Skip to content
లైఫ్ స్టైల్ › వార్తలు

దీపావళి వెలుగులు… కాలుష్యపు నీడలు..

Prajapaksham 08 Nov 2026 1 నిమిషాల పఠనం లైఫ్ స్టైల్
దీపావళి వెలుగులు… కాలుష్యపు నీడలు..

Diwali Celebrations

రచయిత: గిలకత్తుల వెంకటరమణ గౌడ్‌

పండుగలు మానవ నాగరికతకు, సంస్కృతి, సంప్రదాయం, సామాజిక ఐక్యత, మానవ సంబంధాలకు ప్రతీకలు. దీపావళి అంటే చీకటిపై వెలుగు, చెడుపై మంచి సాధించిన విజయానికి సంకే తం. అయితే ఆధునిక కాలంలో పండుగ సంబరాల్లో అంతర్భాగంగా మారిన బాణసంచా వినియోగం పర్యావరణానికి, ప్రజారోగ్యానికి, మానవ భద్రతకు తీవ్రమైన సవాలుగా పరిణమిస్తోంది. కొన్ని క్షణాలపాటు ఆనందాన్ని పంచే బాణసంచా, అనంతరం రోజుల తరబడి కాలుష్యాన్ని, అనారోగ్యాన్ని, ప్రమాదాలను మిగల్చడం ఆందోళనకరం. దీపావళిని కేవలం వేడుకగా కాకుండా పర్యావరణ బాధ్యతతో కూడిన సామాజిక ఉద్యమంగా చూడాల్సిన అవసరం ఉంది.

బాణసంచా తయారీలో పొటాషియం నైట్రేట్‌, గంధకం, బొగ్గు, క్లోరేట్లు, పెర్క్లోరేట్లు వంటి రసాయనాలను ఉపయోగిస్తారు. రంగురంగుల వెలుగుల కోసం బేరియం, స్ట్రాన్షియం, రాగి, సోడియం, అల్యూమినియం, మెగ్నీషియం వంటి లోహ సమ్మేళనాలను వినియోగిస్తారు. వీటి దహనం వల్ల PM2.5, PM10 సూక్ష్మ ధూళికణాలతోపాటు సల్ఫర్‌ డయాక్సైడ్‌ నైట్రోజన్‌ ఆక్సైడ్లు, కార్బన్‌ మోనాక్సైడ్‌ వంటి కాలుష్య కారకాలు వాతావరణంలోకి విడుదలవుతా యి. PM2.5 కణాలు ఊపిరితిత్తుల లోతైన భాగాల్లోకి ప్రవేశించి రక్తప్రసరణ వ్యవస్థపై కూడా ప్రభావం చూపగలవు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, గర్భిణు లు, ఆస్తమా, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడేవారు అధిక ప్రమాదాన్ని ఎదుర్కొంటారు. కళ్ల మంట, దగ్గు, గొంతు ఇబ్బంది, శ్వాస తీసుకోవడం లో సమస్యలు తక్షణ ప్రభావాలు కాగా, దీర్ఘకాలంలో గుండె, శ్వాసకోశ వ్యాధుల ప్రమాదం పెరగవచ్చు. దీపావళి సమయంలో బాణసంచా కాల్చడం వల్ల గాలిలో సూక్ష్మ ధూళికణాల సాంద్రత గణనీయంగా పెరుగుతుంది. అంతేకాకుండా బాణసంచా అవశేషా లు నేల, నీటిని కలుషితం చేస్తాయి.

ప్రమాదాలు మానవీయ ప్రభావం
బాణసంచా ప్రమాదంలో కుటుంబానికి జీవనాధారమైన వ్యక్తి గాయపడితే, అతని శారీరక బాధతోపాటు కుటుంబ ఆదాయం నిలిచిపోవడం, పిల్లల చదువు దెబ్బతినడం, వైద్య ఖర్చులు పెరగడం వంటి సమస్యలు తలెత్తుతాయి. అందువల్ల ప్రమాదం వ్యక్తిగత గాయంతో ముగియకుండా కుటుంబ ఆర్థిక, సామాజిక భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది. బాణసంచాను ఇళ్లలో, వంటగదుల సమీపంలో, ఇంధన నిల్వల వద్ద ఉంచకూడదు. బహిరంగ ప్రదేశాల్లో పెద్దల పర్యవేక్షణలో, తగిన దూరం పాటిస్తూ వినియోగించాలి. పేలని టపాసులను తిరిగి వెలిగించకూడదు. కాలిన గాయాలపై ఐస్‌, నూనె, టూత్‌పేస్ట్‌ రాయకుండా ప్రవహించే సాధారణ ఉష్ణోగ్రత నీటితో సుమారు 20 నిమిషాలు చల్లబరిచి వైద్య సహాయం పొందాలి. కంటి గాయాలైతే వెంటనే ఆసుపత్రికి వెళ్లాలి.

భారతదేశంలో తమిళనాడులోని శివకాశి బాణసంచా పరిశ్రమకు ప్రసిద్ధి చెందిన కేంద్రం. ఈ పరిశ్రమ తయారీ కార్మికులు, రవాణా, ప్యాకేజింగ్‌, ముద్రణ, రసాయనాల సరఫరా, హోల్‌సేల్‌, రిటైల్‌ వ్యాపారాల కు ఉపాధి కల్పిస్తోంది. పరిశ్రమ సృష్టించే ఆదాయంతోపాటు కాలుష్యం వల్ల పెరిగే వైద్య ఖర్చులు, కోల్పోయే పని దినాలు, ప్రమాద బాధితుల పునరావాస వ్యయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. దీనికి ‘కాలుష్యకారుడే ఖర్చు భరించాలి’ (Polluter Pays Principle) అనే సూత్రాన్ని సమర్థంగా అమలు చేయాలి. భద్రతా ప్రమాణాలు, కాలుష్య నియంత్రణ నిబంధనలు ఉల్లంఘించే సంస్థలు పూర్తి బాధ్యత వహించాలి. CSIR, NEERI పరిశోధనలతో అభివృద్ధి చేసిన గ్రీన్‌ క్రాకర్స్‌, సంప్రదాయ బాణసంచాతో పోలిస్తే కొన్ని కాలుష్య ఉద్గారాలను తగ్గించేలా రూపొందించబడ్డాయి. అయితే ఇవి పూర్తిగా కాలుష్యరహితమైనవి కావు. ధృవీకరించిన ఉత్పత్తులనే కొనుగోలు చేయడంతోపాటు బాణసంచా వినియోగాన్ని సాధ్యమైనంతవరకు తగ్గించాలి.

గ్రీన్‌ దీపావళి సమిష్టి బాధ్యత
గ్రీన్‌ దీపావళి అంటే మట్టి ప్రమిదలు వెలిగించ డం, విద్యుత్‌ను పొదుపుగా వినియోగించడం, ప్లాస్టిక్‌ రహిత అలంకరణలు, మొక్కలు నాటడం, శబ్ద కాలుష్యాన్ని తగ్గించడం, పేదలకు సహాయం చేయడం కూడా ఇందులో భాగమే. కుటుంబాలు, అపార్ట్‌మెం ట్‌ సంఘాలు కలిసి పర్యావరణ అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, ఆదా చేసిన మొత్తంతో పేద విద్యార్థులకు పుస్తకాలు అందించడం, సామాజిక సేవా కార్యక్రమాలకు సహకరించడం ద్వారా పండుగకు మరింత అర్థాన్ని తీసుకురావచ్చు. పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వాలు, పరిశ్రమలు, విద్యాసంస్థ లు, వైద్య రంగం, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు సమన్వయంతో పనిచేయాలి. బాణసంచా తయారీ, నిల్వ, రవాణా, విక్రయ కేంద్రాల్లో అగ్నిమాపక పరికరాలు, అత్యవసర నిష్క్రమణ మార్గాలు, శిక్షణ పొందిన సిబ్బంది తప్పనిసరిగా ఉండాలి. ఆసుపత్రు లు, పాఠశాలలు, వృద్ధాశ్రమాల పరిసరాల్లో తగిన పరిమితు లు అమలు చేయాలి. స్వచ్ఛంద సంస్థలు స్థానిక భాషల్లో పోస్టర్లు, సామాజిక మాధ్యమ ప్రచారాలు, పాఠశాల పోటీలు నిర్వహించి ప్రజల్లో అవగాహన పెంచవచ్చు. ప్రథమ చికిత్స, అగ్నిమాపక భద్రతపై శిక్షణ ఇవ్వడంతోపాటు ప్రమాద బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం, విద్యా సహకారం, ఉపాధి పునరావాసం అందించాలి. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 21 జీవించే హక్కును, ఆర్టికల్‌ 48A పర్యావరణ పరిరక్షణలో ప్రభుత్వ బాధ్యతను, ఆర్టికల్‌ 51A(g) ప్రకృతి పరిరక్షణలో పౌరుల విధిని స్పష్టం చేస్తున్నాయి. దీపావళి వెలుగులు మన ఇళ్లను మాత్రమే కాకుండా మన ఆలోచనలను కూడా ప్రకాశింపజేయాలి. సంప్రదాయాన్ని గౌరవిస్తూనే శాస్త్రీ య దృక్పథాన్ని, పర్యావరణ బాధ్యతను, మానవ భద్రతను ఆచరణలో పెట్టాలి. కొన్ని క్షణాల సంబరాల కోసం ఒక కుటుంబం తన ఆత్మీయుడిని కోల్పోకూడదు. మన భావితరాలకు అందించాల్సింది కాలుష్యపు మబ్బులు కాదు, స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యకరమైన జీవితం, సురక్షితమైన సమాజం, పచ్చని ప్రకృతి. అదే నిజమైన దీపావళి. అదే బాధ్యతాయుతమైన నాగరికతకు నిదర్శనం.

ట్యాగ్‌లు: editorial