ఆర్‌టిసి కార్మికుల ‘చలో లేబర్ కమిషనర్’ ఎందుకు?
Rtc Election
ఉజ్జిని రత్నాకర్ రావు, ఎఐటియుసి పూర్వపు ప్రధాన కార్యదర్శి
అక్టోబర్ 9న ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగా యి. ఈ ఎన్నికల్లో పోలైన 34,421 ఓట్లలో ఎంప్లాయిస్ యూనియన్ కూటమికి 18,375 రాగా తెలంగాణ ఆర్‌టిసి వర్కర్స్ యూనియన్ కూటమికి 13,709 ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉన్న ఐఎన్‌టియుసిని కాదని గతంలో బిఆర్‌ఎస్‌లో ఉండి ఆతరువాత బిజెపి చేరి నేడు కాంగ్రెస్‌లో చేరిన టిడబ్ల్యుయు (తెలంగాణ వర్కర్స్ యూనియన్)కు మద్దతు ఇచ్చింది. దాన్ని ఎలాగోలా గెలిపించుకోవాలని మంత్రులు, ఎమ్‌ఎల్‌ఎలు తమ అనుచరులతో డబ్బులు, మద్యం, అధికార యంత్రాంగాన్ని రంగంలో దించి కాంగ్రెస్ తీవ్ర ప్రయత్నం చేసింది. ఎన్ని పన్నాగాలు పన్నిన ఆర్టీసీ ఉద్యోగులు మాత్రం ఎప్పుడూ తమ కు అండగా ఉండి కార్మికుల సమస్యలపై ఉద్యమాలు చేపడుతున్న ఎంప్లాయిస్ యూనియన్ కే పట్టం కట్టారు.
కెసిఆర్ హయాంలో 2016లో ఎన్నికలు జరిగినవి. తిరిగి 2018లో జరుగవలసిన ఎన్నికలను జరపుకుండా వాయిదా వేస్తూ వచ్చింది. ఇప్పుడు 10 సంవత్సరముల తర్వాత ఎన్నికలు జరిగినాయి. ఈ ఎన్నికల్లో గెలుపొందిన యూనియన్‌కు విలీన ప్రక్రియల కొరకు ఐఎఎస్‌లతో వేసిన కమిటీలో స్థానం కల్పిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఎన్నికలు నిర్వహించి 20 రోజులు గడుస్తున్నా ప్రభుత్వంలో స్పందన లేదు. వెంటనే విలీన ప్రక్రియ చేపట్టాలని కార్మిక సంఘాలు కోరుతున్నాయి.
గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం కార్మికుల ప్రధాన సమస్యలను పరిష్కరించకుండా వాయిదా వేస్తున్న సందర్భంలో 2021లో ఆర్‌టిసిలో 53 రోజుల సమ్మె జరిగింది. ప్రభుత్వం కార్మికులతో చర్చలు జరపకుండా కార్మికులపై తీవ్రనిర్బంధాన్ని ప్రయోగించింది.ఆర్టిసిలో కార్మిక సంఘాలను నిషేధించింది. కార్మిక సంఘాలు కోరుతున్నట్లు ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్‌ను అంగీకరిస్తూ చివరకు అసెంబ్లీ ఎన్నికల ముందు 17 సెప్టెంబర్, 2023 నాడు యాక్ట్-7 పేరిట విలీన ప్రక్రియకు అవసరమైన ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రభుత్వం హామీ ఇచ్చిన విలీన ప్రక్రియ
పూర్తి చేయాలి!
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఆర్‌టిసి కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులు గా కేవలం గజిట్ నోటిఫికేషన్ ద్వారా కలుపుకోవచ్చు. అలా వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తూ ట్రెజరరీ నుంచి జీతాలు చెల్లించవచ్చు. అప్పుడు ఓ కమిటీవేసి దాని నివేదిక వచ్చిన తర్వాత వారి జీతా భత్యాల్లో, ఉద్యోగ భద్రత తదితర అంశాలపై తుది నిర్ణయాలు తీసుకోవచ్చు. ఈ సంవత్సర ఏప్రిల్ లో ఆర్టీసీలో సమ్మె జరిగింది. ఆ సందర్భంగా జూన్ 2 నుండి ప్రభుత్వంలో విలీనం చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం.. వివిధ కారణాలు చెబుతూ వాయిదా వేస్తూ.. యూనియ న్ల వెరిఫికేషన్ తర్వాతనే విలీన ప్రక్రియను చేపడతామని హామీ ఇచ్చింది.. చివరికి ఎన్నికలు నిర్వహించిం ది. గెలుపొందిన ఎంప్లాయిస్ యూనియన్‌ను విలీనంకోసం వేసిన ఐఏఎస్ ల కమిటీలోకి తీసుకుంటామని చెబుతూ తాత్సారం చేస్తుంది.
ఎన్నికల్లో గెలుపొందేందుకు అడ్డదారుల్లో కాంగ్రెస్ :
విలీనం డిమాండ్ చేసే బలమైన ఉద్యోగ సంఘాలను ఎన్నికల స్థాయిలోనే కట్టడి చేయాలని ప్రభుత్వం భావించింది. తమ చెప్పు చేతుల్లో ఉండే ఉద్యోగ సంఘానికి గుర్తింపు హోదా రావాలని తీవ్రంగా ప్రయత్నించింది.ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచే సంఘాన్ని గెలిపించుకోవాలని గత ఎన్నికల్లో గుర్తింపు ఉన్న బాణం గుర్తును కాంగ్రెస్ మద్దతిస్తున్న కూటమికి వచ్చేలా నిర్వాహకులపై ఒత్తిడి తెచ్చింది. గుర్తులను తారుమారుచేసి ఓటేసే ఉద్యోగులను తికమకపరిచి లబ్ధి పొందాలనుకున్నది. అయినా ఫలితాలు ప్రభుత్వానికి
వ్యతిరేకంగానే వచ్చాయి.
ఈ ఓటమిని జీర్ణించుకోని కాంగ్రెస్ సర్కార్ కార్మిక శాఖ అధికారులపై ఒత్తిడి తెచ్చి ఎన్నికల్లో పాటిస్తున్న కోడ్ ఆఫ్ డిసిప్లీన్ ఉల్లంఘిస్తూ, రీజియన్ ఎన్నికల ఫలితాలను తాము మద్దతు ఇచ్చిన కూటమి కట్టబెట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం ట్రేడ్ యూనియన్ ఎన్నికల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు. అయినా కార్మిక శాఖపై ఒత్తిడి తెచ్చి క్లాస్-6 లో గుర్తింపును 50 శాతము +1 ఓటు కన్నా తక్కువ వచ్చినప్పటికీ నాలుగు రీజియన్స్‌లో టిడబ్ల్యుయుకు గుర్తింపు ఇచ్చారు. క్లాస్ -6 లో 14 రీజియన్స్ ఉండగా 9 రీజియన్లలో కాంగ్రెస్ బలపరిచిన కూటమికే ఆధిక్యత ఉన్నదని, ఉద్యోగుల మద్దతు తమకే ఉన్నదని ప్రకటించారు. రీజియన్స్ స్థాయిలో పోలైన ఓట్లలో ఎవరికి 50 శాతం పైగా ఓట్లు వస్తాయో వారు గెలిచినట్లు లెక్క. ఎవరికీ 50 శాతం పైగా ఓట్లు రానట్టయితే అవి రాష్ట్ర స్థాయిలో గెలుపొందిన యూనియన్‌కు చెందుతాయి. ఇదే విధానాన్ని పాటిస్తామని ఎన్నికలు జరిపిన కార్మిక శాఖ అధికారులు ఎన్నికల నోటిఫికేషన్ ముందే చెప్పారు. దానికి అన్ని సంఘాలు ఆమోదం కూడా తెలిపాయి.
ఈసారి జరిగిన రీజియన్ స్థాయి ఎన్నికల్లో పోలైన ఓట్లలో 50 శాతం కంటే కనీసం ఒక ఓటు ఎక్కువ వచ్చినవి ఏడు మాత్రమే ఉన్నాయి. వాటిలో నాలుగు రీజియన్లలో ఎంప్లాయిస్ యూనియన్ కూటమి, మూడు రీజియన్లలో కాంగ్రెస్ బలపరిచిన టి డబ్ల్యూ యు విజయం సాధించాయి. మిగతా రీజియన్‌లలో ఆ పద్ధతిలో ఓట్లు పడలేదు. ఒప్పం దం ప్రకారం ఎవరికీ ఆధిక్యత రాని రీజియన్లు మొదటి ఓటుతో గెలుపొందిన ఎంప్లాయిస్ యూనియన్ కూటమికి చెందుతాయి. అయితే వాటిని కాంగ్రెస్ మద్దతు తెలిపిన కూటమికి దక్కేలా విధానాలు మార్చటం జరిగింది.
కాంగ్రెస్ ఒత్తిడితో నిబంధనలు మార్చిన కార్మిక శాఖ :
50% నిబంధనను పక్కనపెట్టి ఈ రీజియన్స్‌లో ఎక్కువ ఓట్లు వచ్చిన సంఘానికి గుర్తింపు కట్టబెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యులు కార్మిక శాఖ పై ఒత్తిడి తెచ్చి పావులు కలిపారు. ఈ మార్పు వల్ల నాలుగు రీజియన్ స్థానాలు అక్రమంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన టిడబ్ల్యూయు కూటమికిలోనికి వెళ్లిపోతాయి. దీనివల్ల రాష్ట్రస్థాయి గుర్తింపులో ఓటమిపాలైన కూటమికి రీజియన్స్‌లో మెజార్టీ చేజిక్కుతుంది. న్యాయంగా తమకు రావలసిన నాలుగు రీజియన్లను ఉద్యోగుల మద్దతులేని సంఘాలకు కట్టబెట్టడాన్ని ఎంప్లాయిస్ కూటమి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది.
చలో లేబర్ కమిషనర్ పిలుపు :
ఎన్నికల ముందు నోటిఫికేషన్ చేసిన నిబంధన ప్రకారం 50 శాతం +1 ఓటుకి తక్కువ వచ్చినప్పటికీ 4 రీజియన్స్‌లో క్లాస్-6లో అక్రమంగా ఇచ్చిన గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ, క్లాస్ -3 లో రాష్ట్రస్థాయిలో గెలుపొందిన ఎంప్లాయిస్ యూనియన్ కూటమి అక్టోబర్ 28న ‘చలో లేబర్ కమిషనర్’ కార్యాలయానికి పిలుపునిచ్చింది. కార్మికు లు ధర్నాకు సిద్ధమయ్యారు. ఎన్నికల్లో గెలుపొందిన సంఘానికి రిటర్నింగ్ అధికారి గుర్తింపు పత్రాన్ని అందజేయాలి. దాని ఆధారంగా వారు ప్రభుత్వంతో ఉద్యోగుల తరఫున సంప్రదింపులు జరుపుతా రు. ప్రభుత్వం ఎన్నికల ఫలితాలను గౌరవించి చర్చల కోసం గుర్తింపు సంఘ ప్రతినిధులను ఆహ్వానించి తన నిజాయితీ నిరూపించుకోవాలి.