Skip to content
జాతీయం › వార్తలు

FARA Filing Records: మోదీని పొగిడేందుకు ట్రంప్‌కు డబ్బులిచ్చారా ? అమెరికా ఫైలింగ్స్‌తో మొదలైన రాజకీయ రగడ

Krishna Rao 08 Nov 2026 1 నిమిషాల పఠనం జాతీయం
FARA Filing Records: మోదీని పొగిడేందుకు ట్రంప్‌కు డబ్బులిచ్చారా ? అమెరికా ఫైలింగ్స్‌తో మొదలైన రాజకీయ రగడ

trump modi

FARA Filing Records: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ప్రధాని నరేంద్ర మోదీని ఆకాశానికెత్తేలా మాట్లాడటం వెనుక ఏదైనా డీల్ ఉందా? ట్రంప్‌తో మోదీని పొగిడించడానికి భారత ప్రభుత్వం అమెరికాలోని సంస్థలకు కోట్ల రూపాయలు చెల్లించిందా? ఇప్పుడు ఇదే అంశం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

అమెరికాలో నమోదైన లాబీయింగ్ సంస్థల అధికారిక పత్రాలను ప్రస్తావిస్తూ కాంగ్రెస్ పార్టీ మోదీ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేసింది. ట్రంప్‌తో మోదీని పొగిడించేందుకు భారత ప్రజల సొమ్మును ఖర్చు చేశారని విమర్శించింది. అమెరికా అధ్యక్షుడి నుంచి మోదీకి మంచి పేరు వచ్చేలా ప్రచారం చేయించడానికి పన్ను చెల్లింపుదారుల డబ్బును ఉపయోగించారని ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలను కేంద్ర విదేశాంగ శాఖ ఖండించింది. మరి అమెరికా పత్రాల్లో అసలేం ఉంది? కాంగ్రెస్ చేసిన ఆరోపణలకు కారణమేంటి? ఈ వ్యవహారం వెనుక ఉన్న వివరాలేంటో చూద్దాం.

ట్రంప్‌తో మోదీని పొగిడించేందుకు డబ్బులు ఖర్చు చేశారా?

నవంబర్ 8న కాంగ్రెస్ పార్టీ తన అధికారిక ఎక్స్ ఖాతాలో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసింది. ప్రధాని నరేంద్ర మోదీని పొగుడుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన సోషల్ మీడియా పోస్టు వెనుక భారత ప్రభుత్వం డబ్బులు ఖర్చు చేసిందని ఆరోపించింది.

దేశంలో నిరుద్యోగం, ధరల పెరుగుదల, ఇతర కీలక సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం.. ప్రజల సొమ్మును విదేశాల్లో రాజకీయ ప్రచారం కోసం ఖర్చు చేస్తోందని కాంగ్రెస్ విమర్శించింది. అమెరికన్ లాబీయింగ్ సంస్థలకు భారత ప్రభుత్వం చెల్లిస్తున్న భారీ మొత్తాలపై కూడా ప్రశ్నలు లేవనెత్తింది.

ఈ ఆరోపణలకు ఆధారంగా అమెరికా ఫారిన్ ఏజెంట్స్ రిజిస్ట్రేషన్ యాక్ట్ (FARA) కింద నమోదైన పత్రాలను కాంగ్రెస్ ప్రస్తావించింది. విదేశీ ప్రభుత్వాల తరఫున పనిచేసే సంస్థలు తమ కార్యకలాపాలు, క్లయింట్లు, ఆర్థిక లావాదేవీల వివరాలను అమెరికా ప్రభుత్వానికి వెల్లడించాల్సి ఉంటుంది. ఈ పత్రాల్లోని వివరాలే ఇప్పుడు రాజకీయ వివాదానికి కారణమయ్యాయి.

మెర్క్యురీ పబ్లిక్ అఫైర్స్‌కు నెలకు రూ.70 లక్షలకు పైగా చెల్లింపులు

ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రకారం.. వాషింగ్టన్‌లోని భారత రాయబార కార్యాలయం మెర్క్యురీ పబ్లిక్ అఫైర్స్ అనే అమెరికన్ లాబీయింగ్ సంస్థతో ఒప్పందం చేసుకుంది. ఈ సంస్థకు నెలకు 75 వేల డాలర్లు చెల్లిస్తోంది. భారత కరెన్సీలో ఈ మొత్తం సుమారు రూ.70.6 లక్షలు.

అసలు లాబీయింగ్ అంటే ఏంటి?: అమెరికాలోని కీలక రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులతో సంబంధాలు పెంచుకోవడం, ఒక దేశానికి సంబంధించిన అంశాలను వారి దృష్టికి తీసుకెళ్లడం, ఆ దేశ ప్రయోజనాలకు మద్దతు కూడగట్టడం వంటి పనులను లాబీయింగ్ సంస్థలు చేస్తుంటాయి.

మెర్క్యురీ పబ్లిక్ అఫైర్స్ కూడా భారత రాయబార కార్యాలయం తరఫున ఇలాంటి పనులు చేస్తోంది. ఇందులో భాగంగా భారత్‌కు అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసినందుకు నరేంద్ర మోదీని అభినందిస్తూ ట్రంప్ గత జూన్‌లో ఎక్స్‌లో పెట్టిన పోస్టును తన ప్రచార కార్యక్రమాల్లో భాగంగా వ్యాప్తి చేసినట్లు సంస్థ అమెరికా ప్రభుత్వానికి సమర్పించిన పత్రాల్లో పేర్కొంది.

అయితే ఇక్కడ ఒక కీలకమైన విషయం ఉంది. ట్రంప్ ఆ పోస్టు పెట్టేలా మెర్క్యురీ సంస్థ ఒప్పందం చేసుకుందని గానీ, ఆ పోస్టు పెట్టినందుకు ట్రంప్‌కు డబ్బులు చెల్లించిందని గానీ అమెరికా పత్రాల్లో లేదు. ట్రంప్ ఇప్పటికే పెట్టిన పోస్టును తమ ప్రచారంలో భాగంగా ఇతరులకు చేరవేసినట్లు మాత్రమే సంస్థ పేర్కొంది.

కాంగ్రెస్ ఆరోపణలను ఖండించిన కేంద్రం

కాంగ్రెస్ చేసిన ఆరోపణలను కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ తోసిపుచ్చింది. నవంబర్ 7న తన అధికారిక ఫ్యాక్ట్ చెక్ ఎక్స్ ఖాతాలో ఈ వ్యవహారంపై వివరణ ఇచ్చింది.

మెర్క్యురీ పబ్లిక్ అఫైర్స్ అమెరికా ప్రభుత్వానికి సమర్పించిన పత్రాలను పరిశీలిస్తే, ట్రంప్ ఎక్స్ పోస్టును వ్యాప్తి చేసినట్లు మాత్రమే ఉందని స్పష్టం చేసింది. ఆ పోస్టు పెట్టడానికి ట్రంప్‌కు డబ్బులు చెల్లించినట్లు ఎక్కడా పేర్కొనలేదని తెలిపింది.

అమెరికాలో విదేశీ ప్రభుత్వాలు లాబీయింగ్ సంస్థలను నియమించుకోవడం సాధారణ విషయమేనని కేంద్రం పేర్కొంది. వాషింగ్టన్‌లోని భారత రాయబార కార్యాలయం 1948 నుంచే ఇలాంటి సంస్థల సేవలను ఉపయోగించుకుంటోందని గుర్తుచేసింది.

మరో సంస్థకు నెలకు రూ.1.40 కోట్లు

మెర్క్యురీ పబ్లిక్ అఫైర్స్‌తో పాటు ట్రంప్‌కు సన్నిహితుడైన జాసన్ మిల్లర్ నేతృత్వంలోని SHW పార్ట్‌నర్స్ LLC సంస్థతో కూడా భారత రాయబార కార్యాలయం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సంస్థకు నెలకు 1.50 లక్షల డాలర్లు చెల్లించేలా ఒప్పందం చేసుకుంది. భారత కరెన్సీలో ఈ మొత్తం సుమారు రూ.1.40 కోట్లు.

ఈ సంస్థ అమెరికా ప్రభుత్వానికి సమర్పించిన FARA పత్రాల్లో మరో కీలక విషయం వెల్లడించింది. భారత్, అమెరికా మధ్య సంబంధాలపై చర్చించేందుకు 2025 మే, జూన్ నెలల్లో భారత ప్రభుత్వ ప్రతినిధులు, ట్రంప్ ప్రభుత్వంలోని ఉన్నతాధికారుల మధ్య మొత్తం ఎనిమిది ఫోన్ సంభాషణలను ఏర్పాటు చేసినట్లు పేర్కొంది.

ఈ సంభాషణల్లో అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెస్సెంట్, డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ మైఖేల్ నీధమ్, అమెరికా వాణిజ్య ప్రతినిధి జామీసన్ గ్రీర్, వైట్ హౌస్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ స్టీవెన్ చెంగ్ పాల్గొన్నట్లు పత్రాల్లో వెల్లడించింది.

అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో భారత్‌లో పర్యటించిన సమయంలో ఈ సంప్రదింపులు జరిగాయి. అయితే ఈ ఫోన్ సంభాషణల్లో ఏ అంశాలపై చర్చించారు? వాటి ద్వారా ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? అనే వివరాలను మాత్రం సంస్థ వెల్లడించలేదు.

జాసన్ మిల్లర్ సంస్థతో ఒప్పందం రద్దు

SHW పార్ట్‌నర్స్‌తో భారత రాయబార కార్యాలయం 2025 ఏప్రిల్‌లో తొలిసారి ఒప్పందం కుదుర్చుకుంది. 2026 ఏప్రిల్‌లో మరో ఏడాది పాటు దాన్ని పొడిగించింది. అయితే జాసన్ మిల్లర్ ట్రంప్ ప్రభుత్వంలో ప్రత్యేక ప్రభుత్వ ఉద్యోగిగా చేరిన తర్వాత, జూన్ 23న ఈ ఒప్పందాన్ని రద్దు చేశారు.

మరోవైపు మెర్క్యురీ పబ్లిక్ అఫైర్స్‌లో ట్రంప్ రాజకీయ వర్గానికి చెందిన పలువురు కీలక వ్యక్తులు పనిచేశారు. ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టడానికి ముందు ఆయన పరివర్తన బృందంలో కమ్యూనికేషన్స్ డైరెక్టర్‌గా పనిచేసిన బ్రయాన్ లాంజా ఈ సంస్థలో కీలక సభ్యుడిగా ఉన్నారు.

అలాగే ట్రంప్ ప్రభుత్వంలో వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా బాధ్యతలు చేపట్టిన సూసీ వైల్స్ కూడా 2024 చివరి వరకు ఈ సంస్థలో రిజిస్టర్డ్ లాబీయిస్ట్‌గా పనిచేశారు.

నెలకు రూ.2 కోట్లకు పైగా ఖర్చు.. కాంగ్రెస్ ప్రశ్న ఇదే

ఈ రెండు సంస్థలతో ఒప్పందాలు అమల్లో ఉన్న సమయంలో భారత రాయబార కార్యాలయం వాటికి నెలకు మొత్తం 2.25 లక్షల డాలర్లు చెల్లించేది. భారత కరెన్సీలో ఈ మొత్తం సుమారు రూ.2.11 కోట్లు.

అమెరికాలో భారత ప్రయోజనాలను వివరించడం, కీలక అధికారులతో సంబంధాలు పెంచుకోవడం, దౌత్యపరమైన అంశాల్లో మద్దతు కూడగట్టడం వంటి పనుల కోసం ప్రభుత్వాలు లాబీయింగ్ సంస్థల సేవలను ఉపయోగించుకుంటుంటాయి. అయితే ఈ వ్యవహారంలో కాంగ్రెస్ లేవనెత్తిన ప్రశ్న మాత్రం వేరుగా ఉంది.

భారత ప్రభుత్వం అమెరికాలో లాబీయింగ్ కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నప్పుడు, ఆ డబ్బుతో జరుగుతున్న ప్రచార కార్యక్రమాలు ఏమిటి? ట్రంప్ మోదీని పొగుడుతూ చేసిన పోస్టును కూడా ఈ ప్రచారంలో భాగంగా ఎందుకు వ్యాప్తి చేశారు? ప్రజల సొమ్మును ఇలాంటి కార్యక్రమాలకు ఖర్చు చేయడం ఎంతవరకు సమంజసం? అని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది.

మరోవైపు ట్రంప్ ఆ పోస్టు పెట్టేందుకు భారత ప్రభుత్వం డబ్బులు చెల్లించిందనే ఆరోపణకు ఇప్పటివరకు బయటపడిన FARA పత్రాల్లో ప్రత్యక్ష ఆధారాలు లేవు. మెర్క్యురీ సంస్థ ట్రంప్ పోస్టును వ్యాప్తి చేసినట్లు మాత్రమే వెల్లడించింది. అయినప్పటికీ అమెరికాలో భారత ప్రభుత్వం లాబీయింగ్ కోసం నెలకు రూ.2 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్న విషయం ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశమైంది.

ట్యాగ్‌లు: Congress