Skip to content
ఆంధ్రప్రదేశ్ › వార్తలు

Cyclone Murasu Update: మురసు’ తీవ్ర తుపాను బీభత్సం.. ఏపీ వ్యాప్తంగా మొదలైన భారీ వర్షాలు, విమానాల రద్దు – కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు..

jagan 02 Nov 2026 1 నిమిషాల పఠనం ఆంధ్రప్రదేశ్
Cyclone Murasu Update: మురసు’ తీవ్ర తుపాను బీభత్సం.. ఏపీ వ్యాప్తంగా మొదలైన భారీ వర్షాలు, విమానాల రద్దు – కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు..

Cyclone Arnab: తెలంగాణకు భారీ వర్ష సూచన.. 3 జిల్లాలకు రెడ్ అలర్ట్, 5 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

Cyclone Murasu Update: బంగాళాఖాతంలో రూపుదిద్దుకున్న ‘మురసు’ (Murasu) తీవ్ర తుపాను క్రమంగా ఆంధ్రప్రదేశ్ తీరం వైపు వేగంగా దూసుకొస్తోంది. గంటకు 25 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న ఈ తుపాను ప్రభావంతో కోస్తాంధ్ర , ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఆదివారం రాత్రి నుంచే వర్షాలు ప్రారంభమయ్యాయి. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, కాకినాడ, డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ, కృష్ణా జిల్లాల్లో శని, ఆదివారాల రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తుండటంతో పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సముద్రం తీవ్రంగా అల్లకల్లోలంగా మారడంతో కృష్ణపట్నం పోర్టులో 3వ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని నెల్లూరు జిల్లా కలెక్టర్ సోమవారం నాడు జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తూ ఆదేశాలు ఇచ్చారు.

తుపాను కదలికలతో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, కాకినాడ జిల్లాల్లోని పలు మండలాల్లో తెల్లవారుజాము నుంచి విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. తుని, కాకినాడ నగరాల్లో ప్రధాన రహదారులు నీటమునిగాయి. శ్రీకాకుళం జిల్లాలోని నరసన్నపేట, జి.సిగడాం, సారవకోట, జలుమూరు ప్రాంతాల్లో, అలాగే పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ, విజయనగరం జిల్లా చీపురుపల్లి, వేపాడ మండలాల్లో వర్షపాతం నమోదైంది. జిల్లా యంత్రాంగాలను మంత్రి అచ్చెన్నాయుడు అప్రమత్తం చేస్తూ మత్స్యకారులు వేటకు వెళ్లకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, విద్యుత్, తాగునీరు, వైద్య సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా చూడాలని ఆదేశించారు. ఇటీవల వచ్చిన ‘అర్నాబ్’ తుపాను ధాటికి వరి, మినుము, వేరుశనగ, పత్తి, చెరకు, ఉద్యాన పంటలు తీవ్రంగా దెబ్బతినగా, ఇప్పుడు మళ్లీ ‘మురసు’ వర్షాలు పడుతుండటంతో చేతికొచ్చిన పంటలు ఎక్కడ నీటిపాలవుతాయోనని రైతన్నలు తీవ్ర దిగ్భ్రాంతి చెందుతున్నారు.

ప్రతికూల వాతావరణం, ఈదురుగాలుల కారణంగా ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని విశాఖపట్నం (భోగాపురం) , విజయవాడ విమానాశ్రయాల నుంచి నడిచే పలు విమాన సర్వీసులను అధికారులు తాత్కాలికంగా రద్దు చేశారు. విశాఖపట్నం ఎయిర్‌పోర్టు నుంచి విజయవాడ, తిరుపతి, హైదరాబాద్‌లకు వెళ్లే విమానాలను రద్దు చేసినట్లు ప్రకటించారు. మరోవైపు విజయవాడ విమానాశ్రయం నుంచి హైదరాబాద్, విశాఖ, బెంగళూరు, చెన్నై, ముంబయి, తిరుపతి, కర్నూలు వెళ్లే 12 విమాన సర్వీసులను ఇండిగో నిలిపివేయగా, ఎయిర్ ఇండియా కూడా తమ సర్వీసులను రద్దు చేసింది. ప్రయాణికులు విమానాశ్రయాలకు బయలుదేరే ముందు ఎయిర్‌లైన్ స్టేటస్‌ను తనిఖీ చేసుకోవాలని విమానాశ్రయ అధికారులు కోరారు.

తుపాను గాలుల వల్ల విద్యుత్ వ్యవస్థ దెబ్బతినే అవకాశం ఉన్నందున సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (APCPDCL) ప్రజల సౌకర్యార్థం అత్యవసర కంట్రోల్ రూమ్‌లను అందుబాటులోకి తెచ్చింది. ఏవైనా విద్యుత్ సమస్యలు ఎదురైనా, స్తంభాలు లేదా తీగలు తెగిపడినా తక్షణమే స్పందించేందుకు టోల్ ఫ్రీ నంబర్ 1912తో పాటు జిల్లాల వారీగా ప్రత్యేక ఫోన్ నంబర్లను విడుదల చేసింది.

  • కృష్ణా: 6281709355
  • ఎన్టీఆర్: 9440817561
  • గుంటూరు: 9440817526
  • బాపట్ల: 9281413774
  • ప్రకాశం: 9440817491
  • పల్నాడు: 7661019447

తెగిపడిన లైన్లు, కరెంట్ స్తంభాలకు దూరంగా ఉండాలని, వర్షపు నీటిలో ఉన్న విద్యుత్ పరికరాలను తాకకూడదని విద్యుత్ శాఖ అధికారులు ప్రజలను ప్రత్యేకంగా హెచ్చరించారు.