Skip to content
ఎడిట్ పేజి › వార్తలు

ఎన్నికల కమిషన్‌ పిల్లిమొగ్గలు

Prajapaksham 08 Nov 2026 1 నిమిషాల పఠనం ఎడిట్ పేజి
ఎన్నికల కమిషన్‌ పిల్లిమొగ్గలు

ఓటరు జాబితాల ముమ్మర సవరణ (ఎస్‌ఐఆర్‌) పేరుతో భారత ఎన్నికల కమిషన్‌ (ఇసిఐ) కోట్లాదిమంది పేర్లను జాబితాలనుంచి తొలగించటంపై ప్రతిపక్ష ఇండియా కూటమి, జన్‌ జడ్‌ సిజెపి, విద్యార్థి సంఘాలు, స్వతంత్ర ప్రజాసంఘాలు, వేదికలు ఉవ్వెత్తున సాగిస్తున్న ఆందోళనలు, రెండోవైపున సుప్రీంకోర్టులో ఉక్కిరిబిక్కిరి మధ్య ఎన్నికల కమిషన్‌ తన తప్పులు తగ్గించుకునే ప్రయత్నంగా ‘సర్‌’ ప్రక్రియ అమలులో మార్పులు ప్రకటిస్తున్నది. ఫారం 6(ఓటరుగా నమోదు)కు జత చేసిన సర్‌ డిక్లరేషన్‌, ఫారం 6లో భాగం కాదని ముందు వాదించిన ఇసి విమర్శలు తట్టుకోలేక అది అదనపు డిక్లరేషన్‌ అంది. ఆ తర్వాత అది ఎలక్ట్రానిక్‌ దరఖాస్తులకే పరిమితం అంది. ఫారం 6లో ఏ మార్పు అయినా చేసే అధికారం పార్లమెంటుకు తప్ప ఇసికి ఎక్కడిదని సుప్రీంకోర్టు ధర్మాసనం నిలదీశాక, ఆ అదనపు డిక్లరేషన్‌ను తొలగించింది. ముసాయిదా ఓటర్ల జాబితాలో పేరులేని పాత ఓటర్లు ఫారం 6 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు అంది. అయితే ఫారం 6 తొలిసారి ఓటర్ల రిజిస్ట్రేషన్‌కు ఉద్దేశించింది తప్ప పాత ఓటర్లకు కాదని, క్రితం జాబితాలో పేరున్న ఓటర్లు తమ పేర్లు సర్‌లో తొలగించబడితే, తిరిగి చేర్పును కోరుతూ ఆ ఫారం సమర్పిస్తే చట్టప్రకారం శిక్షించబడతారనే విషయం బహిర్గతమైనాక, తొలగించే ఓటర్లకు న్యాయం చేసే అవకాశంగా సుప్రీంకోర్టు ఇసి రక్షణకు వచ్చి ఫారం 6 కింద ఓటు పునరుద్ధరణకు అనుమతించింది.

బూత్‌స్థాయి అధికారులు ఓటరు ఎన్యూమరేషన్‌ ఫాంలు సక్రమంగా పంపిణీ చేయలేదని, ఫాంలు తిరిగి కలెక్ట్‌ చేసుకోలేదని, వారి తప్పుకు ఓటర్లను ఆఫీసు చుట్టూ ఎందుకు తిప్పుకుంటారని సుప్రీంకోర్టులో నిలదీయగా, ఓటర్లు తిరగనక్కర్లేదని, బిఎల్‌ఒలే ఇంటింటికీ వెళ్లి అటువంటి ఫారాలు పూర్తి చేయించి తీసుకువస్తారని, అలాంటి ఓటర్లు అందరూ ఇంటివద్ద ఉండనవసరం లేదనీ, ఎవరో ఒకరు ఉండి వివరాలు తెలియజేస్తే సరిపోతుందని ఎన్నికల కమిషన్‌ ఒక సడలింపు ఇచ్చింది. తాజాగా మరొక సౌకర్యం ప్రసాదించింది. సర్‌ పూర్తి అయిన రాష్ట్రాల్లో ఓటర్ల సమ్మరీ రివిజన్‌ జరుగుతున్నందున అక్కడ పేరు కోల్పోయిన పాత ఓటర్లు ఫారం 6 సమర్పించి ఓటు హక్కు పునరుద్ధరణ కోరవచ్చు. కాగా సర్‌ ప్రక్రియ పొడిగించబడిన 7 రాష్ట్రాల్లో (ఢిల్లీ, మహారాష్ట్ర, హర్యానా, ఆంధ్రప్రదేశ్‌, జార్ఖండ్‌, తెలంగాణ, నాగాలాండ్‌)లోగడ ఎన్యూమరేషన్‌ ఫారాలు తీసుకుని, తిరిగి ఇవ్వని ఓటర్లకు ఇప్పుడు తిరిగి ఇచ్చే మరో అవకాశం కల్పించింది. ఫారాలుతిరిగి ఇవ్వని వారిని ఎఎస్‌డిడి (గైరు హాజరు, నివాసం మార్పు, మరణం, రెండుచోట్ల ఓటు) కేటగిరిలో పెట్టి ఇసి వారి ఓట్లు తొలగించటం తెలిసిందే. దేశం మొత్తం మీద ఈ కేటగిరి కింద తొలగించబడిన ఓట్లు 13కోట్లకుపైగా ఉన్నాయి. ఒకసారి ఓటరు జాబితాలో చేరిన వారిని (మరణాలు మినహాయించి) తొలగించే హక్కు ఇసికి ఏ చట్టం కింద ఉందన్న ప్రశ్న ముందుకు వచ్చింది. నివాసం మారినవారు ఓటు పునరుద్ధరించుకునేందుకు సుప్రీంకోర్టు ఒక మార్గం సూచించింది. తొలగించబడిన అటువంటి ఓటర్ల జాబితాలను వారి పోలింగ్‌ బూత్‌లవారీ తయారుచేసి అక్కడ ప్రదర్శించాలని, ఆ విషయాన్ని ప్రచారం చేసి నిర్దేశించిన గడువులోగా వచ్చి పాత ఓటును పరిశీలించుకుని ఓటు పునరుద్ధరణ చేసుకునే అవకాశం ఇవ్వాలని సూచించింది. డూప్లికేట్‌ ఓటర్ల పేరు తొలగించినందున వారికీ ఇదే అవకాశం కల్పించవచ్చు. అదే సమయంలో, అడ్రసుమారిన ఓటర్లు కొత్త అడ్రసుతో సమర్పించే ఫారం 8లను మూలనపెట్టకుండా వారి అడ్రసు మార్పును అంగీకరించి ‘సర్‌’ ప్రక్రియను వర్తింపజేయవచ్చు. నోటీసు ఇచ్చి విచారణ జరపకుండా ఏ ఓటరునూ జాబితానుంచి తొలగించకూడదనే నిర్దేశనను ఎన్నికల కమిషన్‌ ఉల్లంఘించినందున, ఆ నేరాన్ని సరిదిద్దుకునే అవకాశాన్ని పై ప్రొసీజరల్‌ మార్పులు ఇస్తున్నాయి.

అయితే ‘సర్‌’ ప్రక్రియ ద్వారా పాలక బిజెపిని సర్వసాధారణంగా వ్యతిరేకించే దళితులు, మైనారిటీలు, బలహీనతరగతుల ఓట్లను ఇసి ఉద్దేశపూర్వకంగా తొలగించిందనేది ఇసిపై ప్రధాన ఆరోపణ. బిజెపి అధికారాన్ని శాశ్వతం చేసే వ్యూహాన్ని సిఇసి జ్ఞానేశ్‌కుమార్‌ అమలు జరుపుతున్నారని, అతన్ని తొలగించాలనేది ఇండియా కూటమి డిమాండ్‌. హర్యానా, మహారాష్ట్ర, కర్నాటకల్లో బిజెపికి అనుకూలంగా కొన్ని నియోజకవర్గాల్లో ఓటర్ల జాబితాల్లో గుండుగుత్తగా చేర్పులు, తొలగింపులను గణాంకాలతో ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధి బహిరంగపరిచినప్పటికీ సిఇసి చర్చలు తీసుకోకపోగా ఎదురుదాడి చేయటం ఇండియా కూటమి ఆందోళనకు ప్రాతిపదిక. సిఇసి బిజెపి పక్షపాతానికి ఒక్క ఉదాహరణ చాలుః పశ్చిమ బెంగాల్‌లో ఇసి తొలగించిన 90లక్షల ఓటర్ల విజ్ఞప్తుల పరిశీలనకు సుప్రీంకోర్టు హైకోర్టు ద్వారా నియమించిన న్యాయాధికారుల ట్రిబ్యునల్స్‌ దాదాపు 30లక్షల పేర్లను సరైనవిగా నిర్ణయించి ఓటరు జాబితాలో చేర్చాలని నిర్ణయిస్తే, వాటిపై ఇసి అధికారులు అప్పీలు దాఖలు చేశారన్న వార్త దిగ్భ్రాంతికరం.

ఆ అధికారం ఎవరికుందీ, ఎవరు ఆ ఉత్తర్వు ఇచ్చారు, ఎవరు అమలు జరిపారన్న దానిపై స్పష్టత లేదు. బంగ్లాదేశ్‌ నుంచి పశ్చిమ బెంగాల్‌, అసోంలలోకి చొరబడిన వలసదారులు 3 కోట్లమందికి ఓటు ఇవ్వాలా, మయన్మార్‌నుంచి చొరబడిన రొహింగ్యాలకు ఓటు ఇవ్వాలా అని హోంమంత్రి అమిత్‌ షా, ఇతర బిజెపి నాయకులు దేశవ్యాప్తంగా ‘మహాపాదయాత్ర’ సభల్లో ప్రశ్నిస్తున్నారంటే, తూర్పు రాష్ట్రాల్లో ప్రధానంగా ముస్లింలే లక్ష్యంగా సర్‌ అమలు జరిగిందని భావించవచ్చు. చొరబాటుదారుల తరఫున ఎవరూ వకాల్తా తీసుకోరు. అయితే ‘సర్‌’ ప్రక్రియలో ఎంతమంది విదేశీయులను ఇసి గుర్తించిందో వెల్లడించాలని కోరితే ఉలకరు, పలకరు. ప్రతిపక్ష ఆందోళనతో ఒక మూలకు నెట్టబడిన బిజెపి దానిపై బురద చల్లటానికి చొరబాటుదారుల ఆరోపణ చేస్తున్నారు. చొరబాటుదారులను అంతర్జాతీయ చట్టాల ప్రకారం గుర్తించటం, వెనక్కు పంపటం, కేంద్ర ప్రభుత్వ బాధ్యత. ఆ పేరుతో ఈ దేశీయులైన ముస్లింల ఓటుహక్కు కూడా హరించటం రాజ్యాంగ విరుద్ధం. ప్రభుత్వ పథకాల మేలు పొందటానికి ఆధారంగా ఉన్న ‘ఆధార్‌’ను తొలగించి, దాని స్థానంలో ఓటరు గుర్తింపు కార్డు ప్రవేశపెట్టాలనే మోదీ ప్రభుత్వ ప్రయత్నం పేదల కడుపుమీద కొట్టే అమానుషమైన ఆలోచన. సుప్రీంకోర్టులో విచారణ కొనసాగేకొలది ఎన్నికల కమిషన్‌ ఇంకెన్ని మెలికలు తిరుగుతుందో చూదాం! బిజెపి ఎంతగా కొమ్ముగాసినా జ్ఞానేశ్‌కుమార్‌ నేతృత్వంలోని భారత్‌ ఎన్నికల కమిషన్‌ కోల్పోయిన విశ్వసనీయతను పునరుద్ధరించజాలదు!! కాబట్టి ఆయన్ను తొలగించటమే తనను తాను రక్షించుకునే మార్గం.

ట్యాగ్‌లు: editorial