టీజీఎస్ ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. మహిళలకు 50 శాతం రాయితీ.. ఆదివారం ఉచిత ప్రయాణం..
టీజీఎస్ ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. మహిళలకు 50 శాతం రాయితీ.. ఆదివారం ఉచిత ప్రయాణం!
తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు ఊరటనిచ్చేలా నెలవారీ సీజన్ టికెట్ల (ఎంఎస్టీ) విధానంలో కీలక మార్పులు తీసుకొచ్చింది. మహిళలకు ప్రత్యేక రాయితీ కల్పించడంతో పాటు పాస్‌ల ధరలు తగ్గేలా కొత్త నిబంధనలను అమల్లోకి తెస్తోంది. అలాగే సిటీ బస్ పాస్ కలిగిన వారికి ఆదివారాల్లో ఉచిత ప్రయాణ సదుపాయాన్ని అందిస్తోంది. ప్రయాణికులపై ఆర్థిక భారం తగ్గించి, ప్రజా రవాణా వినియోగాన్ని ప్రోత్సహించడమే ఈ నిర్ణయాల ఉద్దేశమని టీజీఎస్ ఆర్టీసీ వెల్లడించింది. సవరించిన నిబంధనలు శనివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి రానున్నాయి.
మహిళలకు నెల పాస్‌పై సగం ధర
ప్రస్తుతం మహిళలకు పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ వంటి సాధారణ సర్వీసుల్లో మహాలక్ష్మి పథకం కింద ఉచిత ప్రయాణ సదుపాయం ఉంది. అయితే మెట్రో, రాజధాని, డీలక్స్ వంటి ప్రత్యేక బస్సుల్లో ప్రయాణించాలంటే టికెట్ లేదా పాస్ తీసుకోవాల్సిందే. ఈ నేపథ్యంలో ఆయా సర్వీసుల్లో ప్రయాణించే మహిళలకు ఆర్టీసీ కొత్త రాయితీ ప్రకటించింది.
ఇకపై మహిళలు నెలవారీ రూట్ పాస్ కొనుగోలు చేసేటప్పుడు సాధారణ ధరలో సగం మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. అంటే 30 రోజుల ప్రయాణానికి 15 రోజుల చార్జీ చెల్లిస్తే చాలు. ఉదాహరణకు హైదరాబాద్ నుంచి వరంగల్‌కు వెళ్లే నెలవారీ పాస్‌ను గతంలో ఉన్న ధరతో పోలిస్తే సగం మొత్తానికే పొందవచ్చు. దీంతో ఉద్యోగాలు, ఇతర అవసరాల కోసం ప్రతిరోజూ ప్రయాణించే మహిళలకు ప్రయోజనం కలగనుంది.
టోల్ చార్జీల లెక్కింపులో మార్పు
నెలవారీ పాస్‌ల ధరలు తగ్గించేందుకు టోల్ ప్లాజా చార్జీలను లెక్కించే విధానంలోనూ ఆర్టీసీ మార్పులు చేసింది. ఇప్పటివరకు పాస్ ధర నిర్ణయంలో 25 రోజుల టోల్ చార్జీలను పరిగణనలోకి తీసుకునేవారు. ఇకపై ఈ లెక్కింపును 20 రోజులకు పరిమితం చేయనున్నారు. ఈ మార్పుతో వివిధ రూట్లలో అందించే నెలవారీ పాస్‌ల ధరలు కొంత తగ్గనున్నాయి.
డీలక్స్ బస్సుల్లో ప్రయాణానికి కొత్త పాస్
ప్రయాణికుల సౌకర్యం కోసం ఆర్టీసీ మరో కొత్త టికెట్ విధానాన్ని తీసుకొస్తోంది. ‘డీలక్స్ నెలవారీ సీజన్ టికెట్’ పేరుతో ప్రత్యేక పాస్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ పాస్ తీసుకున్నవారు డీలక్స్‌తో పాటు ఈ-డీలక్స్ బస్సుల్లోనూ ప్రయాణించవచ్చు. దీంతో ఆయా సర్వీసులను తరచుగా వినియోగించే వారికి ప్రత్యేకంగా టికెట్లు కొనుగోలు చేయాల్సిన అవసరం తగ్గనుంది.
ఆదివారాల్లో సిటీ బస్సుల్లో ఫ్రీ జర్నీ
నగర ప్రయాణికులకు కూడా టీజీఎస్ ఆర్టీసీ అదనపు ప్రయోజనం ప్రకటించింది. హైదరాబాద్‌తో పాటు వరంగల్, కరీంనగర్, నల్గొండ, నిజామాబాద్ నగరాల్లో నెలవారీ సిటీ బస్ పాస్ కలిగినవారు ఆదివారాల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. ఈ సదుపాయం అన్ని కేటగిరీల సిటీ బస్సులకు వర్తించనుంది.
మొత్తంగా నెలవారీ పాస్‌లపై రాయితీలు, టోల్ చార్జీల తగ్గింపు, కొత్త డీలక్స్ పాస్, ఆదివారం ఉచిత ప్రయాణం వంటి నిర్ణయాలతో ఆర్టీసీ ప్రయాణికులకు మరింత వెసులుబాటు కల్పించనుంది. కొత్త నిబంధనలు అమల్లోకి రావడంతో సాధారణ ప్రయాణికులతో పాటు ఉద్యోగులు, మహిళలకు ఎంతమేర ప్రయోజనం కలుగుతుందో చూడాలి.