Skip to content
తెలంగాణ › వార్తలు

Hyderabad Real Estate Alert: హైదరాబాద్‌లో మరోసారి భారీ భూముల వేలానికి హెచ్‌ఎండీఏ ప్లాన్.. రూ.2,000 కోట్ల ఆదాయమే లక్ష్యంగా పావులు..

jagan 26 Oct 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
Hyderabad Real Estate Alert: హైదరాబాద్‌లో మరోసారి భారీ భూముల వేలానికి హెచ్‌ఎండీఏ ప్లాన్.. రూ.2,000 కోట్ల ఆదాయమే లక్ష్యంగా పావులు..

HMDA

Hyderabad Real Estate Alert: హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (HMDA) రాజధాని పరిధిలో ఉన్న అత్యంత ఖరీదైన, ప్రైమ్‌ లొకేషన్లలోని ప్రభుత్వ భూములను విక్రయించడానికి మరోసారి భారీ వేలానికి తెరలేపింది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న భూములను వేలం వేయడం ద్వారా దాదాపు రూ. 2,000 కోట్ల భారీ ఆదాయాన్ని సమకూర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ మేరకు నవంబర్‌ నెలాఖరు వరకు దశలవారీగా వేలం ప్రక్రియను నిర్వహించేందుకు హెచ్‌ఎండీఏ అధికారిక నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇటీవల తెలంగాణ ఇండస్ట్రియల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ (TGIIC) రాయదుర్గంలో నిర్వహించిన భూముల వేలంలో రికార్డు స్థాయి ధరలు లభించిన ఉత్సాహంతో, ఇప్పుడు హెచ్‌ఎండీఏ కూడా కోకాపేట్‌లోని ‘నియోపొలీస్‌’ (Neopolis) లేఅవుట్‌తో పాటు వివిధ ప్రాంతాల్లోని మొత్తం 114 భూ పార్శిళ్లను బహిరంగ వేలంలో ఉంచింది.

బంజారాహిల్స్‌లోని హకీంపేట్‌ గ్రామం (సర్వే నెం. 102/1) పరిధిలో గతంలో వివాదాస్పదమైన భూములను కూడా ఈ వేలంలో చేర్చడం గమనార్హం. ఈ సర్వే నంబర్‌లోని భూములపై గతంలో ఒక సొసైటీ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ, హెచ్‌ఎండీఏ ముందుకే వెళ్తోంది. ఇక్కడ 1,084 చదరపు గజాల నుంచి 1,437 చదరపు గజాల విస్తీర్ణం కలిగిన 8 ప్లాట్లను నోటిఫై చేసింది.

ఈ ప్లాట్లకు చదరపు గజానికి రూ. 2 లక్షల చొప్పున అత్యధిక రిజర్వ్‌ ధరను నిర్ణయించారు. గత జూన్ నోటిఫికేషన్‌లో కూడా ఇదే సర్వే నంబర్ పరిధిలోని 8 ఎకరాలను ఎకరాకు రూ. 99 కోట్ల చొప్పున వేలానికి పెట్టాలని భావించినా, సొసైటీ సభ్యుల ఆరోపణలతో ప్రక్రియ నిలిచిపోయింది. తాజాగా రెవెన్యూ శాఖ ఆ ఆరోపణలను తోసిపుచ్చడంతో ప్రభుత్వం మళ్లీ వేలానికి రంగం సిద్ధం చేసింది.

బంజారాహిల్స్‌, కోకాపేట్‌ మినహా మిగిలిన ప్రాంతాల్లో నోటిఫై చేసిన ప్లాట్లలో అత్యధికంగా చదరపు గజానికి రూ. 55,000, అత్యల్పంగా ఇన్ముల్‌ నర్వ లేఅవుట్‌లో రూ. 15,000 రిజర్వ్‌ ధరను ఖరారు చేశారు. ఈ నోటిఫికేషన్‌లో బచపల్లి లేఅవుట్‌లో 50 ప్లాట్లు, ఇన్ముల్‌ నర్వలో 45 ప్లాట్లతో పాటు అమీన్‌పూర్‌, కప్రా, సూరారం తదితర ప్రాంతాల్లోని భూములను చేర్చారు. ఈ భూముల విక్రయాలకు సంబంధించి నవంబర్‌ 12, 20, 23, 25, 27 తేదీల్లో ఈ-వేలం (E-Auction) పాటలు నిర్వహించనున్నారు.

రియల్ ఎస్టేట్ రంగాన్ని ఊపేస్తున్న కోకాపేట్‌ నియోపొలీస్‌ లేఅవుట్‌లోని 4.59 ఎకరాల భూమికి (ప్లాట్‌ నెం. 17) హెచ్‌ఎండీఏ ఏకంగా రూ. 120 కోట్ల రిజర్వ్‌ ధరను నిర్ణయించింది. అలాగే రాయదుర్గం ఖల్సా గ్రామంలోని 1,815 చదరపు గజాల ప్లాటుకు చదరపు గజానికి రూ. 1.75 లక్షలు, కోకాపేట్‌లోని మరో 8,591 చదరపు గజాల (దాదాపు 2 ఎకరాలు) భూ భాగానికి గజానికి రూ. 1.50 లక్షల చొప్పున రిజర్వ్‌ ధర ఫిక్స్‌ చేశారు. కూకట్‌పల్లి సమీపంలోని మూసాపేట్‌లో ఉన్న 3.15 ఎకరాల స్థలానికి రూ. 99 కోట్ల రిజర్వ్‌ ధరను ఖరారు చేశారు.

రాష్ట్రంలో సంక్షేమ పథకాలు, కీలక అభివృద్ధి ప్రాజెక్టుల అమలుకు నిధుల కొరత ఏర్పడిందనే వార్తలు వస్తున్న తరుణంలో, కాంగ్రెస్‌ ప్రభుత్వం భూముల విక్రయాన్నే ప్రధాన ఆదాయ మార్గంగా ఎంచుకోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల సమయంలో సంపద సృష్టిస్తామని చెప్పిన రేవంత్‌ రెడ్డి సర్కార్‌, ఇప్పుడు ఖజానా నింపుకోవడానికి వరుసగా ప్రభుత్వ భూములను వేలం వేసే పద్ధతిని ఆశ్రయించడంపై రాజకీయ వర్గాల్లోనూ, ప్రజల్లోనూ విస్తృత చర్చ జరుగుతోంది.