Skip to content
ప్రపంచం › వార్తలు

Indians in America: అమెరికాలో 54 లక్షలు దాటిన భారతీయుల జనాభా.. కాలిఫోర్నియాలోనే 10 లక్షల మంది.. తాజా సర్వేలో వెల్లడి

jagan 30 Oct 2026 1 నిమిషాల పఠనం ప్రపంచం
Indians in America: అమెరికాలో 54 లక్షలు దాటిన భారతీయుల జనాభా.. కాలిఫోర్నియాలోనే 10 లక్షల మంది.. తాజా సర్వేలో వెల్లడి

Indians in America

Indians in America: అమెరికాలో స్థిరపడిన నివాసితులలో భారతీయుల సంఖ్య ప్రతిఏటా అత్యంత వేగంగా పెరుగుతోంది. అమెరికా జనగణన విభాగం (US Census Bureau) విడుదల చేసిన తాజా ‘అమెరికన్ కమ్యూనిటీ సర్వే’ (ACS) 2025 అంచనాల ప్రకారం, తమను తాము కేవలం భారతీయ సంజాతులుగా (Asian Indian Alone) స్వచ్ఛందంగా నమోదు చేసుకున్న వారి సంఖ్య 54.1 లక్షలకు చేరుకుంది. గడిచిన ఒక్క ఏడాది కాలంలోనే ఈ కేటగిరీలో దాదాపు 3.15 లక్షలకు పైగా జనాభా నమోదు కావడం గమనార్హం.

తమను కేవలం భారతీయులుగా పేర్కొన్న వారితో పాటు, ఇతర బహుళ జాతులతో సంబంధమున్న భారతీయ మూలాలు ఉన్న పౌరులను కూడా లెక్కలోకి తీసుకుంటే ఈ మొత్తం సంఖ్య ఏకంగా 59.1 లక్షలకు చేరుకుంది. 2024 నాటికి ఈ సంఖ్య 55.6 లక్షలుగా ఉండగా, అతి తక్కువ సమయంలోనే విస్తృత పెరుగుదల నమోదైంది. దీనితో అమెరికాలో నివసిస్తున్న ఆసియా జాతి గ్రూపులలో భారతీయులే అత్యధిక జనాభా కలిగిన అతిపెద్ద సమూహంగా నిలిచారు. తైవాన్ మినహాయించి చైనా నుంచి వచ్చిన వారి సంఖ్య 46.5 లక్షలతో తర్వాతి స్థానంలో ఉంది. ఇక విదేశాల్లో పుట్టి అమెరికాలో నివసిస్తున్న వలసదారుల లెక్కల్లో మెక్సికో (1.06 కోట్లు) తర్వాతి స్థానంలో భారత్ (34 లక్షలు) రెండో స్థానంలో నిలిచింది.

రాష్ట్రాల వారీగా పరిశీలిస్తే, కాలిఫోర్నియా రాష్ట్రంలో అత్యధికంగా 10.2 లక్షల మంది భారతీయులు నివసిస్తున్నారు. ఆ తర్వాత టెక్సాస్‌లో 7.08 లక్షలు, న్యూజెర్సీలో 4.71 లక్షలు, న్యూయార్క్‌లో 4.20 లక్షలు, ఇల్లినాయిస్‌లో 2.88 లక్షలు , ఫ్లోరిడాలో 2.39 లక్షల మంది నివాసం ఉంటున్నట్లు సర్వే స్పష్టం చేసింది. కాగా ఈ సర్వే నివేదికలో పౌరుల ఆర్థిక స్థితిగతులను విశ్లేషించగా, అమెరికాలో మధ్యస్థ కుటుంబ ఆదాయం (Median Household Income) 2025 నాటికి 84,780 డాలర్లకు పెరిగినట్లు తేలింది. పర్యావరణ పరిరక్షణ , ఎలక్ట్రిక్ వాహనాల వినియోగంలో కాలిఫోర్నియాలోని శాంటా క్లారా కౌంటీలో గరిష్ఠంగా 24 శాతం కుటుంబాలు ఈవి (EV) వాహనాలను వినియోగిస్తున్నట్లు ఏసీఎస్ వెల్లడించింది.