China Economic Slowdown: చైనాలో ముదురుతున్న అప్పుల సంక్షోభం..ఉద్యోగాలు పోయి.. ఆదాయం తగ్గి.. కోట్లాది మందికి అప్పుల కష్టాలు..
China Flag
China Economic Slowdown: చైనాలో తీవ్రమవుతున్న ఆర్థిక మందగమనం మూలంగా ఆదేశంలోని సామాన్య ప్రజలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్నారు. ఉద్యోగాలు కోల్పోవడం, రియల్ ఎస్టేట్ రంగం దారుణంగా దెబ్బతినడం , కోవిడ్-19 మహమ్మారి మిగిల్చిన దీర్ఘకాలిక ఆర్థిక నష్టాల వల్ల చైనాలోని కుటుంబాల వద్ద ద్రవ్య లభ్యత క్షీణించింది. బ్లూమ్బర్గ్ బిజినెస్వీక్ నివేదిక ఆధారంగా గేవికల్ డ్రాగనోమిక్స్ అనే ప్రముఖ ఆర్థిక పరిశోధనా సంస్థ వెల్లడించిన అంచనాల ప్రకారం, సుమారు 10 కోట్ల మంది వినియోగదారులు తాము తీసుకున్న వ్యక్తిగత రుణాల వాయిదాలను తిరిగి చెల్లించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
రాయునియన్ క్రెడిట్ ప్లాట్ఫామ్ డేటా ప్రకారం, చైనాలో చెల్లించని వినియోగదారుల రుణాల మార్కెట్ విపరీతంగా విస్తరించింది. 2021లో చైనా బ్యాంకులు బదిలీ చేసిన చెల్లించని వినియోగదారుల మొండి బకాయిల విలువ కేవలం 18.6 బిలియన్ యువాన్లు కాగా, 2025 చివరి నాటికి అది ఏకంగా 20 రెట్లు పెరిగి దాదాపు 454 బిలియన్ యువాన్లకు చేరడం ఇక్కడి పరిస్థితికి అద్దంపడుతోంది. ఇవి ప్రధానంగా క్రెడిట్ కార్డు బకాయిలు , వ్యక్తిగత రుణాలు వంటి అసురక్షిత రుణాలు మాత్రమేనని, గృహ లేదా వాహన రుణాలు ఇందులో భాగం కాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
ఈ సంక్షోభం వల్ల క్షేత్రస్థాయిలో రుణగ్రహీతలు తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. వుహాన్కు చెందిన 23 ఏళ్ల ర్యాన్ హు వంటి డెట్ కలెక్టర్లు రోజంతా రికవరీ ఫోన్లు చేస్తూనే ఉన్నారు. కరోనా తర్వాత కోలుకోలేని రెస్టారెంట్ యజమానులు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉద్యోగాలు కోల్పోయిన దంపతులు, కనీసం ఇంటి అద్దె కూడా చెల్లించలేని స్థితిలో ఉన్న యువ గ్రాడ్యుయేట్లు ఈ డిఫాల్టర్లలో అధికంగా ఉన్నారు.
అధికారికంగా బ్యాంకింగ్ రికార్డులలో చైనా గృహ రుణాల ఎగవేత రేటు 3 శాతం కంటే తక్కువగా నమోదైనప్పటికీ, వాస్తవ పరిస్థితి దీనికి భిన్నంగా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. చాలా మంది పాత వాయిదాలు చెల్లించడానికి రీఫైనాన్సింగ్ చేయడం లేదా కుటుంబ సభ్యుల సహాయం తీసుకోవడం ద్వారా నెట్టుకొస్తున్నారు. దీనికి తోడు దేశవ్యాప్తంగా వ్యక్తిగత దివాలా చట్టం లేకపోవడం వల్ల ఈ అసలు సమస్య పరిమాణం బయటకు రావడం లేదని స్పష్టం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా, చైనా ప్రభుత్వం రుణ వసూళ్లపై ప్రవేశపెట్టిన కఠినమైన నిబంధనలతో దూకుడు రికవరీ పద్ధతులు తగ్గినా, వసూళ్లు మందగించాయి. మరోవైపు ఆన్లైన్ రుణాలపై వడ్డీ రేట్లను ప్రభుత్వం పరిమితం చేయడంతో రుణగ్రహీతులకు కొత్త అప్పులు పుట్టడం మరింత కష్టంగా మారింది.