Parliament Session: ప్రొరోగ్ అవ్వకుండా 88 రోజులుగా కొనసాగుతున్న పార్లమెంట్ సమావేశాలు.. 2008 నాటి రికార్డు బద్దలు..
Parliament Monsoon Session
Parliament Session: ఈ ఏడాది ఆగస్టులో పార్లమెంట్ ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడినప్పటికీ, సమావేశాలు అధికారికంగా ముగిసినట్లు (ప్రొరోగ్ అయినట్లు) ఇప్పటివరకు ప్రకటన వెలువడలేదు. గత 88 రోజులుగా పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రొరోగ్ కాకుండా ఇలాగే కొనసాగుతుండటంతో 2008 నాటి రికార్డు బద్ధలైంది. నాడు వరుసగా 87 రోజుల పాటు పార్లమెంట్ సమావేశాలు ప్రొరోగ్ కాకపోవడం అత్యధిక సమయంగా ఉండేది.
సాధారణంగా లోక్సభ, రాజ్యసభలు నిరవధికంగా వాయిదా పడిన రెండు మూడ్రోజుల్లోనే సమావేశాలు ముగిసినట్లు రాజ్యాంగంలోని ఆర్టికల్ 85(1) ప్రకారం రాష్ట్రపతి ప్రకటిస్తుంటారు. అయితే ఈసారి ఆగస్టు 13న వర్షాకాల సమావేశాలు ముగిసినప్పటికీ రాష్ట్రపతి నుంచి ముగింపు ప్రకటన రాలేదు. దీనివల్ల ఆర్టికల్ 85(1) కింద జారీ చేసిన ఉత్తర్వులు ఇప్పటికీ అమల్లో ఉన్నట్లే పరిగణిస్తారు. ఫలితంగా, మళ్లీ రాష్ట్రపతి కొత్తగా పిలుపు ఇవ్వాల్సిన అవసరం లేకుండానే పార్లమెంటరీ వ్యవహారాల శాఖ ఎప్పుడు కావాలంటే అప్పుడు సమావేశాలను తిరిగి నిర్వహించే వెసులుబాటు లభిస్తుంది.
మహిళా రిజర్వేషన్ల చట్టాన్ని 2029 నాటికి అమలులోకి తెచ్చే ఉద్దేశంతో ప్రతిపాదించిన నియోజకవర్గాల పునర్విభజన బిల్లు (Delimitation Bill) ఆమోదం కోసమే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గత బడ్జెట్ సమావేశాల సమయంలో ఏప్రిల్ 17న లోక్సభలో ప్రవేశపెట్టిన ఈ బిల్లుకు సరిపడా సంఖ్యాబలం లేక ఆమోదం లభించలేదు. ఒకవేళ ఈ బిల్లు చట్టంగా మారితే లోక్సభ స్థానాల సంఖ్య 543 నుండి 850కి పెరుగుతుంది. దీనిపై చర్చించేందుకు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
గతంలో కూడా ఇలాంటి సుదీర్ఘ విరామాలు చోటుచేసుకున్నాయి. 2008లో నాటి యూపీఐ ప్రభుత్వంపై వచ్చిన అవిశ్వాస తీర్మానంపై జులై 21, 22 తేదీల్లో సమావేశమైన అనంతరం ప్రొరోగ్ చేయకుండా అక్టోబర్ 17న తిరిగి సభను నిర్వహించారు. అలాగే 1987లో 76 రోజులు, 1989లో 54 రోజులు, 2006 , 2013లలో 49 రోజులు, 1963లో 41 రోజుల పాటు పార్లమెంట్ ప్రొరోగ్ అవ్వకుండా కొనసాగింది. అయితే ప్రస్తుత 88 రోజుల వ్యవధి చారిత్రకంగా అత్యంత సుదీర్ఘమైనదిగా నిలిచింది.