Skip to content
ప్రపంచం › వార్తలు

US Midterm Election Results 2026: కాంగ్రెస్‌లో డెమోక్రాట్ల ఆధిపత్యం.. అన్ని బిల్లులను వీటో చేస్తానంటూ ట్రంప్ వార్నింగ్..

jagan 04 Nov 2026 1 నిమిషాల పఠనం ప్రపంచం
US Midterm Election Results 2026: కాంగ్రెస్‌లో డెమోక్రాట్ల ఆధిపత్యం.. అన్ని బిల్లులను వీటో చేస్తానంటూ ట్రంప్ వార్నింగ్..

Veto

US Midterm Election Results 2026: అమెరికా మధ్యంతర (Midterm) ఎన్నికలలో డెమోక్రాటిక్ పార్టీ చారిత్రక ఘనవిజయం సాధించి కాంగ్రెస్‌లోని ఉభయసభలు అయిన హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ , సెనేట్‌లపై సంపూర్ణ ఆధిక్యాన్ని సొంతం చేసుకుంది. రిపబ్లికన్ పార్టీ ఎదుర్కొన్న ఈ భారీ పరాజయంపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన సొంత సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ‘ట్రుత్ సోషల్’ (Truth Social) వేదికగా స్పందిస్తూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా తన వద్ద ఉన్న అత్యంత శక్తివంతమైన ‘వీటో’ (Veto) అధికారాన్ని ఉపయోగించి ప్రతిపక్ష డెమోక్రాట్ల శాసన ప్రయత్నాలను తిప్పికొడతానని ఆయన సంకేతాలిచ్చారు.

ఫలితాల సరళి స్పష్టమైన వెంటనే ట్రంప్ ‘VETO’ అని ఆంగ్లంలో రాసి ఉన్న ఒక ఎరుపు రంగు క్యాప్ (Red Cap) చిత్రాన్ని ట్రుత్ సోషల్‌లో పోస్ట్ చేశారు. కాంగ్రెస్‌లో డెమోక్రాట్లు ప్రతిపాదించే లేదా ఆమోదించే ‘పిచ్చి బిల్లులను’ (Insane Legislation) తన వద్ద ఉన్న అధ్యక్ష వీటో అధికారంతో నిలిపివేస్తానని ఆయన తేల్చిచెప్పారు. “వీటో అనేది దేశాధ్యక్షుడి వద్ద ఉండే అత్యంత బలమైన అధికారాల్లో ఒకటి. వాళ్లు తప్పుడు బిల్లులు పంపితే నేను వీటో ప్రయోగిస్తాను.. అప్పుడు వాళ్లు తలలు పట్టుకోవాల్సిందేనని హెచ్చరించిన ట్రంప్, తన రాబోయే రెండేళ్ల పదవీకాలంలో విపక్షాల ఎజెండాను అడ్డుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

ఒకవైపు వీటో హెచ్చరికలు జారీ చేస్తూనే, మరోవైపు ఎన్నికల ఫలితాలను తాను సంపూర్ణంగా అంగీకరిస్తున్నట్లు , డెమోక్రాట్లతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ట్రంప్ వ్యాఖ్యానించారు. డెమోక్రాటిక్ పార్టీలోని పలువురు అగ్రనేతలతో తాను ఇప్పటికే మాట్లాడానని, మరికొందరు నేతలు తనతో సంప్రదింపులు జరిపేందుకు ఆసక్తిగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. దీనితో పాటు, ఈ ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపోటములకు గల కారణాలను విశ్లేషిస్తూ తాను ఒక ‘పొలిటికల్ పండిట్’ (Political Pundit) గా మారబోతున్నానని, ప్రతి అభ్యర్థి ఫలితాన్ని లోతుగా పర్యవేక్షిస్తానని మరొక పోస్టులో సంతకం చేశారు.