Skip to content
ఎడిట్ పేజి › వార్తలు

కొత్త సైనిక కూటములు

Prajapaksham 26 Oct 2026 0 నిమిషాల పఠనం ఎడిట్ పేజి
కొత్త సైనిక కూటములు

Editorial: విశిష్ట సాహిత్య ధోరణి ‘మేజిక్‌ రియలిజం’

ఇటీవల కాలంలో ఇస్లామిక్‌ ప్రపంచంలో కొన్ని ఆసక్తికర పరిణామాలు జరుగుతున్నాయి. వాటిలో ప్రధానం గా చెప్పుకోవలసిందీ, ప్రాముఖ్యతగలదీ సైనిక కూటముల ఏర్పాటు. ఆగస్టులో సౌదీ అరేబియా, తుర్కియె (టర్కీ), పాకిస్థాన్‌లు మక్కాలో సమష్టి రక్షణ ఒప్పందంపై సంతకం చేశాయి. తుర్కియె, పాకిస్థాన్‌, ఇండోనేషియా, కటార్‌లు అక్టోబర్‌ 21న కటార్‌ రాజధాని దోహాలో ‘బదర్‌ అవగాహన పత్రంపై’ సంతకం చేశాయి. ఈ ఒప్పందం ప్రకారం ఈ నాలుగుదేశాలు సమష్టిగా సైనిక పరికరాలను ఉత్పత్తి చేస్తాయి, టెక్నాలజీ పంచుకుంటాయి, రక్షణ పరిశోధనను పెంపొందిస్తాయి. తుర్కియె, పాకిస్థాన్‌లు రెండూ కూటములలోనూ భాగస్వాములుగా ఉన్నాయి. ఈ రెండు దేశాలూ సైనిక పాటవంలో ముందున్నాయి, పాకిస్థాన్‌ అణ్వస్త్ర రాజ్యం కూడాను.
సౌదీ అరేబియా, కటార్‌లు పెట్రో వనరులతో ఆర్థికంగా బలమైన దేశాలు. పశ్చిమాసియాలో అరడజను గల్ఫ్‌ దేశాలు అమెరికాతో కలిసి ప్రయాణిస్తూ దాని సైనిక స్థావరాలకు వసతి కల్పించి తమ దేశాల రక్షణ బాధ్యతను అమెరికాకు అప్పగించాయి. తమ రక్షణ గూర్చి చింతలేకుండా గుండె దిటవుతో ఉంటూ, ఆయిలు వ్యాపారంతో పెట్రో డాలర్ల పంట పండించుకుంటున్నాయి. పశ్చిమాసియాలోని ఇతర అరబ్‌, ఇస్లామిక్‌ దేశాలతోపాటు గల్ఫ్‌ దేశాలు కూడా ఒకవైపు ఇజ్రాయెల్‌ నుంచి, మరోవైపు ఇరాన్‌ నుంచి శత్రుత్వం ఎదుర్కొంటున్నాయి. అమెరికా ఇజ్రాయెల్‌ను పనిముట్టుగా వాడుకుంటూ అరబ్‌ దేశాలను అణిచి ఉంచుతోంది. అందువల్లనే పాలస్థీనా స్వతంత్ర రాజ్యస్థాపన ఆచరణకు నోచుకోకపోగా ఇజ్రాయెల్‌ ఆగడాలకు, ఆక్రమణకు నిరంతరం గురవుతున్నది. అయితే పశ్చిమాసియాపై అమెరికా ఆధిపత్యం కొనసాగుతుండగా, ఇప్పుడీ సైనిక కూటముల అవసరం ఎందుకొచ్చింది? ఇజ్రాయెల్‌ తప్పుడు నివేదికలు, ప్రోత్సాహంతో అధ్యక్షుడు ట్రంప్‌ ఇరాన్‌లో ప్రభుత్వ మార్పుకు చేసిన సైనిక దాడి బెడిసికొట్టిన దరిమిలా, ఇరాన్‌ గల్ఫ్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై, సౌదీ అరేబియా తదితర గల్ఫ్‌ దేశాల ఆర్థిక వనరులపైన పదేపదే దాడులు చేస్తున్నది. గల్ఫ్‌ దేశాలకు అమెరికా నుంచి ఆశించిన రక్షణ దొరకలేదు. ఈ దశలో అమెరికాతో సంబంధాలు కొనసాగిస్తూనే తమ రక్షణపై కూడా దృష్టి పెట్టాలన్న ఆలోచన ఆ దేశాల నేతల్లో మేల్కొన్నది. ఆర్థిక సంక్షోభాల్లో ఉన్న పాకిస్థాన్‌, తుర్కియె తమ సైనిక శక్తిని చూపి ఆ అవకాశంలోకి చొరబడ్డాయి. అయితే మక్కా ఒప్పందం తదుపరి సౌదీ అరేబియా ఆయిలు రిఫైనరీ వ్యవస్థ అరామ్‌కోపై ఇరాన్‌ పలుమార్లు క్షిపణు లు ప్రయోగించి కొన్ని వసతులను ధ్వంసం చేసినా ‘ఉమ్మడి రక్షణ’ (ఒక దేశంపై దాడి జరిగితే మూడు దేశాలపై దాడిగా పరిగణన సూత్రం) ప్రకారం పాకిస్థాన్‌గాని, తుర్కియెగాని సౌదీ రక్షణకు వెళ్లలేదు. అమెరికా అనుమతి లేనిదే అవి సైనిక చర్యలకు దిగలేవు. తాజాగా నాలుగు దేశాల బదర్‌ ఒప్పందంలో ఆయుధాల ఉత్పత్తి, టెక్నాలజీ అభివృద్ధి, రక్షణ పరిశోధనకు ప్రోత్సాహం తప్ప ఉమ్మడి రక్షణ బంధం లేదు. ఈ రెండు సైనిక కూటముల మధ్యనున్న ఈ ప్రధాన వ్యత్యాసం గమనించ దగింది. తుర్కియె నాటో కూటమి సభ్యురాలు, కటార్‌ లో అతిపెద్ద అమెరికా సైనిక స్థావరముంది. సౌదీ అరేబియా అమెరికాకు అతి సంపన్న మిత్రదేశం. అందువల్ల ఇవేవీ స్వతంత్ర సైనిక శక్తిగా ఎదగలేవు.
ఈ కూటములు భౌగోళికంగా భారత్‌కు అతిచేరువలో ఉన్నందున, పాకిస్థాన్‌ సైనిక శక్తిగా ఆ రెండింటిలో ప్రధాన భాగస్వామిగా ఉన్నందున ఈ పరిణామాలు గమనించక తప్పనివి. భారత్‌కు సౌదీ అరేబియా, కటార్‌, ఇండోనేషియాలతో బలమైన ఆర్థిక, వ్యూహాత్మక సంబంధాలున్నాయి. ఇంధనం, వాణిజ్యంలో సౌదీ ముఖ్యమైన భాగస్వామి కాగా, కటార్‌ ప్రధానమైన గ్యాస్‌ సరఫరాదారు. ఇండోనేషియాతో కూడా భారత్‌ రక్షణ సహకారం వృద్ధి చెందుతున్నది. బ్రహ్మోస్‌ మిస్సిలీలు, ఉమ్మడిగా రక్షణ ఉత్పత్తుల రంగాల్లో సహకారం వృద్ధి చెందుతున్నది. ఆ సైనిక కూటముల్లో ఉన్న దేశాలు భారత్‌కు వ్యతిరేకంగా ఉమ్మడి కూటమి కాజాలవు.
భారత్‌తో వాటికి దీర్ఘకాలిక ప్రయోజనాలున్నాయి. ఇవాళ ప్రపంచ దేశాలు ప్రచ్ఛన్న యుద్ధకాలంలోలాగా శిబిరాలకు కట్టుబడిలేవు. తమ ప్రయోజనాలు గీటురాయిగా అమెరికా, చైనా రెండింటితోనూ సహకారం పెంపొందించుకుంటున్నాయి. అయితే మిలటరీ టెక్నాలజీ, ఆయుధాల ఉత్పత్తిని ఎవరు నియంత్రిస్తారు, భద్రతా నిర్ణయాలు ఎవరు తీసుకుంటారు అనేది భవిష్యత్‌లో స్వతంత్ర దేశాల
నిర్ణయాలను బహుశా ప్రభావితం చేస్తుంది.

ట్యాగ్‌లు: editorial Today news