Telangana IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. పూర్తి వివరాలు కథనంలో..
Telangana IAS Transfers
Telangana IAS Transfers: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర పాలనా యంత్రాంగంలో కీలకమైన మార్పులు చేపడుతూ పలువురు సీనియర్ ఐఏఎస్ (IAS) అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని వివిధ శాఖల్లో ఐఏఎస్ అధికారులకు కొత్త బాధ్యతలు అప్పగిస్తూ, మరికొందరికి అదనపు బాధ్యతలను కేటాయించింది. ప్రభుత్వం జారీ చేసిన ఈ ఉత్తర్వుల ప్రకారం, సీనియర్ అధికారి జయేష్ రంజన్‌ను పర్యావరణం, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ (EFST) శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించింది. అలాగే మరో సీనియర్ అధికారి వికాస్ రాజ్‌కు ఇంధన (Energy) శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కీలకమైన పోస్టింగ్ ఇచ్చింది.
మరికొన్ని ముఖ్యమైన శాఖల్లో జరిగిన మార్పులను పరిశీలిస్తే, ఐఏఎస్ అధికారి నవీన్ మిట్టల్‌కు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి , గ్రామీణ నీటి సరఫరా (RWS) శాఖల పూర్తి బాధ్యతలు అప్పగించారు. శైలజా రామయ్యర్‌కు రెవెన్యూ (దేవాదాయ) శాఖ బాధ్యతలను అప్పగించగా, ఏ.వాణి ప్రసాద్‌ను క్రీడలు , హెరిటేజ్ తెలంగాణ శాఖలకు కేటాయించారు. సీనియర్ అధికారి రాహుల్ బొజ్జాకు తన ప్రస్తుత బాధ్యతలతో పాటు గిరిజన సంక్షేమ శాఖ అదనపు బాధ్యతలను అప్పగించగా, కె. ఇలంబర్తిను రవాణా శాఖ కార్యదర్శిగా నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఇతర శాఖల్లో జరిగిన మార్పుల్లో భాగంగా ఐఏఎస్ అధికారి సర్ఫరాజ్ అహ్మద్‌కు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC)తో పాటు సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్ల అదనపు బాధ్యతలు అప్పగించారు. శృతి ఓజాకు మహిళా శిశు సంక్షేమం, దివ్యాంగులు , వృద్ధుల సంక్షేమ శాఖల బాధ్యతలు కేటాయించగా, ముషర్రఫ్ అలీ ఫారూఖీని ఆరోగ్య , కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శిగా నియమించారు. అదేవిధంగా డాక్టర్ సంగీత సత్యనారాయణను మహిళా, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా, జితేష్ వి. పాటిల్‌ను తెలంగాణ దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థ (TGSPDCL) , రెడ్కో (TGREDCO) బాధ్యతల్లో నియమించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) సంజయ్ జాజు పేరుతో ఈ బదిలీలు, పోస్టింగ్‌లకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు విడుదలయ్యాయి.