యు.పి. ఎన్నికలు యోగికి సునాయాసం కావు…ఓటర్ల జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ
యు.పి. ఎన్నికలు యోగికి సునాయాసం కావు…ఓటర్ల జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ
రచయిత: జ్ఞాన్ పాఠక్
(ఎస్ఐఆర్)లో భాగంగా కోటి మందికి పైగా హిందువుల ఓటర్ల పేర్లను తొలగించడంపై ఇటీవల ఒక బిజెపి సమావేశంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు 2027 ఎన్నికలకు ముందు ఆ పార్టీ రాజకీయ బలహీనతలకు స్పష్టమైన సూచన. 2017 లేదా 2022 ఎన్నికలతో పోలిస్తే బిజెపి 2027 ఎన్నికలకు గణనీయమైన అనిశ్చితుల నడుమ బరిలోకి దిగుతోందని ఇది తెలియజేస్తోంది.
నరేంద్ర మోదీ తరువాత ప్రధానమంత్రి పదవికి యోగి ఆదిత్యనాథ్ తనకు పోటీదారుగా నిలవకూడదనే ఉద్దేశ్యంతోనే కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదిత్యనాథ్‌ను లక్ష్యంగా చేసుకున్నారని, అందుకే పార్టీలో ఆయనను, ఆయన అనుచరులను బలహీనపరిచేందుకు హిందూ ఓట్లను తొలగిస్తున్నారని ఉత్తరప్రదేశ్‌లో ఒక పుకారు వ్యాపిస్తోంది. ఓటర్ల జాబితా నుంచి హిందూ ఓటర్లను తొలగించటంపై తలెత్తిన వివాదం యోగిని స్పష్టంగా కలవరపెట్టినప్పటికీ, ఉత్తరప్రదేశ్‌లో బిజెపి ప్రధాన నాయకుడిగా యోగి ఆదిత్యనాథ్ స్థానానికి తక్షణ ముప్పు ఏమీ లేదు.
యోగికి ఉన్న మరో ఆందోళన ఏమిటంటే, బిజెపిలో కులపరమైన ఉద్రిక్తతలు, పార్టీ కార్యకర్తలలో అసంతృప్తితో సహా అంతర్గత అసంతృప్తి పెరుగుతూ ఉండటం. అంతేకాకుండా, 2024 లోక్‌సభ ఎన్నికలలో సమాజ్‌వాదీ పార్టీ కాంగ్రెస్ కూటమి కనబరిచిన అద్భుతమైన ప్రదర్శన నేపథ్యంలో శాసనసభ ఎన్నికలలో బిజెపికి బలమైన సవాలుగా మారే అవకాశం కూడా ఉంది.
బిజెపిలో యోగి రాజకీయ స్థానం, ఆ పార్టీ ఎన్నికల అవకాశాలు, యోగి రాజకీయ శిబిరం భవిష్యత్తు అనేవి మూడు వేర్వేరు ప్రశ్నలు. అవి ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నప్పటికీ, ఒకేలాంటివి కావు. ఈ సమయంలో వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.
అసలేమి జరిగింది?
అక్టోబర్ 31న జరిగిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో యోగి ఒక సంచలన ఆరోపణ చేశారు. ఉత్తరప్రదేశ్ ఓటర్ల జాబితాలో సుమారు 1.27 కోట్ల హిందూ ఓటర్లు గల్లంతయ్యారని, అర్హులైన ఓటర్లు నమోదయ్యేలా చూడాలని ఆయన బిజెపి ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ కార్యకర్తలను ఆదేశించారు. పంచాయతీ ఓటర్ల జాబితాలో ఉన్న 66 లక్షల మంది శాసనసభ నియోజకవర్గాల జాబితాలో లేరని కూడా ఆయన ఆరోపించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులలో సుమారు 55 లక్షల మంది నమోదు కాలేదని తెలిపారు. 18 ఏళ్ల వయస్సు గల దాదాపు 4.5 లక్షల మంది యువకులు జాబితాలో గల్లంతయ్యారని పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్‌లో 16 కోట్లకు పైగా ఓటర్లు ఉండగా, ప్రస్తుత ఓటర్ల జాబితాలో సుమారు 13 కోట్ల మంది మాత్రమే ఉన్నారని ఆయన వాదించారు. ఈ లోపభూయిష్ట పరిస్థితులు 28 పట్టణ స్థానిక సంస్థల నియోజకవర్గాలలో బిజెపి స్థానాన్ని బలహీనపరుస్తున్నాయని కూడా ఆయన సూచించారు.
ఈ వివాదాన్ని ఎస్ఐఆర్ నేపథ్యంలో ఓటర్ల జాబితా సవరణను అర్థం చేసుకోవాలి. యుపి ఓటర్ల జాబితాకు సంబంధించి ఎన్నికల సంఘం ప్రకటించిన తుది జాబితాలో ఓటర్ల సంఖ్య 15.44 కోట్ల నుంచి సుమారు 13.39 కోట్లకు తగ్గిపోయింది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయమేమిటంటే, 1.27 కోట్ల హిందూ ఓటర్లను తొలగించినట్లు ఎన్నికల సంఘం చెప్పలేదు. ఉదహరించిన గణాంకాలలో తొలగించిన ఓటర్ల మతపరమైన కూర్పును అందించలేదు.
ఇది యోగిని ఎందుకు కలవరపెడుతోంది? ఎందుకంటే ఇది బిజెపి ఎన్నికల లెక్కలను తలకిందులు చేయవచ్చు. అగ్రవర్ణ హిందువులు, యాదవేతర ఒబిసిలు, దళితులలోని కొన్ని వర్గాలు, ఇతర వర్గాల విస్తృత కలయికపై బిజెపి ఆధారపడి ఉంటుంది. దాని హిందూ ఏకీకరణ వ్యూహం ఈ కలయికలో ఒక ముఖ్యమైన భాగం. బిజెపి పట్ల సానుభూతి ఉన్న, అర్హత కలిగిన ఓటర్లు పెద్ద సంఖ్యలో ఓటర్ల జాబితాలో లేకపోతే, అది ముఖ్యంగా హోరాహోరీగా పోటీ ఉండే నియోజకవర్గాలలో పార్టీకి నష్టం కలిగించవచ్చు.
పట్టణ ప్రాంత నియోజకవర్గాలపై ఆందోళన
యోగి ప్రత్యేకంగా 28 పట్టణ ప్రాంత నియోజకవర్గాలను ప్రస్తావించారు. బిజెపికి పట్టణ ప్రాంతాలు సాంప్రదాయకంగా ముఖ్యమైనవి. ఈ ప్రాంతాల్లో ఓటర్ల జాబితాలో గణనీయమైన మార్పులు జరిగి ఉంటే, తమ మద్దతుదారులు సరిగ్గా నమోదు అయ్యారో లేదో తనిఖీ చేయడానికి పార్టీకి చట్టబద్ధమైన కారణం ఉంటుంది. సంస్థాగత నిర్లక్ష్యం గురించి కూడా బిజెపి ఆందోళన చెందుతోంది. దాదాపు దశాబ్దకాలంగా అధికారంలో ఉన్న పార్టీ, తమ సంప్రదాయ ఓటర్లు తమకు మద్దతు ఇస్తూనే ఉంటారని భావించవచ్చు. కానీ ఓటర్ల నమోదుకు బూత్ స్థాయిలో చురుకైన సమీకరణ అవసరం. తమ ఓటర్ల బలాన్ని తేలికగా తీసుకోవద్దని బిజెపి సంస్థాగత వ్యవస్థకు యోగి పరోక్షంగా చెబుతున్నారు.
హిందూ ఓటర్లు కనబడకపోవడమే సమస్యగా పేర్కొనడం ద్వారా యోగి హిందూ రాజకీయ ప్రయోజనాలను పరిరక్షించే నాయకుడిగా తన రాజకీయ స్థానాన్ని కూడా బలోపేతం చేసుకుంటున్నారు. ఇది చాలా ముఖ్యమైనది, ఎందుకంటే యుపిలో బిజెపి ఎన్నికల వ్యూహంలో ఆయన అనివార్యంగా ఉండాలని కోరుకుంటున్నారు. ఆయన ఆందోళన ఎన్నికల సంబంధమైనది, రాజకీయ సంబంధమైనది కూడా.
బిజెపిలో యోగి ఆధిపత్యానికి సవాలు ఎదురవుతోందా? ఈ ప్రశ్నకు సమాధానం చాలా కీలకం. యోగి స్థానం బలంగానే ఉంది, కానీ బిజెపిలో ముఖ్యమంత్రి ఒక్కరే అధికారాన్ని అన్ని విధాలుగా నియంత్రించలేరు. ఇక్కడ మూడు ప్రభావ కేంద్రాలు ఉన్నాయి. అవి 1) యోగి ఆదిత్యనాథ్, ఆయన పరిపాలన, 2) ప్రధాన నిర్మాణ, ఎన్నికల నిర్ణయాలను నియంత్రించే బిజెపి కేంద్ర నాయకత్వం, 3) ఎన్నికల సమీకరణకు సహకారం అందించే ఆర్ఎస్ఎస్, విస్తృత సంఘ్ పరివార్.
బయటపడుతున్న అంతర్గత విభేదాలు
యోగికి ఉన్న రాజకీయ బలం ఆయన వ్యక్తిగత ప్రజాదరణ, హిందుత్వ నేపథ్యం, పరిపాలనా ప్రతిష్ట, ఓటర్లను సమీకరించగల సామర్థ్యం నుంచి వస్తుంది. అయితే, అంతర్గత విభేదాల సంకేతాలు కనిపిస్తున్నాయి. కేశవ్ ప్రసాద్ మౌర్య అంశం ముఖ్యమైనది. ఎందుకంటే ఆయన ఒక ముఖ్యమైన రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్నారు. ఉప ముఖ్యమంత్రిగా యోగి కన్నా భిన్నమైన సామాజిక, రాజకీయ వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయనకు ఒబిసి రాజకీయ గుర్తింపుతో పాటు బిజెపి విస్తృత సంస్థాగత నిర్మాణంతో కూడా సంబంధాలు ఉన్నాయి.
యుపిలో 2024 లోక్‌సభ ఎన్నికలలో బిజెపి నిరాశాజనకమైన ప్రదర్శన తర్వాత వీరిద్దరి మధ్య ఉద్రిక్తతలు ప్రత్యేకంగా బయటపడ్డాయి.
మరో తీవ్రమైన బలహీనత ఠాకూర్-బ్రాహ్మణ మధ్య ఉద్రిక్తతలు. యోగి ఠాకూర్ నేపథ్యం ఎప్పటికప్పుడు రాజకీయ సమస్యగా మారుతోంది. బ్రాహ్మణ నాయకులలోని కొన్ని వర్గాలు తమకు తగినంత రాజకీయ ప్రాతినిధ్యం లేదని, పరిపాలనా వివక్ష జరుగుతోందని ఆరోపించాయి. 2025 డిసెంబర్లో బ్రాహ్మణ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సమావేశం వివాదాస్పదం కావడంతో, కుల ఆధారిత సమావేశాలకు దూరంగా ఉండాలని బిజెపి నాయకత్వం శాసనసభ్యులను బహిరంగంగా హెచ్చరించింది.
ఇది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే బిజెపి ఎన్నికల విజయం అగ్రవర్ణాలు, యాదవేతర ఒబిసిల మధ్య ఐక్యతను కొనసాగించడంపై ఆధారపడి ఉంటుంది. బ్రాహ్మణులలో అసంతృప్తి పెరిగితే, అది ప్రతిపక్షానికి ఒక అవకాశాన్ని కల్పిస్తుంది.
అంతేకాకుండా, ఆ పార్టీ వ్యవస్థ పూర్తిగా సౌకర్యవంతంగా లేదు. పార్టీ కార్యకర్తలలోని అసంతృప్తిని పరిష్కరించడానికి బిజెపి, ఆర్ఎస్ఎస్లు కాశీ, గోరఖ్‌పూర్ ప్రాంతాలలో సమావేశాలు నిర్వహించాయి. ఇందులో తేలిన ప్రధాన ఫిర్యాదులు ఏవంటే పరిపాలన యంత్రాంగం కార్యకర్తలను నిర్లక్ష్యం చేయడం, పార్టీ ఫిరాయింపుదారులు సంస్థాగత పదవులు పొందటం, ప్రభుత్వ అధికారులపై స్థానిక బిజెపి నాయకులకు తగినంత ప్రభావం లేకపోవడం, ప్రతిపక్షాల విమర్శల నుండి యోగిని, ఆయన ప్రభుత్వాన్ని సమర్థించడంలో పార్టీ కార్యకర్తలలో ఉత్సాహం కొరవడటం.
(ఐపిఎ సర్వీస్)