Skip to content
ఆంధ్రప్రదేశ్ › వార్తలు

AP Local Body Elections: ఆంధ్రప్రదేశ్‌లో ముగిసిన పరిషత్ ఎన్నికల నామినేషన్ల పర్వం.. 57,626 నామినేషన్లతో హీటెక్కిన గ్రామీణ రాజకీయం..

jagan 24 Oct 2026 1 నిమిషాల పఠనం ఆంధ్రప్రదేశ్
AP Local Body Elections: ఆంధ్రప్రదేశ్‌లో ముగిసిన పరిషత్ ఎన్నికల నామినేషన్ల పర్వం.. 57,626 నామినేషన్లతో హీటెక్కిన గ్రామీణ రాజకీయం..

పార్టీ విరాళాల స్వీకరణలో డీఎంకే టాప్...రూ. 140 కోట్లతో వైసీపీ 3వ స్థానం..టీడీపీది 4వ స్థానం

AP Local Body Elections: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా జెడ్పీటీసీ (ZPTC), ఎంపీటీసీ (MPTC) ఎన్నికల నామినేషన్ల ఘట్టం ముగియడంతో గ్రామీణ ప్రాంతాల్లో రాజకీయ వాతావరణం ఒకేసారి వేడెక్కింది. స్థానిక పరిషత్ పోరులో తమ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసుకునేందుకు ప్రధాన రాజకీయ పక్షాలతో పాటు స్వతంత్ర అభ్యర్థుల నుంచి కూడా రికార్డు స్థాయిలో స్పందన లభించింది.

నూతనంగా పునర్వ్యవస్థీకరించిన 28 జిల్లాల పరిధిలోని మొత్తం 659 జెడ్పీటీసీ స్థానాలకు ఏకంగా 5,724 నామినేషన్లు దాఖలు కాగా, 9,829 ఎంపీటీసీ స్థానాలకు 51,902 నామినేషన్లు అందాయి. రెండు విభాగాల్లోనూ కలిపి మొత్తం 57,626 నామినేషన్లు నమోదయ్యాయని రాష్ట్ర ఎన్నికల సంఘం (APSEC) వెల్లడించింది. ముఖ్యంగా నామినేషన్ల దాఖలుకు చివరి రోజైన శుక్రవారం ఒక్కరోజే జెడ్పీటీసీలకు 3,315, ఎంపీటీసీలకు 25,016 నామినేషన్లు దాఖలు కావడం పరిషత్ ఎన్నికల హోరాహోరీ తీవ్రతను తేటతెల్లం చేస్తోంది.

ఎంపీటీసీ , జెడ్పీటీసీ స్థానాల్లో ప్రధానంగా అధికార తెలుగుదేశం పార్టీ (TDP) , ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు (YSRCP) నువ్వా-నేనా అన్న రీతిలో భారీగా అభ్యర్థులను రంగంలోకి దించాయి. రాష్ట్రవ్యాప్తంగా ఎంపీటీసీ స్థానాల కోసం టీడీపీ తరఫున అత్యధికంగా 22,013 నామినేషన్లు దాఖలు కాగా, వైఎస్సార్‌సీపీ నుంచి 20,556 నామినేషన్లు వచ్చాయి. కూటమి భాగస్వామ్య పక్షాలైన జనసేన పార్టీ (JSP) తరఫున 4,609 మంది, భారతీయ జనతా పార్టీ (BJP) నుంచి 1,150 మంది తమ నామినేషన్లను సమర్పించారు.

అదేవిధంగా జెడ్పీటీసీ బరిలో కూడా ప్రధాన పార్టీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. టీడీపీ తరఫున 2,078 నామినేషన్లు, వైఎస్సార్‌సీపీ తరఫున 1,815 నామినేషన్లు దాఖలయ్యాయి. కూటమి నుంచి జనసేన 679 స్థానాల్లో, సీపీఐ(ఎం) 74, బిజెపి 255 స్థానాల్లో నామినేషన్లను వేయగా, కాంగ్రెస్ పార్టీ తరఫున 315 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటికి తోడు వందలాది మంది స్వతంత్ర అభ్యర్థులు (Independents) కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా అత్యంత ప్రశాంతమైన వాతావరణంలో, పూర్తి పారదర్శకతతో రికార్డు స్థాయిలో నామినేషన్లు నమోదయ్యాయని కూటమి నేతలు పేర్కొన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా వేలాది మంది ప్రతిపక్ష అభ్యర్థులు నామినేషన్లు వేసినప్పటికీ, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంపై కావాలని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అధికార పార్టీ నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. జగన్ రాజకీయ విధానాన్ని వారు ‘హిట్ అండ్ రన్’ (Hit and Run) థియరీగా అభివర్ణించారు.

కేవలం అమరావతి లేదా విజయవాడకు వచ్చి మీడియా సమావేశాలు పెట్టి నిరాధారమైన వ్యాఖ్యలు చేయడం, ఆ తర్వాత తిరిగి బెంగళూరు వెళ్లిపోవడం జగన్‌కు అలవాటుగా మారిందని విమర్శించారు. క్షేత్రస్థాయి రాజకీయ వాస్తవాలను, అత్యధిక సంఖ్యలో దాఖలైన తమ పార్టీ అభ్యర్థుల నామినేషన్ల గణాంకాలను గమనించకుండా జగన్ వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. మొత్తానికి నామినేషన్ల స్వీకరణ ఘట్టం ముగియడంతో ఇప్పుడు అధికారుల పరిశీలన (Scrutiny), నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియపై అందరి దృష్టి నెలకొంది.