Modi vs Rahul Gandhi: మోదీ దేశ ద్రోహి.. నాతో చర్చకు వస్తే నిరూపిస్తా.. రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు.. బీజేపీ నేతలు ఏమన్నారంటే..
Rahul Gandhi
Modi vs Rahul Gandhi: కేంద్రంలోని అధికార ఎన్డీయే (NDA) ప్రభుత్వంపై, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శైలిపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేస్తూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రధాని మోదీని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వెనుక నుండి నియంత్రిస్తున్నారని, మోదీ పూర్తిస్థాయిలో ‘దేశద్రోహి’గా వ్యవహరిస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. పంజాబ్‌లోని సంగ్రూర్‌లో బుధవారం ఘనంగా నిర్వహించిన ‘ఇన్సాఫ్ ర్యాలీ’లో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సచిన్ పైలట్లతో కలిసి పాల్గొన్న రాహుల్ గాంధీ వేదికపై నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై నిప్పులు చెరిగారు.
తమతో బహిరంగ చర్చకు వస్తే ప్రధాని మోదీ దేశద్రోహి అనే విషయాన్ని కేవలం ఐదు నిమిషాల్లోనే ఆధారాలతో సహా నిరూపిస్తానని రాహుల్ గాంధీ సవాల్ విసిరారు. “చర్చకు రావాలని ప్రధానికి సవాల్ విసిరితే పార్లమెంటులో చర్చిద్దామని ఎన్డీయే నేతలు సలహాలు ఇస్తున్నారు. కానీ లోక్‌సభలో తాను మాట్లాడటానికి మైక్ ఆన్ చేస్తే, వెంటనే కట్ చేస్తారన్న విషయం అందరికీ తెలిసిందే” అని రాహుల్ మండిపడ్డారు. దేశంలో మాదకద్రవ్యాల (డ్రగ్స్) నిర్మూలనకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా మూడేళ్ల గడువు నిర్దేశించుకోవడంపై ఎద్దేవా చేస్తూ.. అప్పటివరకు అమిత్ షా అసలు ఆ పదవిలోనే ఉండరని, తమ అంచనాల ప్రకారం ఏడాది వ్యవధిలోనే ఈ ఎన్డీయే ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని కీలక వ్యాఖ్యలు చేశారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఉద్దేశించి మాట్లాడిన రాహుల్.. అదానీ ఓడరేవులో (Port) గతంలో పట్టుబడిన భారీ మాదకద్రవ్యాల నిల్వలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో దేశానికి చెప్పాలని ప్రశ్నించారు. పైకి శాంతిభద్రతల గురించి గొప్పగా మాట్లాడే కేంద్రం, లోపల గ్యాంగ్స్టర్లను ప్రోత్సహిస్తోందన్న విషయం దేశ ప్రజలందరికీ తెలుసన్నారు. అమిత్ షాకు నిజంగా శాంతిభద్రతలపై పట్టింపు ఉంటే, రెండేళ్లుగా మండుతున్న మణిపుర్లో ఏం జరుగుతుందో దేశానికి స్పష్టం చేయాలని నిలదీశారు.
పంజాబ్‌లో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) పాలనపై కూడా రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆప్ అధికారంలోకి వస్తే పంజాబ్‌ను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మారుస్తామని హామీ ఇచ్చారని, కానీ ఏ ఒక్క ప్రాంతంలోనైనా మాదకద్రవ్యాలను నిర్మూలించగలిగారా అని ప్రశ్నించారు. సమస్యను శాశ్వతంగా పరిష్కరించే సామర్థ్యం ఆప్ నాయకులకు లేదన్నారు. గతంలో లోక్‌సభలో భగవంత్ మాన్‌తో కలిసి కూర్చున్న రోజులను గుర్తుచేసుకుంటూ.. మాన్ సభలోనే జోకులు వేసేవారని, ఆయన వద్ద నుంచి మద్యం వాసన వచ్చేదని ఆరోపించారు. డ్రగ్స్‌పై పోరాటం చేయాల్సిన ముఖ్యమంత్రే స్వయంగా మద్యం మత్తులో ఉంటే రాష్ట్రంలో మాదకద్రవ్యాల నిర్మూలన ఎలా సాధ్యమవుతుందని రాహుల్ చురకలంటించారు.