Microsoft Workforce Shift: మైక్రోసాఫ్ట్ కంపెనీలో 2 కోట్ల ఏఐ ఏజెంట్లు.. సత్య నాదెళ్ల సంచలన వ్యాఖ్యలతో ఉద్యోగుల భవిష్యత్తుపై పెరుగుతున్న ఆందోళనలు..
Microsoft Offers Voluntary Exit Scheme
Microsoft Workforce Shift: ప్రపంచ ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌లో చోటుచేసుకుంటున్న తాజా పరిణామాలు గ్లోబల్ టెక్ పరిశ్రమలో తీవ్ర ఆందోళనకు దారితీస్తున్నాయి. ఒకవైపు దాదాపు 60,000 మంది ఉద్యోగులకు స్వచ్ఛంద నిష్క్రమణ పథకాన్ని (వీఓఎస్ – వాలంటరీ ఎక్జిట్ ఆఫర్) ప్రకటించడం, మరోవైపు కోట్లాది ‘ఏఐ ఏజెంట్ల’ వినియోగంపై సీఈఓ సత్య నాదెళ్ల గతంలో చేసిన వ్యాఖ్యల వీడియో సామాజిక మాధ్యమాల్లో మళ్లీ వైరల్ కావడం ఐటీ వర్గాల్లో సంచలనంగా మారింది. మానవ వనరుల స్థానంలో ఏఐ ఏజెంట్లను భర్తీ చేయబోతున్నారనే భయాలను ఈ పరిణామాలు మరింత బలపరుస్తున్నాయి.
కంపెనీ వ్యూహాత్మక మార్పులలో భాగంగా భారత్, అమెరికా, బ్రిటన్, కెనడా దేశాల్లోని ‘లేవల్ 70’ అంతకంటే తక్కువ కేటగిరీకి చెందిన సిబ్బందికి మైక్రోసాఫ్ట్ స్వచ్ఛంద నిష్క్రమణ ప్యాకేజీని ఆఫర్ చేసింది. వ్యాపార అవసరాలకు అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ చీఫ్ పీపుల్ ఆఫీసర్ అమీ కోల్‌మన్ పేర్కొన్నప్పటికీ, దాదాపు 5 శాతం లోపు (సుమారు 3,000 మంది) మాత్రమే ఈ ఆఫర్‌ను స్వీకరించవచ్చని అంచనా వేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) దిశగా సంస్థ వేగంగా అడుగులు వేస్తున్న సమయంలోనే ఈ వీఓఎస్ ఆఫర్ వెలువడటం గమనార్హం.
ఇదే సమయంలో, జూన్ 2026 నాటి ‘పాజిబుల్’ పాడ్‌కాస్ట్‌లో లింక్డ్‌ఇన్ సహ వ్యవస్థాపకుడు రీడ్ హాఫ్‌మన్‌తో సత్య నాదెళ్ల జరిపిన సంభాషణ వీడియో సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ (X)లో మళ్లీ హల్‌చల్ చేస్తోంది. తమ సంస్థలో పనిచేసే రెండు లక్షల మంది మానవ ఉద్యోగులతో పాటు 20 లక్షల నుంచి 2 కోట్ల (20 మిలియన్) ఏఐ ఏజెంట్లు ఒకే లూప్‌లో పనిచేసే రోజులు త్వరలోనే రాబోతున్నాయని ఆ ఇంటర్వ్యూలో నాదెళ్ల వెల్లడించారు. సాఫ్ట్‌వేర్ కోడింగ్‌లో ఏఐ పాత్ర ఇప్పటికే విపరీతంగా పెరిగిందని, భవిష్యత్తులో అది కేవలం సహకరించడమే కాకుండా స్వతంత్ర ఏజెంట్‌గా పనులను పూర్తి చేయనుందని ఆయన స్పష్టం చేశారు.
ఈ మార్పుల వల్ల సాధారణ కోడింగ్, డాక్యుమెంటేషన్, డేటా ప్రాసెసింగ్ చేసే ఉద్యోగాలపై ఏఐ ఏజెంట్ల ప్రభావం నేరుగా పడే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. భవిష్యత్తులో సాంకేతిక పరిజ్ఞానంతో పాటు ఏఐ ఏజెంట్లను నిర్వహించే ‘ప్రాంప్ట్ ఇంజినీరింగ్’, ‘ఏఐ మేనేజ్‌మెంట్’ నైపుణ్యాలు మానవ ఉద్యోగులకు అత్యంత తప్పనిసరి కానున్నాయి. ఒకవైపు మానవ సిబ్బందిని తగ్గించుకునే దిశగా అడుగులు వేస్తూనే, మరోవైపు మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్లు, ఏఐ క్లౌడ్ మౌలిక సదుపాయాలపై రికార్డు స్థాయిలో పెట్టుబడులు వెచ్చిస్తుండటం గ్లోబల్ టెక్ రంగానికి సరికొత్త దిశానిర్దేశం చేస్తోంది.