Skip to content
జాతీయం › వార్తలు

20వ శతాబ్దాన్ని మార్చిన అక్టోబర్‌ విప్లవం

Prajapaksham 07 Nov 2026 0 నిమిషాల పఠనం జాతీయం
20వ శతాబ్దాన్ని మార్చిన అక్టోబర్‌ విప్లవం

Protest

కృష్ణ ఝా

అక్టోబర్‌ విప్లవం (1917)తో ప్రపంచంలో తొలి సోషలిస్టు రాజ్యం ఆవిర్భవించింది. అది 20వ శతాబ్దం ప్రపంచ రాజకీయా లు, ఆర్థిక వ్యవహారాలు, చరిత్రను ప్రాథమికంగా మార్పు చేసింది. అది ఒక స్వప్న రాజ్యం. ఎన్ని బాధలు, ఎంత రక్తపాతం సంభవించినా అదొ క శిఖరాగ్రంగా నిలిచింది. దానికోసం ప్రజారాసులతోపాటు కమ్యూనిస్టులు ప్రాణత్యాగాలు చేశారు. సంక్షోభం నెలకొని ఉన్నప్పటికీ వారి పురోగమనాన్ని ఏదీ నిరోధించలేకపోయింది. ప్రపంచానికి సంబంధించి అదొక అద్భుతం ఎందుకంటే ఆ రాజ్యంలో ప్రతి ఒక్కటీ ప్రజలకే చెందుతుంది. మిగతా ప్రపంచాన్ని పెట్టుబడిదారీ విధానం పరిపాలిస్తోంది. సామ్రాజ్యవాదం అప్పటికింకా ఆధిపత్యశక్తి గా తయారు కాలేదు. సోషలిజం దాన్ని సవాలు చేస్తోంది. అది వేగవంతంగా రూపుదిద్దుకున్న నూతన సామాజిక ఆర్థిక వ్యవస్థ. కార్మిక వర్గానికి పాలనాధికారం. వారు తమ సొంత రాజ్యం సృష్టించుకున్నారు, సామ్రాజ్యవాదం మసకబారుతుండగా వారు బలం పుంజుకున్నారు. పాత దోపిడీ వర్గాలు తమను సజీవంగా ఉంచినటువంటి యావత్‌ ప్రయోజనం కోల్పోయాయి. రెండు సంఘర్షిత వర్గాల మధ్య శతృత్వాన్ని అంతం చేయటం సాధ్యమేనని వారు గుర్తించేటటువంటి నిర్ణయాత్మక క్షణంవైపు వారిని కొత్తమార్గం నడిపించింది. యూనియన్‌ ఆఫ్‌ సోవియట్‌ సోషలిస్టు రిపబ్లిక్‌ (యుఎస్‌ఎస్‌ఆర్‌) నాయకత్వంలో నూతన సమాజ నిర్మాణం కోసం పోరాటం జరిగింది. దోపిడీకి గురవుతున్న ప్రజారాసులన్నీ కార్మికవర్గంతోపాటు అందులో పాల్గొన్నాయి.
మహత్తర అక్టోబర్‌ విప్లవం ప్రధాన లక్షణం ఏమంటే, ‘ద్వంద్వ అధికారం’లోని పరస్పర అధికారాలను విడదీయటం ద్వారానే అది పురోగమించగలదు. 1917 ఫిబ్రవరి విప్లవం విజయవంతమైన తర్వాత ఆ ప్రారంభంనుంచే ద్వంద్వ అధికారం అస్థిత్వంలోకి వచ్చింది. ద్వంద్వ అధికారం అంటే ఒకే రాజ్యంలో రెండు ప్రభుత్వాలు పనిచేయటం. అధికారం లాంఛనంగా బూర్జువావర్గ తాత్కాలిక ప్రభుత్వం చేతిలో ఉన్నప్పటికీ నిజమైన అధికారం కార్మిక, కర్షక అధికారం కార్మిక సోవియట్‌లలో ఉంది. తాత్కాలిక ప్రభు త్వం చేతిలో పోలీసు, సైన్యం దాదాపుగా లేదు. అందువల్ల అది సోవియట్‌లపై బలప్రయోగానికి పాల్పడలేదు. సోవియట్‌లు భ్రమలతో బూర్జువావర్గానికి అధికారాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నాయి. ప్రజారాసుల్లో మెజారిటీ తోడ్పాటు స్పష్టంగా, నిర్వివాదంగా
సోవియట్‌లకే ఉంది.
అందువల్ల, మహా వ్యూహకర్త వ్లదీమిర్‌ లెనిన్‌, ప్రజారాసులను భ్రమలనుంచి విముక్తి చేసేటటువంటి, శాంతియుత మార్గాల ద్వారా విప్లవం సాధించే ఎత్తుగడలు అమలు చేశారు. తద్వారా ద్వంద్వ అధికారాన్ని అంతం చేశారు. ద్వంద్వ అధికారాన్ని చరిత్రలో అద్భుతమైన చర్యగా లెనిన్‌ అభివర్ణించారు. అది రెండు నియంతృత్వాలను అనగా బూర్జువావర్గ నియంతృత్వం, కార్మిక నియంతృత్వాలను ముడివేసింది. అది ఎక్కువకాలం సాగదు. వాటిలో ఒకటి తప్పుకోవలసిందే. కొద్దినెలల తర్వాత, 1917 అక్టోబర్‌ (నవంబర్‌ 7) విప్లవంలో జరిగింది అదే. ఆ విప్లవంలో యావత్‌ అధికారాన్ని సోవియట్‌లు స్వాధీనం చేసుకున్నాయి. లెనిన్‌, బోల్షివిక్‌లు ‘సర్వాధికారం సోవియట్‌లదే’ అని నినాదమిచ్చారు.
రష్యన్‌ విప్లవ ముఖ్య నినాదాలు మూడు ః శాంతి, రొట్టె, భూమి. రష్యన్‌ విప్లవం మొదటి ప్రపంచ యుద్ధం (డబ్లుడబ్ల్యు1) నుంచి, సామ్రాజ్యవాద సార్వత్రిక సంక్షోభంనుంచీ పురుడు పోసుకుంది. రష్యన్‌ ప్రజలకు, యావత్‌ ప్రపంచానికీ శాంతి స్థాపన అత్యంత ముఖ్యావసరం అయినందున డబ్ల్యుడబ్ల్యు1 నుంచి రష్యా ఉపసంహరించుకుంది. శాంతి సాధన ప్రాతిపదికపై తినడానికి రొట్టె, వ్యవసాయానికి భూమి కూడా ముఖ్యం. అందువల్ల ఈ లక్ష్యాలు యావత్‌ ప్రజారాసులకు (శ్రమజీవులు) సంబంధించినవి. కాబట్టి అవి ప్రజాస్వామిక స్వభావం కలిగినవి. పెట్టుబడిదారీ విధానం, సామ్రాజ్యవాదం తమ ఆధిపత్య గుత్తాధికారాన్ని కోల్పోయాయి. కొత్త రాజ్యం ముఖాముఖీ తలపడవలసి వచ్చింది. ఈ కొత్త అధికారం 20కోట్లమంది నవసమాజ ఉచిత నిర్మాతలనుంచి, ఏ ప్రతిఫలం ఆమోదించని కోట్లాదిమంది శ్రమజీవుల చైతన్యంనుంచి వృద్ధి చెందింది, బలం పుంజుకుంది.
శ్రమజీవుల జీవితాల్లో, శాంతికి మిత్రులైన నిజాయితీపరులైన మిత్రులందరి జీవితాల్లో అదొక నిర్ణయాత్మక క్షణం. అది వారి రాజకీయ, సైద్ధాంతిక, నైతిక దృక్పథాలను నిర్ణయించుకోవలసిన సమయం. కొత్తవర్గం పాత దోపిడీ వర్గాల స్థానంలో అధికారంలోకి రాగలుగుతుందనీ చివరకు రుజువైంది. సామ్రాజ్యవాద గొలుసును విచ్ఛిన్నం చేయవచ్చని చివరకు రుజువైంది. మానవాళికి ఒక కొత్త బాట ఉందనీ, కార్మికవర్గం తన కర్తవ్యాలపట్ల చైతన్యయుతమైతే అది విజయానికి దారితీస్తుందని చివరకు రుజువైంది. మన వర్గ శత్రువులైన పెట్టుబడిదారీ విధానం, సామ్రాజ్యవాదులకు సంబంధించి, అక్టోబర్‌ విప్లవం వారి మరణగంటగా ధ్వనించింది. అందువల్లనే, 1917 అక్టోబర్‌ అనంతర వెనువెంట సంవత్స రాల్లో పాత బూర్జువావర్గ వ్యవస్థకు, సామ్రాజ్యవాదానికీ వ్యతిరేకంగా ఆగ్రహపూరితమైన బ్రహ్మాండమైన ఉద్యమం పెల్లుబికింది; అది అన్ని పెట్టుబడిదారీ, వలస పాలనలో మ్రగ్గుతున్న దేశాలను ఆవహించింది. అది కార్మికవర్గ అంతిమ విజయానికి దారితీసి ఉండకపోవచ్చు. అయినా, ఒక కొత్త ఉద్యమానికి ఆరంభ బిందువైంది, వృద్ధి చెందింది, బలం పుంజుకుంది; తన శ్రేణులను పరిశుద్ధం చేసుకుంది, శాంతి, స్వేచ్ఛకోసం ఒక విశాల పోరాట సంఘటనగా అభివృద్ధి చెందింది.
ఆ సంవత్సరాల కాలంలో, అన్ని దేశాల శ్రమజీవుల్లోని ఉత్తములు నిజంగా కొత్త జ్ఞానాన్ని, నిర్ణయాత్మకమైన పరిజ్ఞానాన్ని సంతరించుకున్నారు. అది మరేదోకాదు, బోల్షివిజం అనుభవం, దాన్ని ప్రజలు అవగాహన చేసుకోవటం ఆరంభించారు. బోల్షివిజం చూపుతున్న విజయబాట అనుభవంతో తమ లక్ష్యం అనివార్యంగా విజయం సాధిస్తుంద న్న ఆత్మవిశ్వాసం పెంచుకున్నారు.
1917 అక్టోబర్‌ విప్లవం జాతీయ విముక్తి ఉద్యమాలను రగిలించింది. అవి ఖండఖండాల్లో వలసపాలనను కూలదోశాయి. తొలి సోషలిస్టు విప్లవం విజయంతో సామ్రాజ్యవాదానికి వ్యతిరేకం గా పోరాటం ఉన్నత స్థాయికి చేరింది. ఆసియా, ఆఫ్రికా, లాటిన్‌ అమెరికాల్లో జాతీయ విముక్తి ఉద్యమాలు రష్యన్‌ విప్లవం నుంచి ఉత్తేజం పొందాయి. ఆ జాతీయ విముక్తి ఉద్యమాలకు సోవియట్‌ యూనియన్‌ తోడ్పాటు అందించింది.
అక్టోబరు విప్లవానంతర సంవత్సరాల్లో సామ్రాజ్యవాద దేశాలు విధించిన అష్టదిగ్బంధనాన్ని సోవియట్‌ యూనియన్‌ విజయవంతంగా తిప్పికొట్టింది. అన్ని రంగాల్లో అమెరికాతో సమానమైన అగ్రరాజ్యం గా అభివృద్ధి చెందింది. రెండవ ప్రపంచ యుద్ధంలో అపారమైన త్యాగాలతో హిట్లర్‌ సైన్యాన్ని మట్టికరిపించటంలో పెద్దపాత్రవహించింది. తూర్పు యూరప్‌లో సోషలిస్టు ప్రజాస్వామ్య ప్రభుత్వాలను ఏర్పరిచి వాటి అభివృద్ధికి అండదండలందించింది. వలసపాలన నుంచి జాతీయ స్వాతంత్య్రం సంపాదించుకున్న తృతీయ ప్రపంచదేశాల అభివృద్ధికి శాయశక్తులా సహాయం అందించింది. చివరకు సామ్రాజ్యవాదంతో ఆర్థిక పోటీ లో వెనుకబడటం, నాయకులు తీసుకున్న సోషలిస్టు వ్యతిరేక విధానాల వల్ల, అంతర్గత శక్తుల ద్రోహం వల్ల 1991లో సోవియట్‌ యూనియన్‌ కూలిపోయింది. కమ్యూనిజం అంతరించిందని చంకలుచరుచుకున్న సామ్రాజ్యవాదులు ప్రపంచ దేశాల్లో పచ్చి మితవాద, దోపిడీ విధానాలు ప్రోత్సహించారు. సంక్షోభాల తర్వాత సంక్షోభాల్లో కూరుకుపోతున్నారు. ఇప్పుడు మళ్ళీ ఎదురుదెబ్బలు తింటున్నారు. సోషలిజం నిర్మాణంలో ఒక నమూనా విఫలమైంది. మరో నమూనా చైనాలో నిర్మాణంలో ఉంది. రష్యాలో సోషలిజం నిర్మాణం ధ్వంసమై పెట్టుబడిదారీ విధానం పునరుద్ధరణ జరిగినంత మాత్రాన అది మార్కిజం లెనినిజం వైఫల్యం కాదు. అక్టోబర్‌ విప్లవ వైఫల్యం కాదు. ప్రపంచ వ్యాప్తంగా విప్లవశక్తులు ఒడిదొడుకులు ఎదురవుతున్నా పురోగమిస్తూనే ఉంటాయి. సమాజ పరిణామ క్రమాన్ని ఎవరూ ఆపలేరు. పెట్టుబడిదారీ ప్రపంచం సాగిస్తున్న నయా ఉదారవాద విధానాల దాడికి, ప్రజల బతుకులు దుర్భరం చేస్తున్న పొదుపు చర్యలకు, సామ్రాజ్యవాద అణచివేతకు వ్యతిరేకంగా కార్మికవర్గం, ఇతర శ్రమజీవులు పోరాటాలు చేస్తున్నారు. వారికి 1917 సోషలిస్టు విప్లవం మార్గదర్శన జ్యోతి. విప్లవ, ప్రగతిశీల శక్తులందరికీ అక్టోబర్‌ విప్లవం దిశానిర్దేశం చేసే కాంతిపుంజం. వర్గరహిత, దోపిడీ రహిత సమాజం కోసం కృషి చేస్తున్నవారందరికీ అక్టోబర్‌ విప్లవం సోషలిజానిదే భవిష్యత్‌ అనే సందేశం ఇస్తున్నది.

ట్యాగ్‌లు: national news Protest Today news