Skip to content
జాతీయం › వార్తలు

ఎఐటియుసి పుట్టుక… కార్మిక ఐక్యతకు పునాది

Prajapaksham 31 Oct 2026 0 నిమిషాల పఠనం జాతీయం
ఎఐటియుసి పుట్టుక… కార్మిక ఐక్యతకు పునాది

AITUC

ఆళవందార్ వేణు మాధవ్

భారత కార్మికోద్యమ చరిత్రలో ఆల్‌ ఇండియా ట్రేడ్‌ యూనియన్‌ కాంగ్రెస్‌ (ఎఐటియుసి)కు ప్రత్యేక స్థానం ఉంది. కార్మికుల హక్కుల పరిరక్షణ, మెరుగైన వేతనాలు, పని గంటల నియంత్రణ, ఉద్యోగ భద్రత, సామాజిక న్యాయం వంటి లక్ష్యాలతో ఆవిర్భవించిన ఈ సంస్థ శతాబ్దానికి పైగా కార్మిక ఉద్యమాలకు వేదికగా నిలిచింది. దేశ పారిశ్రామిక అభివృద్ధిలో కార్మికుల శ్రమ కు గుర్తింపు లభించాలంటే వారి సమస్యలపై సంఘటిత పోరాటం అవసరమనే భావనకు ఎఐటియుసి చరిత్ర నిదర్శనం.1920 అక్టోబర్‌ 31న బొంబాయిలో ఎఐటియుసి ఏర్పడింది. బ్రిటిష్‌ పాలనలో పరిశ్రమలు విస్తరిస్తున్నప్పటికీ కార్మికులు తక్కువ వేతనాలు, సుదీర్ఘ పని గంటలు, ప్రమాదకరమైన పని పరిస్థితులు, కనీస సౌకర్యాల లేమితో సతమత మయ్యేవారు. వివిధ ప్రాంతాల్లో విడివిడిగా సాగుతున్న కార్మిక పోరాటాలను జాతీయ స్థాయిలో సమన్వయం చేయాలనే లక్ష్యంతో ఈ సంస్థ ఆవిర్భవించింది. స్వాతంత్య్ర సమరయోధుడు లాలా లజపత్‌ రాయ్‌ ఎఐటియుసి తొలి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. జోసెఫ్‌ బాప్టిస్టా, ఎన్‌.ఎం.జోషి, దివాన్‌ చమన్‌లాల్‌ వంటి నాయకులు సంస్థ
నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు.
కార్మిక సమస్యలను జాతీయ రాజకీయ చర్చల్లోకి తీసుకురావడం, కార్మికులకు సంఘటిత శక్తి అవసరాన్ని చాటడం ఈ సంస్థ ప్రారంభ దశలో ప్రధాన లక్ష్యాలుగా నిలిచా యి. స్వాతంత్య్ర ఉద్యమ కాలంలో కార్మిక హక్కు లు, జాతీయ స్వాతంత్య్రం, సామాజిక సమానత్వం వంటి అంశాలు పరస్పరం ముడిపడ్డాయి. అనంత రం వేతనాలు, పని పరిస్థితులు, కార్మిక చట్టా లు, సామాజిక భద్రత, ప్రభుత్వ రంగ పరిశ్రమల పరిరక్షణ వంటి అంశాలపై ఎఐటియుసి తన కార్యకలాపాలను కొనసాగించింది. కార్మిక సంఘాల మధ్య విధానపరమైన భేదాలు, చీలికలు ఉన్నప్పటికీ భారత కార్మికోద్యమ చరిత్రలో ఈ సంస్థ పాత్ర ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.
తెలంగాణ పారిశ్రామిక చరిత్రలో సింగరేణి బొగ్గు గనులకు విశిష్ట స్థానం ఉంది. విద్యుత్‌ ఉత్పత్తి, ఉక్కు పరిశ్రమ, ఇతర పారిశ్రామిక రంగాలకు అవసరమైన బొగ్గును వెలికితీసే కార్మికులు అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో పనిచేస్తున్నారు. భూగర్భంలో ప్రాణాలను పణంగా పెట్టి దేశ ఆర్థిక వ్యవస్థకు ఇంధనాన్ని అందించే వారి శ్రమకు తగిన ప్రతిఫలం, భద్రత, గౌరవం లభించాలి. ఈ లక్ష్యాల సాధనలో కార్మిక సంఘాల పాత్ర కీలకం. సింగరేణిలో ఎఐటియుసి అనుబంధ సింగరేణి కాలరీస్‌ వర్కర్స్‌ యూనియన్‌ కార్మికుల సమస్యలపై సంఘటితంగా పనిచేస్తోంది. హైదరాబాద్‌ స్టేట్‌ కాలంలో కార్మిక సంఘాల నిర్మాణం, ఉద్యమాల విస్తరణకు మఖ్దూం మొహియుద్దీన్‌, రాజ్‌ బహదూర్‌ గౌర్‌ వంటి నాయకులు కృషి చేశారు. ఆ కాలపు కార్మికోద్యమ వారసత్వం తెలంగాణ కార్మిక చరిత్రలో భాగమైంది. సింగరేణిలో దేవూరి శేషగిరి రావు, కె.ఎల్‌.మహేంద్ర, మనుబోతుల కొమురయ్య లాంటి నాయకులు 1942లో ఎఐటియుసి స్థాపనకు కృషి చేశారు.
సింగరేణిలో వేతన ఒప్పందాలు, బోనస్‌, అలవెన్సులు, ఉద్యోగ భద్రత, పదోన్నతులు, వైద్య సదుపాయాలు, గని ప్రమాదాల నివారణ వంటి అంశాలు కార్మిక సంఘాల కార్యాచరణలో ముఖ్యమైనవి. యాజమాన్యంతో చర్చలు, కార్మికుల సమస్యలపై ప్రాతినిధ్యం, అవసరమైన సందర్భాల్లో నిరసనలు, సమ్మెల ద్వారా డిమాండ్లను సాధిస్తూ ఉంది.
1992లో నష్టాలు వస్తున్నాయని సింగరేణి సంస్థను సిక్‌ ఇండస్ట్రీగా ముద్ర పడకుండా కార్మికులను చైతన్య పరిచి అధిక ఉత్పత్తి సాధించి సంస్థను కాపాడుకోవటానికి ఎఐటియుసి గణనీయంగా కృషి చేసింది. కార్మికులకు దేశ చరిత్రలో లేని విధంగా సంస్థ లాభాలలో వాటా సాధించిన ఘనత ఎఐటియుసిదే. సింగరేణి పరిరక్షణ కోసం ఎఐటియుసి అనుబంధ కార్మిక సంఘం ఎన్నో సార్లు పోరాట యాత్ర నిర్వహించడం ప్రభుత్వ రంగ పరిశ్రమల పరిరక్షణపై ఆ సంఘం కొనసాగిస్తున్న కార్యాచరణకు ఒక ఉదాహరణ.1998 నుంచి ఇప్పటి వరకు ఏడు సార్లు జరిగిన గుర్తింపు ఎన్నికలలో నాలుగు సార్లు ఎఐటియుసికి కార్మికులు పట్టం కట్టారు. ఈనెల ఆర్టీసీ ఎన్నికల్లో కూడా ఎఐటియుసి కూటమి విజయం వెనుక కార్మికుల ఆదరణ ఉంది.
ప్రస్తుతం కార్మిక రంగం ప్రైవేటీకరణ, కాంట్రాక్టు విధానం విస్తరణ, సాంకేతిక మార్పు లు, ఉద్యోగ భద్రతపై ఆందోళనలు వంటి సవాళ్లను ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితుల్లో కార్మిక సంఘాలు మారుతున్న పరిస్థితులను అధ్యయనం చేసి, కార్మికుల ప్రయోజనాలను కాపాడే కార్యాచరణను రూపొందించాలి.ఎఐటియుసి శతాబ్దపు ప్రస్థానం కార్మికుల ఐక్యత ప్రాధాన్యాన్ని గుర్తుచేస్తోంది. సింగరేణిలో ఆ వారసత్వం మరింత అర్థవంతం కావాలంటే కార్మికుల హక్కుల పరిరక్షణతోపాటు వారి కుటుంబాల సంక్షేమం, పదవీ విరమణ అనంతర జీవన భద్రతకూ సమాన ప్రాధాన్యత ఇవ్వాలి.

ట్యాగ్‌లు: CPI CPI leaders Today news