Skip to content
బిజినెస్ › వార్తలు

WhatsApp: సిమ్ లేకుండా వాట్సాప్ వాడుతున్నారా.. కొత్త రూల్స్ వచ్చేశాయ్.. యూజర్లు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు..

jagan 23 Oct 2026 1 నిమిషాల పఠనం బిజినెస్
WhatsApp: సిమ్ లేకుండా వాట్సాప్ వాడుతున్నారా.. కొత్త రూల్స్ వచ్చేశాయ్.. యూజర్లు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు..

Whatsapp news

సైబర్‌ మోసాలకు చెక్‌ పెట్టేందుకు కేంద్రం కీలక నిర్ణయం
వాట్సాప్, టెలిగ్రామ్‌లకు ‘సిమ్-బైండింగ్’ నిబంధనలు తప్పనిసరి

WhatsApp: దేశంలో రోజురోజుకూ విపరీతంగా పెరుగుతున్న డిజిటల్, సైబర్‌ ఆర్థిక మోసాలను అరికట్టడానికి భారత కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. వాట్సాప్, టెలిగ్రామ్ వంటి ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌లకు కఠినమైన ‘సిమ్-బైండింగ్’ (SIM-Binding) నిబంధనలను కేంద్ర టెలికాం శాఖ (DoT) జారీ చేసింది. ఈ నూతన భద్రతా మార్గదర్శకాలను డిసెంబర్ 31, 2026 నాటికి విధిగా అమలు చేయాలని టెలికాం ఆపరేటర్లను, సంబంధిత యాప్ యాజమాన్యాలను ఆదేశించింది. దీని ప్రకారం, 2027 జనవరి 1వ తేదీ నుంచి ఈ నిబంధనలు దేశవ్యాప్తంగా పూర్తిస్థాయిలో అమలులోకి రానున్నాయి.

ప్రస్తుతం అమలులో ఉన్న వ్యవస్థ ప్రకారం.. మెసేజింగ్ యాప్‌లో ఒకసారి ఓటీపీ (OTP) ద్వారా నంబర్ రిజిస్టర్ చేసుకున్న తర్వాత, సదరు సిమ్ కార్డు మొబైల్‌లో లేకపోయినా కేవలం వై-ఫై (Wi-Fi) ఆధారంగా లేదా ఇతర పరికరాల్లో ఆ యాప్‌లను సునాయాసంగా వాడుకునే వెసులుబాటు ఉంది. అయితే రాబోయే సిమ్-బైండింగ్ నిబంధన ప్రకారం.. ఏ పరికరంలోనైతే యాప్ పనిచేస్తోందో అదే డివైస్‌లో సదరు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు సంబంధించిన యాక్టివ్ సిమ్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. ఒకవేళ వినియోగదారులు ఫోన్ నుంచి సిమ్ కార్డును తొలగిస్తే ఆయా డివైజ్‌లలో వాట్సాప్, టెలిగ్రామ్ సేవలు తక్షణమే నిలిచిపోతాయి.

ఇటీవలి కాలంలో సైబర్ నేరగాళ్లు నకిలీ వివరాలతో సిమ్ కార్డులు పొంది, ఒక్కసారి ఖాతాలు తెరచి ఆ తర్వాత సిమ్ కార్డులను పారేసి లేదా తీసివేసి విదేశాల నుంచి, ఇతర సెకండరీ డివైజ్ల ద్వారా ఆర్థిక మోసాలకు పాల్పడుతున్నారు. ఈ సాంకేతిక లోపాలను ఆసరాగా చేసుకుని జరుగుతున్న కోట్లాది రూపాయల ‘డిజిటల్ అరెస్ట్’ , ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్‌లకు అడ్డుకట్ట వేయడమే ఈ సిమ్-బైండింగ్ నిబంధన ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. అయితే, ఈ నిర్ణయం వల్ల తరచూ సిమ్ కార్డులు మార్చేవారికి, ఒకే నంబర్‌ను పలు పరికరాల్లో వాడేవారికి , విదేశీ ప్రయాణాలు చేసేవారికి కొంత ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు.

ప్రస్తుతం ఒకసారి క్యూఆర్ (QR) కోడ్ స్కాన్ చేసి లాగిన్ అయితే, ప్రాథమిక ఫోన్ స్విచ్ ఆఫ్ అయినా లేదా ఇంటర్నెట్ లేకపోయినా డెస్క్‌టాప్/లాప్‌టాప్‌లలో వెబ్ వాట్సాప్, టెలిగ్రామ్‌లు పనిచేస్తూనే ఉన్నాయి. నూతన నిబంధనలు అమలులోకి వస్తే ఈ వెసులుబాటు నిలిచిపోనుంది. డెస్క్‌టాప్ లేదా వెబ్ వెర్షన్ నడవాలంటే.. యాక్టివ్ సిమ్ ఉన్న మొబైల్ తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో ఉండటం లేదా నెట్‌వర్క్ కనెక్టివిటీ కలిగి ఉండటం నిబంధన కానుంది. వెబ్ సెషన్లు నిరంతరాయంగా పనిచేయడానికి బదులుగా, నిర్ణీత వ్యవధిలో సిమ్ నెట్‌వర్క్‌ను పునఃపరిశీలించే (Verify) ప్రత్యేక వ్యవస్థను రూపొందించాలని టెక్ కంపెనీలను ప్రభుత్వం ఆదేశించే అవకాశం ఉంది. ఫోన్ నుంచి సిమ్ తీసివేస్తే వెబ్ సెషన్లు కూడా వెంటనే లాగౌట్ అయిపోతాయి.