Skip to content
తెలంగాణ › వార్తలు

Hyderabad: హైదరాబాద్‌ను ‘ట్రాఫిక్ ఫ్రీ, క్లీన్ సిటీ’గా మార్చడమే లక్ష్యం.. మున్సిపల్ శాఖ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి కఠిన ఆదేశాలు

jagan 02 Nov 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
Hyderabad: హైదరాబాద్‌ను ‘ట్రాఫిక్ ఫ్రీ, క్లీన్ సిటీ’గా మార్చడమే లక్ష్యం.. మున్సిపల్ శాఖ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి కఠిన ఆదేశాలు

పర్యాటక రంగ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో కీలక సమావేశం

Hyderabad: భాగ్యనగరాన్ని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అత్యంత పరిశుభ్రమైన , ఎలాంటి ట్రాఫిక్ ఆటంకాలు లేని నగరంగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నగరంలో చెత్త సేకరణ, వ్యర్థాల తరలింపు , రవాణా సమస్యలపై సోమవారం నాడు మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులు, జీహెచ్‌ఎంసీ (GHMC) అధికారులతో ఆయన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. భాగ్యనగరంలో ఎక్కడా చెత్త కుప్పలు కనిపించడానికి వీల్లేదని, ప్రతిరోజూ క్రమం తప్పకుండా ఇంటింటికీ చెత్త సేకరణ (Door-to-door Garbage Collection) జరగాల్సిందేనని తేల్చిచెప్పారు. ఈ విషయంలో ఏమాత్రం అలసత్వం ప్రదర్శించినా సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

హైదరాబాద్ మహానగరంలో నానాటికీ పెరుగుతున్న నిర్మాణ వ్యర్థాల (Construction & Demolition Debris) తరలింపు కోసం ప్రత్యేకమైన సమర్థవంతమైన ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వ్యర్థాల సేకరణ , తరలింపు ప్రక్రియలో ఎలాంటి సాంకేతిక, లాజిస్టికల్ సమస్యలు తలెత్తకుండా తగిన చర్యలు చేపట్టాలన్నారు. దీనికి తోడు పర్యావరణ పరిరక్షణలో భాగంగా గ్రీన్ ట్యాంకర్ల ద్వారా శుద్ధి చేసిన నీటి (Treated Water) సరఫరాను నగరవ్యాప్తంగా విస్తరించాలని సూచించారు. ఇకపై నగరంలో జరిగే అన్ని రకాల నిర్మాణ పనులు, పార్కుల పెంపకం, గ్రీనరీ నిర్వహణ వంటి అవసరాలకు మంచినీటికి బదులుగా కేవలం శుద్ధి చేసిన నీటినే వినియోగించేలా చూడాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. జీహెచ్‌ఎంసీతో పాటు హైదరాబాద్ పరిధిలోని ఇతర మున్సిపాలిటీలు , కార్పొరేషన్ల పరిధుల్లోనూ ఈ గ్రీన్ వాటర్ సరఫరాను గణనీయంగా పెంచాలని అధికారులను కోరారు.

మరోవైపు, నగరవాసులను తీవ్రంగా వేధిస్తున్న ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిస్కారం చూపించేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని సంబంధిత రవాణా, జీహెచ్‌ఎంసీ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. నగరంలోని ప్రధాన కూడళ్ల వద్ద ట్రాఫిక్ సిగ్నళ్ల కారణంతో గంటల తరబడి వాహనాలు నిలిచిపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సిగ్నల్ ఫ్రీ ట్రాఫిక్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చేందుకు అవసరమైన అండర్‌పాస్‌లు (Underpasses), ఎలివేటెడ్ కారిడార్ల (Elevated Corridors) నిర్మాణానికి సంబంధించిన సమగ్ర నివేదికలు, మాస్టర్ ప్లాన్‌ను తక్షణమే సిద్ధం చేయాలని అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు.