రెండు ఎన్‌సిపిల విలీనంపై నిలిచిపోయిన ఊహలు
రెండు ఎన్‌సిపిల విలీనంపై నిలిచిపోయిన ఊహలు
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగిసి 100 రోజులు దాటిపోయినా మోదీ ప్రభుత్వం వ్యూహాత్మక ఆశాభావంతో సభలను ప్రోరోగ్ చేయకపోవటం, రెండోవైపున మహారాష్ట్రకు చెందిన నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) రెండు చీలిక గ్రూపులు విలీనం కాబోతున్నాయన్న ఊహాగానాలు అర్థాంతరంగా ఆగిపోవటం రాజకీయంగా అంతర్సంబంధంగల అంశాలు. (ప్రోరోగ్ చేయని పార్లమెంటును రెండు రోజుల నోటీసుతో సమావేశపరచవచ్చు. ప్రోరోగ్ చేసిన సభలను పునః సమావేశపరచటానికి రెండు వారాల నోటీసు అవసరం). మహిళా రిజర్వేషన్ అమలును నియోజకవర్గాల డీలిమిటేషన్‌తో ముడిపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లును (ఏప్రిల్‌లో పార్లమెంటు తిరస్కరించింది) ఆమోదం కోసం వెంపర్లాడుతున్న బిజెపి ప్రభుత్వ నాయకత్వం ఎన్‌సిపి (శరద్ పవార్) ఎన్‌సిపి (అజిత్‌పవార్) గ్రూపుల విలీనాన్ని ప్రోత్సహించింది. అది జరిగితే తాము ఆశిస్తున్న పార్లమెంటరీ మెజారిటీ సమకూరుతుందని బిజెపి ఆశించింది. తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన 20 మంది ఎంపిలు ప్రత్యేక గ్రూపుగా ఏర్పడి ఒక అనామక పార్టీలో విలీనం నాటకం నడిపి ఎన్‌డిఎని బలపరచటం, ఓ అరడజను ఆప్ ఎంపిలు బిజెపిలో చేరటంతో రాజ్యాంగ సవరణకు అవసరమైన కొరదలా ఓట్లను ఆకర్షించేందుకు నరేంద్ర మోదీ, అమిత్ షా ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఆ ఆశతోనే పార్లమెంటును ప్రోరోగ్ చేయలేదు. డీలిమిటేషన్ బిల్లు ఆమోదానికి అవసరమైన మెజారిటీ చేకూరిందని, పార్లమెంటును త్వరలో సమావేశపరుస్తామని ప్రభుత్వం గాలిలోకి వార్తలు వదిలి పెడుతూ వచ్చింది.
రాజకీయ దురంధరుడు, ఎన్‌సిపి వ్యవస్థాపకుడు శరద్ పవార్ ఇటీవల అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన సందర్భంలో ప్రధాని మోదీ పరామర్శ ఫోన్‌కాల్ సంభాషణ ఎన్సిపిలు రెండూ విలీనం అయి ఎన్‌డిఎ భాగస్వామి కావాలన్న ఆయన ఆత్రుతతోకూడిన ఆకాంక్షను వెల్లడించింది. పవార్ కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, ‘మీరేమీ బెంగ పెట్టుకోకండి. సుప్రియా సూలె (పవార్ కుమార్తె, ఎంపి) నాతోపాటు ప్రభుత్వంలో బాధ్యత పంచుకుంటుంది’ అని హామీ (కేంద్రమంత్రిపదవి) యిచ్చారు. తర్వాత ఒకట్రెండు రోజులకు ఎన్‌సిపి (అజిత్) నాయకుడు (ప్రఫుల్ల పటేల్) చాలాకాలం తర్వాత పవార్‌ను ఆసుపత్రిలో పరామర్శించటం రెండు గ్రూపుల విలీనం ఊహాగానాలకు బలం చేకూర్చింది. కీ.శే.అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్ (రాష్ట్ర బిజెపి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి), ఆమె కుమారుడు పార్థపవార్లు పటేల్‌తోపాటు విలీన ఊహాగానాలను తిరస్కరించారు. ఆ తర్వాత సుప్రియా సూలె అన్నయ్య జీవించి ఉన్నప్పుడు ఆ ప్రతిపాదన తెచ్చారని, విమాన ప్రమాదంలో ఆయన మరణంతో అది అంతటితో పరిసమాప్తమైందని, ఇప్పుడు అటువంటిదేమీ లేదని కరాఖండీగా చెప్పారు.
రెండు పార్టీల విలీనానికి సైద్ధాంతిక సమస్యలతోపాటు వ్యక్తిగత ఆధిక్యత సమస్యలూ ఉన్నాయి. సోనియాగాంధి కాంగ్రెస్ అధ్యక్ష పదవిని చేబట్టాక, 1999లో అసంతృప్తి నేతలు శరద్‌పవార్, పి.ఎ.సంగ్మా, తారిఖ్ అన్వర్ కాంగ్రెస్ నుంచి వైదొలిగారు. ఆయన ఏర్పాటు చేసిన ఎన్‌సిపి రాష్ట్రంలో, కేంద్రంలో పలు ప్రభుత్వాల్లో పాల్గొన్నది. అయితే ముఠాతత్వం, పదవీకాంక్ష, అంతర్గత తగాదాలతో ప్రాభవం తగ్గింది. 2019 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత అజిత్ పవార్ బిజెపితో అలయెన్స్‌లో ప్రభుత్వంలో చేరారు. దీన్ని శరద్ పవార్ విమర్శించారు. అయితే అజిత్ తనతో మెజారిటీ ఎన్‌సిపి ఎమ్మెల్యేలను తీసుకుపోవటంతో అతని గ్రూపు అధికార ఎన్‌సిపిగా గుర్తింపు పొందింది. విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మరణం తర్వాత రెండు గ్రూపుల విలీనం ఊహాగానాలు తొలిసారి బయలుదేరాయి. అయితే అజిత్ పవార్ భార్య సునేత్ర తనను తాను పార్టీ అధ్యక్షురాలిగా ప్రకటించుకోగా, ముఖ్యమంత్రి ఫడ్నవీస్ వెనువెంటనే ఆమె చేత డిప్యూటీ సిఎం (అజిత్ పవార్ స్థానం)గా ప్రమాణ స్వీకారం చేయించారు. ఆ రకంగా అప్పుడు ఎన్‌సిపి పునరైక్యత అవకాశాలకు ఫడ్నవీస్ అడ్డుకట్ట వేశాడు. కాగా ఐక్యమైతే పార్టీపై తన ఆధిపత్యం ఉండదని సునేత్ర, ఆమె కుమారుడు భావిస్తున్నారు. శరద్ పవార్ ప్రధానమంత్రితో స్నేహసంబంధాలు కలిగి ఉన్నప్పటికీ ఆయన లౌకిక అర్హతలకు అనుగుణంగా ఇండియా కూటమిలో కొనసాగుతున్నారు. రెండు ఎన్సిపిలు విలీనమైతే ఆ ఏకపార్టీని ఎన్డిఎలో ప్రత్యేక అస్థిత్వంతో ఉంచాలన్నది బిజెపి ఆశ. తద్వారా డీలిమిటేషన్ బిల్లును ఆమోదింపజేసుకోవచ్చని భావం. తమతో చర్చల సందర్భంలో, ప్రతిరాష్ట్రంలో లోక్‌సభ సీట్లు 50 శాతం పెంచుతామని అమిత్ షా చెప్పారని, అది తనకు అంగీకారమేనని, అయితే తాము ఇండియా కూటమి ప్రకారం నడుచుకుంటామని తాను షాకు చెప్పినట్లు ఇటీవల సుప్రియ చెప్పటం గమనార్హం.
గత అధికారిక జనాభా లెక్కలు (సెన్సెస్) 2011 ప్రాతిపదికపై డీలిమిటేషన్ ఆమోదించుకోవాలని బిజెపి తొందరపడుతున్నది. ఆ ఆశ వెనుకనున్న వ్యూహం నెరవేరాలంటే డిసెంబర్‌లోగా పార్లమెంటు ఆమోదం కావాలి. ఏప్రిల్ నుంచి తాజా సెన్సెస్ ప్రారంభమవుతుంది. అందుకేనేమో, తమ రాజకీయ వ్యూహమేమిటో చెప్పకుండా బిజెపి పార్లమెంటును ప్రోరోగ్ చేయకుండా కాలం గడుపుతున్నది. డిసెంబర్లో పార్లమెంటు శీతాకాల సమావేశాల దృష్ట్యా, రానున్న రోజుల్లో పరిణామాలు ఆసక్తితో గమనించదగినవి. అఖిలపక్షం సమావేశం ఏర్పాటు చేసి ప్రతిపాదనలు చర్చించటానికి మోదీ ప్రభుత్వం ఎందుకు సిద్ధపడటంలేదు. దేశవ్యాప్త ప్రభావం కలిగిన శాసనంపై ఎందుకీ గోప్యత?