Anantapur: విద్యుత్ స్తంభంపైనే సీపీఆర్.. అనంతపురం లైన్మెన్కు పునర్జన్మ.. సీపీఆర్‌తో ప్రాణాలు కాపాడిన వ్యక్తి వీడియో వైరల్..
Lineman Gets New Lease of Life After CPR on Electric Pole
Anantapur: అనంతపురం జిల్లాలో ఒళ్లు గగుర్పొడిచే సాహసోపేత ఘటన చోటుచేసుకుంది. విద్యుత్ స్తంభంపై మరమ్మతులు చేస్తూ కరెంట్ షాక్‌కు గురై అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఓ కార్మికుడిని, మరో వ్యక్తి ఏమాత్రం ఆలస్యం చేయకుండా అదే స్తంభంపైకి ఎక్కి సీపీఆర్ (CPR) చేసి ప్రాణాలు కాపాడాడు. క్షణక్షణం ఉత్కంఠ రేపిన ఈ రెస్క్యూ ఆపరేషన్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అనంతపురం జిల్లా కంబదూరు మండల కేంద్రంలో ఈ సంఘటన జరిగింది. రాజు అనే ప్రైవేట్ విద్యుత్ కార్మికుడు లైన్ మరమ్మతుల కోసం విద్యుత్ స్తంభం ఎక్కాడు. పనులు చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు కరెంట్ షాక్‌కు గురికావడంతో, తీవ్రంగా గాయపడి స్పృహ కోల్పోయాడు. స్తంభంపై తీగల మధ్యే ప్రమాదకర స్థితిలో వేలాడుతూ ఉండిపోయిన రాజును చూసి కింద ఉన్న స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఏం చేయాలో తెలియక అందరూ నిస్సహాయంగా చూస్తుండిపోయారు.
అదే సమయంలో అక్కడే ఉన్న ఓ వ్యక్తి అసాధారణ ధైర్యం, సమయస్ఫూర్తిని ప్రదర్శించాడు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ముందుగా మెయిన్ లైన్ ద్వారా విద్యుత్ సరఫరాను నిలిపివేయించాడు. ఆ వెంటనే చకచకా స్తంభంపైకి ఎక్కి, అపస్మారక స్థితిలో వేలాడుతున్న రాజు ఛాతీపై ఒత్తుతూ సీపీఆర్ చేయడం ప్రారంభించాడు. అంత ఎత్తులో, అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో అతడు చేసిన ప్రయత్నం ఫలించి కొద్దిసేపటికే రాజులో తిరిగి కదలిక వచ్చింది.
రాజు స్పృహలోకి రావడంతో స్థానికుల సాయంతో ఆయన్ను సురక్షితంగా కిందకు దించి, మెరుగైన వైద్యం కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కళ్లముందే మృత్యువు అంచున ఉన్న కార్మికుడిని తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కాపాడిన ఆ వ్యక్తి తెగువను, మానవత్వాన్ని నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.