబడికల జాబితాలో మరో మైలురాయి కాగలదు.

ఇరాన్‌ ఎన్నడూ అణ్వాయుధం తయారు చేయబోదనే హామీని అమెరికా సాధించటం ట్రంప్‌ విజయం. శుద్ధిచేసిన ఆయుధ గ్రేడ్‌ యురేనియంను శక్తిహీనం చేయటం ఎలా అన్నది తదుపరి చర్చల్లో కీలకాంశం. హోర్ముజ్‌ జలసంధిని తమ దేశంపై భవిష్యత్‌ దాడులకు నిరోధకంగా పరిగణిస్తున్న ఇరాన్‌ దానిపై తమ సార్వభౌమత్వాన్ని నిలబెట్టుకోవటం ఇరాన్‌ విజయం. ఇరాన్‌పై ఆర్థిక ఆంక్షలు ఎత్తివేయటం, స్తంభింపజేసిన ఇరాన్‌ నిధుల విడుదల, ఇరాన్‌ పునర్నిర్మాణానికి 300 డాలర్ల నిధులను ప్రాంతీయంగా సమకూర్చటానికి ట్రంప్‌ అంగీకరించటం వగైరా ఇప్పటికైతే సంకల్పాల ప్రకటన.

అవి అమలులోకి రావటమన్నది జెనీవా చర్చల్లో కుదిరే అంగీకారాలపై ఆధారపడి ఉంటుంది. ఇరాన్‌ మిస్సిలీల వ్యవస్థ అభివృద్ధిని నియంత్రించటం అవగాహనపత్రంలో చేర్చాలన్న ఇజ్రాయెల్‌ ఒత్తిడి ఫలించలేదు. అందువల్ల ఇల్లలుకగానే పండుగకానట్లు ఈ అవగాహన పత్రంతో సమస్యలన్నీ పరిష్కారం కావు. ఇదొక సదుద్దేశ రాజకీయ సంకల్ప ప్రకటన మాత్రమే.