Skip to content
ఎడిట్ పేజి వార్తలు

ఇది ‘ఆత్మరక్షణ’ బిల్లు..

Prajapaksham 30 Jul 2026 1 నిమిషాల పఠనం ఎడిట్ పేజి
ఇది ‘ఆత్మరక్షణ’ బిల్లు..

Parliament

పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాల లీకులను అరికట్టడానికి ఉద్దేశించిన బిల్లుకు లోక్‌సభలో ఆమోదముద్ర పడడం, ఈ సమస్యకు సాధ్యమైనంత త్వరగా ముగింపు పలకాలనే కేంద్ర ప్రభుత్వ ఆలోచనకు అద్దం పడుతున్నదే తప్ప, సమస్యకు తెరదించాలన్న నిబద్ధతను ప్రతిబింబించడం లేదు. లోతైన చర్చలు.. విస్తారమైన సంప్రదింపులు లేకుండా, ప్రభుత్వం ఈ బిల్లుకు మూజువాణి ఓటుతో ఆమోదముద్ర వేయించుకోవడమే ఇందుకు నిదర్శనం. బిల్లులో లీకేజీ సమస్యకు నామమాత్రపు పరిష్కారాలే తప్ప, కూకటివేళ్లతో పెకళించే విధానాలు లేవని ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్‌చేస్తున్న ఆరోపణల్లో నిజం లేకపోలేదు. మన దేశంలో పోటీ పరీక్షలను విద్యా వ్యవస్థలో ఒక భాగంగా పరిగణించడం కంటే, లక్షలాది కుటుంబాల ఆశలు, యువత కలలు, సమాజం ప్రతిభను ఎంపిక చేసుకునే విధానంగా, ప్రభుత్వ పరిపాలనకు అవసరమైన మానవ వనరులను గుర్తించే యంత్రాంగంగా పేర్కోవడం సముచితం. ఒక విద్యార్థి ఎన్నో సంవత్సరాల శ్రమ, తల్లిదండ్రుల ఆర్థిక త్యాగం, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం, వ్యక్తిగత క్రమశిక్షణ చివరకు ఒక పరీక్షలో ప్రతిబింబిస్తాయి. అలాంటి పరీక్షలపై ప్రజలకు నమ్మకం లేకపోతే దాని ప్రభావం ఒక్క విద్యార్థిపైనే కాదు, మొత్తం సమాజంపైన పడుతుంది. అందుకే ప్రశ్నాపత్రాల లీకులు, పరీక్షల నిర్వహణలో అక్రమాలు, ఫలితాలపై అనుమానాలు వంటి పరిణామాలు సాధారణ పరిపాలనా వైఫల్యాలుగా కాకుండా ప్రజా విశ్వాసాన్ని దెబ్బతీసే సంక్షోభాలుగా చూడాలి. అందుకే ఢిల్లీ జంతర్‌మంతర్‌వేదికగా యువత అంతగా పోరాడింది. కానీ, మోదీ ప్రభుత్వం గతంలో మాదిరిగానే మరోసారి ఒక మహా ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నది. గతంలో రైతు ఆందోళనకు తలవంచి, వివాదాస్పదమైన మూడు వ్యవసాయ బిల్లులను రద్దు చేసిన మోదీ సర్కారు, ఆ సమయంలో ఇచ్చిన వాగ్దానాన్ని ఇప్పటి వరకూ నెరవేర్చలేదు. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత నేటికీ రానేలేదు. అదే తరహాలో ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారాన్ని కూడా నిద్రపుచ్చే ప్రయత్నం చేస్తున్నది. విద్యార్థుల తీవ్రమైన ప్రతిఘటన తర్వాత, నిందితులను అరెస్టు చేయడం, కఠిన శిక్షలు ప్రకటించడం, కొత్త చట్టాలు తీసుకురావడంతో తన బాధ్యత తీరిపోయినట్టు
ప్రవర్తిస్తున్నది. సమస్యను మూలాలను గుర్తించి పరిష్కరించే దిశగా వ్యవస్థను పునర్నిర్మించే విధానంపై స్పష్టత ఎక్కడా లేదు. ఒక నేరం జరిగిన తర్వాత శిక్షించడం కంటే, ఆ నేరం జరగకుండా అడ్డుకోవడమే మంచి పాలనకు ప్రమాణం. ప్రశ్నాపత్రం లీక్‌కావడం అంటే లక్షలాది మంది విద్యార్థులు చేసిన శ్రమ విలువను దోచుకోవడం కాబట్టి, ప్రశ్నల రూపకల్పన నుంచి సవరణ, అనువాదం, డిజిటల్‌భద్రపరచడం, ముద్రణ, ప్యాకింగ్‌, రవాణా, నిల్వ, పరీక్షా కేంద్రాలకు పంపిణీ, పరీక్ష ప్రారంభమయ్యే వరకు ఉన్న అనేక దశల్లో కీలక పాత్ర పోషించే విధానాలపై నిశిత దృష్టి ఉంచాలి. పరీక్షల భద్రతను చివరి దశలో అమలుచేసే చర్యగా కాకుండా, మొత్తం ప్రక్రియలో కొన
సాగాల్సిన బాధ్యతగా చూడాలి.
డిజిటల్‌యుగంలో పరీక్షల నిర్వహణ కొత్త సవాళ్లను ఎదుర్కొంటోంది. ఒకప్పుడు ప్రశ్నాపత్రం కాగితాల రూపంలో మాత్రమే ఉండేది. ఇప్పుడు ప్రశ్నల తయారీ, సవరణ, అనువాదం, డేటా మార్పిడి, ముద్రణ వంటి అనేక దశలు డిజిటల్‌వేదికలపై జరుగుతున్నాయి. అందువల్ల సైబర్‌భద్రత పరీక్షల విశ్వసనీయతలో అంతర్భాగంగా మారింది. అనుమతి లేకుండా ఫైళ్లను చూడడం, డేటా కాపీ చేయడం, సర్వర్లలోకి చొరబడడం, అంతర్గత సమాచారాన్ని బయటకు పంపించడం వంటి ప్రమాదాల ను ఎదుర్కొనే సామర్థ్యం లేకపోతే ఎంత కఠినమైన చట్టం ఉన్నా ప్రయోజనం ఉండదు. ప్రతి సున్నితమైన పత్రానికి ‘డిజిటల్‌ఆడిట్‌ట్రయిల్‌’ ఉండాలి. ఎవరు, ఎప్పుడు, ఏ కారణంతో ఆ సమాచారాన్ని వినియోగించారో నమోదు కావాలి. భద్రతా వ్యవస్థలను స్వతంత్రంగా పరిశీలించే యంత్రాంగం సైతం అవసరం. అయితే సాంకేతిక పరిజ్ఞానం ఒక్కటే పరిష్కారం కాదు. దానిని నిర్వహించే సంస్థల సామర్థ్యం కూడా అంతే ముఖ్యం. కోట్లాదిమంది విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే పరీక్షలను నిర్వహించే సంస్థలకు తగిన సంఖ్యలో శాశ్వత సిబ్బంది, నిపుణులు, సమాచార భద్రతా బృందాలు, పరీక్షల నిర్వహణలో అనుభవజ్ఞులైన అధికారులు అవసరం. తాత్కాలిక ఏర్పాట్లు, ఖాళీ పోస్టులు, పరిమిత వనరులతో ఇంత పెద్ద బాధ్యతను నిర్వహించడం క్రమంగా వ్యవస్థ ను బలహీనపరుస్తుంది. పరీక్షల సంఖ్య పెరిగిన కొద్దీ సంస్థాగత సామర్థ్యం కూడా అదే స్థాయిలో పెరగాలి. పరీక్షా నిర్వహణలో జవాబుదారీతనం స్పష్టం గా ఉండాలి. ఏ దశలో లోపం జరిగిందో గుర్తించగలిగే విధంగా బాధ్యతల విభజన ఉండాలి. పరీక్షల సంస్కరణలతో పాటు విద్యా అవకాశాల విస్తరణ కూడా సమానంగా అవసరం. పరీక్ష నిర్వహణ అనంతరం భద్రతా సమీక్షలు నిర్వహించడం, లోపాలను బహిరంగంగా అంగీకరించడం, సరిదిద్దే చర్యలను వెల్లడించడం, ఫిర్యాదుల పరిష్కారానికి స్వతంత్ర వ్యవస్థ ఏర్పాటు చేయడం వంటి చర్యలు విశ్వాసాన్ని పెంచుతాయి. కానీ, పార్లమెంటులో కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లు ఇంత విస్తారమైన బాధ్యతను నిర్వర్తించేదిగా కనిపించడం లేదు. లీకేజీలకు
పాల్పడిన వారికి పది సంవత్సరాల వరకూ కఠిన కారాగార శిక్ష అమలయ్యేలా చేయాలనుకోవడం తప్పుకాకపోవచ్చు. కానీ, ప్రశ్నాపత్రాల చౌర్యాన్ని అరికట్టే పటిష్టమైన విధానాలను తీసుకురాకుండా, ప్రవేశపెట్టే హడావుడి
బిల్లులతో ఎవరికి లాభం? సమస్యకు ఎక్కడ పరిష్కారం?
గత 10 సంవత్సరాల్లో 152 ప్రశ్నాపత్రాలు లీకు అయితే ఎవరినీ శిక్షించిన దాఖలాలు లేకపోవటం వ్యవస్థ వైఫల్యానికి నిదర్శనంగా ప్రతిపక్షాలు నిలదీస్తుంటే ప్రభుత్వం వద్ద సమాధానం లేదు. అందువల్ల చట్టాల్లోని శిక్షాత్మక క్లాజులు కఠినతరం చేయటం ఆత్మరక్షణాత్మక చర్య తప్ప అవి నేరస్థులను పట్టి ఇవ్వవు. చిత్తశుద్ధి, అంకితభావం, స్వార్ధరహితంగా పనిచేసే విద్యావ్యవస్థ నిర్మాణం ఆవశ్యకతను గుర్తించటం ప్రభుత్వంలో కనిపించదు.
ప్రశ్నాపత్రం లీకైన తర్వాత ఎంతమందిని శిక్షించామన్నది ప్రభుత్వ విజయానికి ప్రమాణం కాదు. లీక్‌జరిగే అవకాశాన్ని ఎంతవరకు నిర్మూలించగలిగామన్నదే అసలు కొలమానం. పరీక్షా కేంద్రంలోకి అడుగుపెట్టే ప్రతి విద్యార్థి తన కృషి మాత్రమే తన భవిష్యత్తును నిర్ణయిస్తుందనే విశ్వాసంతో కూర్చోగలిగిన రోజునే నిజమైన పరీక్షా సంస్కరణలు విజయవంతమైనట్టు భావించాలి. ఈ దిశగా అడుగులు పడకపోతే, పతనమవుతున్న విద్యా వ్యవస్థను సరిదిద్దకపోతే, కార్పొరేట్‌పోటీ నుంచి విద్యారంగాన్ని కాపాడకపోతే, ఎన్ని బిల్లులు వచ్చినా.. ఎన్ని చట్టాలు చేసినా ఫలితం ఉండదు. విద్యార్థులకు న్యాయం జరగదు.

ట్యాగ్‌లు: BJP Congress editorial Parliament