Hyderabad Business Fraud: హైదరాబాద్ టెకీలకు షాక్.. అధిక లాభాల ఆశ చూపి రూ.1.59 కోట్లు టోకరా.. పోలీసులను ఆశ్రయించిన బాధితులు..
Hyderabad Business Fraud
Hyderabad Business Fraud: వ్యాపారంలో పెట్టుబడి పెడితే భారీ లాభాలు వస్తాయని నమ్మబలికి ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల నుంచి ఏకంగా రూ.1.59 కోట్లు కాజేసిన ఘటన నగరంలో కలకలం రేపుతోంది. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. నగరంలోని బేగంపేటకు చెందిన రేపల్లె అచ్యుత్, సనత్‌నగర్‌కు చెందిన పూజారి లోకేశ్ ఇద్దరూ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. వీరికి మాచిరెడ్డి సాయి వెంకట మనోజ్ కుమార్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. విశాఖపట్నంలోని ప్రముఖ అరబిందో ఫార్మా కంపెనీకి సెక్యూరిటీ సిబ్బంది, లేబర్ , లాండ్రీ సేవలను అందించే కాంట్రాక్ట్ ఏజెన్సీని తన తల్లి నిర్వహిస్తోందని అతడు వారిని నమ్మించాడు. ఇదే క్రమంలో తన స్నేహితుడైన వెబ్‌కార్ప్స్ సీఈవో చిరాగ్‌ను కూడా బాధితులకు పరిచయం చేసి వారిలో మరింత విశ్వాసం కలిగించాడు.
ఈ సర్వీస్ కాంట్రాక్ట్ వ్యాపారంలో పెట్టుబడి పెడితే వచ్చే లాభాల్లో భారీ వాటా ఇస్తానని మనోజ్ కుమార్ వారికి ఆశ చూపించాడు. బాధితులను పూర్తిగా నమ్మించేందుకు ప్రారంభంలో లాభాల పేరిట కొంత మొత్తాన్ని వారి ఖాతాల్లో జమ చేశాడు. దీంతో అతడి మాటలను గుడ్డిగా విశ్వసించిన అచ్యుత్, లోకేశ్ విడతలవారీగా మొత్తం రూ.1.59 కోట్లను మనోజ్ కుమార్‌కు అప్పగించారు.
అయితే పెట్టుబడి డబ్బు మొత్తం చేతికి అందిన తర్వాత అసలు రంగు బయటపెట్టిన మనోజ్ కుమార్ ముఖం చాటేశాడు. బాధితులు తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని పదేపదే ఒత్తిడి చేయడంతో స్పందించడం మానేశాడు. తమలాగే మరికొందరు బాధితులు కూడా ఈ ముఠా చేతిలో మోసపోయి భారీగా డబ్బులు కోల్పోయారని వారు ఆరోపించారు. మనోజ్ కుమార్‌తో పాటు అతని భార్య మౌనిక, థాని నళిని కలిసి పక్కా ప్రణాళికతో ఈ ఆర్థిక మోసానికి పాల్పడ్డారని బాధితులు సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.