Skip to content
జాతీయం › వార్తలు

Train Delay Makes Miss Flight: దాదాపు 4 గంటలు ఆలస్యంగా చేరిన రైలు.. దంపతులకు రూ.63,199 చెల్లించాలని రైల్వేను ఆదేశించిన కోర్టు.. ఎందుకంటే..

jagan 24 Nov 2026 1 నిమిషాల పఠనం జాతీయం
Train Delay Makes Miss Flight: దాదాపు 4 గంటలు ఆలస్యంగా చేరిన రైలు.. దంపతులకు రూ.63,199 చెల్లించాలని రైల్వేను ఆదేశించిన కోర్టు.. ఎందుకంటే..

Train Passengers Alert:

Train Delay Makes Miss Flight: రైలు ఆలస్యం కారణంగా విమాన ప్రయాణాన్ని కోల్పోయి ఆర్థికంగా, మానసికంగా నష్టపోయిన జమ్మూ దంపతులకు వినియోగదారుల ఫోరం అండగా నిలిచింది. ఈ వ్యవహారంలో రైల్వే శాఖ స్పష్టమైన సేవా లోపానికి పాల్పడిందని నిర్ధారిస్తూ, బాధితులకు రూ. 63 వేలకు పైగా నష్టపరిహారం చెల్లించాలని ఉత్తర రైల్వే , కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పొగమంచు వల్లే రైలు ఆలస్యమైందంటూ రైల్వే శాఖ వినిపించిన వాదనను కోర్టు నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది.

జమ్మూకు చెందిన మోహిత్ సింగ్ భౌ, ఆయన భార్య దామిని బిల్లోరియా 2022 డిసెంబర్ 19న జమ్మూ నుంచి ఢిల్లీకి వెళ్లే దురంతో ఎక్స్‌ప్రెస్‌ (రైలు నంబర్ 12266) లో టికెట్లు బుక్ చేసుకున్నారు. షెడ్యూల్ ప్రకారం ఈ రైలు మరుసటి రోజు (డిసెంబర్ 20న) తెల్లవారుజామున 3:55 గంటలకు ఢిల్లీ చేరుకోవాల్సి ఉంది. ఇదే నమ్మకంతో ఆ దంపతులు అదే రోజు ఉదయం 7:15 గంటలకు ఢిల్లీ నుంచి గువాహటికి వెళ్లే విమాన టికెట్లను కూడా ముందస్తుగా బుక్ చేసుకున్నారు.

అయితే, దురంతో ఎక్స్‌ప్రెస్ ఏకంగా 3 గంటల 55 నిమిషాలు ఆలస్యంగా ఉదయం 7:50 గంటలకు ఢిల్లీకి చేరుకోవడంతో వారు తమ విమానాన్ని అందుకోలేకపోయారు. ప్రయాణాన్ని రద్దు చేసుకోలేని అత్యవసర పరిస్థితుల్లో, ఆ దంపతులు అదనంగా రూ. 35,699 వెచ్చించి కొత్త విమాన టికెట్లు కొనుగోలు చేయడంతో పాటు, ఆ రాత్రి ఢిల్లీలోని ఒక హోటల్‌లో బస చేసేందుకు మరో రూ. 2,500 ఖర్చు చేయాల్సి వచ్చింది. ఈ ఆర్థిక నష్టం , మానసిక వేదనపై న్యాయం కోరుతూ వారు జమ్మూ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌ను ఆశ్రయించారు.

విచారణ సందర్భంగా రైల్వే శాఖ తన తప్పిదాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసింది. నిబంధనల ప్రకారం రైళ్ల ఆలస్యానికి తాము బాధ్యత వహించలేమని, పొగమంచు వంటి ప్రకృతి సిద్ధమైన కారణాల వల్లే ఆలస్యం జరిగిందని వాదించింది. అయితే, కమిషన్ ప్రెసిడెంట్ పవన్ దేవ్ కొత్వాల్, సభ్యురాలు నీలం బాలా భరద్వాజ్‌లతో కూడిన ధర్మాసనం రైల్వే వాదనను తీవ్రంగా తప్పుబట్టింది. రైలు ఆలస్యానికి గల కారణాలు తమ నియంత్రణలో లేవని నిరూపించేందుకు రైల్వే శాఖ ఎలాంటి ఆధారాలు సమర్పించలేదని, కనీసం సకాలంలో లిఖితపూర్వక సమాధానం కూడా దాఖలు చేయడంలో విఫలమైందని కోర్టు స్పష్టం చేసింది.

రైల్వే శాఖ సేవలందించడంలో విఫలమైందని నిర్ధారిస్తూ ఈ నెల 4న కమిషన్ తుది తీర్పు వెలువరించింది. బాధితులకు అదనంగా అయిన ఖర్చు రూ. 38,199 మొత్తాన్ని 2023 ఫిబ్రవరి 13 నుంచి 7.5 శాతం వార్షిక వడ్డీతో కలిపి చెల్లించాలని ఆదేశించింది. దీనికి అదనంగా, వారు అనుభవించిన మానసిక వేదనకు పరిహారంగా రూ. 20,000, కోర్టు ఖర్చుల కింద మరో రూ. 5,000 చెల్లించాలని తీర్పు ఇచ్చింది. ఈ పూర్తి పరిహార మొత్తాన్ని ఆరు వారాల్లోగా డిపాజిట్ చేయాలని రైల్వే శాఖను కమిషన్ ఆదేశించింది.

ట్యాగ్‌లు: Indian Railways IRCTC