రాహుల్ గాంధీ మాట ఇస్తే.. మట్టిలో కలిసినా మాట తప్పరు.. గిగ్ వర్కర్లకు సీఎం రేవంత్ రెడ్డి భరోసా
రాహుల్ గాంధీ మాట ఇస్తే.. మట్టిలో కలిసినా మాట తప్పరు.. గిగ్ వర్కర్లకు సీఎం రేవంత్ రెడ్డి భరోసా
తెలంగాణలో గిగ్ వర్కర్స్ సంక్షేమ విధానం ప్రారంభం.. రాహుల్ గాంధీ చేతుల మీదుగా పాలసీ ఆవిష్కరణ
హైదరాబాద్: తెలంగాణలో గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక విధానాన్ని అమల్లోకి తీసుకురానుంది. ఈ మేరకు రూపొందించిన గిగ్ వర్కర్స్ పాలసీని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేతుల మీదుగా ప్రారంభించారు. 12 హామీలతో కూడిన ఈ ప్రత్యేక సంక్షేమ విధానం ద్వారా గిగ్ వర్కర్లకు సామాజిక భద్రత కల్పించడంతో పాటు వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. గిగ్ వర్కర్ల కోసం రూపొందించిన ఈ విధానం నాలుగు గోడల మధ్య కూర్చుని తయారు చేసిన చట్టం కాదని అన్నారు. గిగ్ వర్కర్లతో నేరుగా మాట్లాడి, వారి కష్టనష్టాలను తెలుసుకుని ఈ విధానాన్ని రూపొందించినట్లు తెలిపారు. రాష్ట్రంలోని గిగ్ వర్కర్లకు ప్రత్యేక గుర్తింపు కార్డులు అందించనున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వం వారికి అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
రాహుల్ గాంధీ మాట ఇస్తే.. మట్టిలో కలిసినా మాట తప్పరని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు.
అనంతరం రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. కాసేపటి క్రితమే తెలంగాణ గిగ్ వర్కర్లతో సమావేశమయ్యానని తెలిపారు. ఈ సందర్భంగా వారి కష్టాలు, నష్టాలు, ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా తెలుసుకున్నట్లు చెప్పారు. గిగ్ వర్కర్లకు తాము అండగా ఉంటామని, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
మొత్తంగా 12 హామీలతో రూపొందించిన ఈ గిగ్ వర్కర్స్ సంక్షేమ విధానం తెలంగాణలో డెలివరీ పార్ట్నర్లు, క్యాబ్ డ్రైవర్లు, ఇతర ప్లాట్ఫామ్ ఆధారిత కార్మికులకు ఎంతవరకు ప్రయోజనం చేకూరుస్తుందనేది ఆసక్తికరంగా మారింది.