Skip to content
ఆంధ్రప్రదేశ్ › వార్తలు

Cyclone Murasu Update: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర తుపాను మురసు.. గంటకు 120 కి.మీ. వేగంతో గాలులు.. కోస్తా తీరానికి పెను ముప్పు..

jagan 02 Nov 2026 1 నిమిషాల పఠనం ఆంధ్రప్రదేశ్
Cyclone Murasu Update: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర తుపాను మురసు.. గంటకు 120 కి.మీ. వేగంతో గాలులు.. కోస్తా తీరానికి పెను ముప్పు..

Four Storms Churning at Once

Cyclone Murasu Update: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉన్న ‘మురసు’ (Murasu) తుపాను అత్యంత ప్రమాదకరమైన ‘తీవ్ర తుపాను’గా (Severe Cyclonic Storm) రూపాంతరం చెందిందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) వెల్లడించింది. గత 6 గంటల వ్యవధిలో గంటకు 22 కిలోమీటర్ల వేగంతో వాయవ్య దిశగా కదులుతున్న ఈ తీవ్ర తుపాను, సోమవారం (నవంబర్ 2) అర్ధరాత్రి నుంచి మంగళవారం (నవంబర్ 3) తెల్లవారుజాము మధ్య వ్యవధిలో దక్షిణ ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు – నరసాపురం మధ్య ఒంగోలు పట్టణానికి సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉందని ఎస్‌డీఎంఏ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ స్పష్టం చేశారు.

తీరం వైపు దూసుకొస్తున్న తీవ్ర తుపాను పర్యవేక్షణకు ఏపీ రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (RTGS) , విపత్తుల నిర్వహణ సంస్థ నిరంతరం సమన్వయం చేసుకుంటూ రంగంలోకి దిగాయి. ప్రస్తుతం ఈ వ్యవస్థ నెల్లూరుకు తూర్పు-ఆగ్నేయంగా 210 కిలోమీటర్లు, చెన్నైకి 200 కిలోమీటర్లు, కావలికి 220 కిలోమీటర్లు, ఒంగోలుకు 260 కిలోమీటర్లు , మచిలీపట్నానికి 270 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని అధికారులు తెలిపారు. తుపాను తీరం దాటే సమ్మయంలో గంటకు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో, గరిష్ఠంగా 120 కిలోమీటర్ల ప్రచండ ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించారు.

ఈ తీవ్ర తుపాను ప్రభావంతో సోమ, మంగళవారాల్లో కోస్తాంధ్రవ్యాప్తంగా చాలా చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు, పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు , ఒంగోలు, నెల్లూరు, బాపట్ల, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని ఒకటి రెండు చోట్ల అత్యంత భారీ వర్షాలు (Extremely Heavy Rains) కురిసే అవకాశం ఉందని ఐఎండీ ధ్రువీకరించింది. బుధవారం (నవంబర్ 4) వరకు తీరప్రాంత జిల్లాల్లో ఈ వర్షాల తీవ్రత కొనసాగుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. రాయలసీమ ప్రాంతంలో కూడా గంటకు 85 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో పాటు పలుచోట్ల భారీ వర్షాలు కురవనున్నాయి.

తుపాను తీవ్రతను దృష్ట్యా నవంబర్ 4వ తేదీ వరకు మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లోనూ సముద్రంలోకి వేటకు వెళ్లరాదని అధికారులు కఠిన ఆదేశాలు జారీ చేశారు. సహాయక , పునరావాస చర్యల నిమిత్తం రాష్ట్రవ్యాప్తంగా 6 ఎన్‌డీఆర్‌ఎఫ్ (NDRF), 7 ఎస్‌డీఆర్‌ఎఫ్ (SDRF) బృందాలను సిద్ధంగా ఉంచి బాపట్ల, ప్రకాశం, నెల్లూరు తీరప్రాంతాల్లోకి పంపించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని, అత్యవసర సహాయం కోసం ‘మనమిత్ర’ వాట్సాప్ గవర్నెన్స్ నంబర్ 9552300009 లేదా కంట్రోల్ రూమ్ నంబర్లు 112, 1070 ద్వారా అధికారులను సంప్రదించాలని విపత్తు నిర్వహణ సంస్థ కోరింది.